రాబోయే కాలంలో షాపింగ్ ఎలా ఉంటుందో ఊహించారా..?

ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు తెస్తున్న "ప్రేక్ష్" స్టార్టప్

రాబోయే కాలంలో షాపింగ్ ఎలా ఉంటుందో ఊహించారా..?

Friday May 13, 2016,

4 min Read


"ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ షాపింగ్" వినడానికి కొత్తగా ఉంది కదూ..!...

అందుకే "ప్రేక్ష్" ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ కామర్స్ కంపెనీల దూకుడుకి హడలెత్తిపోతున్న రీటైల్ దుకాణాలకు " ప్రేక్ష్" అందుబాటులోకి తెచ్చిన "ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ షాపింగ్" వరంలా మారింది. ఇంతకీ ఈ "ప్రేక్ష్" ఏమిటంటే ఆగుమెంటెడ్ రియాలటీ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న ఓ స్టార్టప్ .

సంజనకి షాపులకెళ్లి దుస్తులు కొనుగోలు చేయాలంటేనే ఇష్టం. అక్కడైతే షాపులో ప్రతి వస్తువును పట్టి చూస్తూ.. పరిశీలించి ధర చూస్తూ... అవసరైతే ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తూ షాపింగ్ చేయవచ్చు. కానీ సంజన ఇటీవలి కాలంలో అలా బయటకు వెళ్లి షాపింగ్ చేసిన సందర్భం తక్కువ. సమయం లేకపోవడం.. ట్రాఫిక్ జాములు.. ఎండలు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు షాపింగ్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాయి. అయినా ఆమె ఏమీ ఫీలవడం లేదు. అలా అని ఈ-కామర్స్ కంపెనీల్లో దొరికినవి ఏవో కొనుగోలు చేయడం లేదు. తను వెళ్లాలనుకున్న దుకాణంలోనే ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేస్తోంది. బొమ్మల్ని చూసి కాదు..నిజంగా వస్తువల్ని చూసే... దుకాణంలో ప్రతీ మూలలో ఉన్న వస్తువును పరిశీలిస్తూ తనకు కావాల్సినవి కొనుగోలు చేస్తోంది. అచ్చంగా ఆఫ్ లైన్ షాపింగ్ అనుభూతిని ఆన్ లైన్ లో చేస్తోంది.

ఇది ఎలా సాద్యం..? ...

అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా సాధ్యం.. ! ఈ టెక్నాలజీని ఆఫ్ లైన్ షాపుల కోసం అభివృద్ధి చేసి రెండు పెటెంట్లు సైతం పొందిన స్టార్టప్ "ప్రేక్ష్" సరికొత్త మార్కెట్ సృష్టిస్తోంది. ఏఆర్ టెక్నాలజీ ద్వారా షాపు మొత్తాన్ని వీడియో తీసి.. దాన్ని ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ఆ దుకాణానికి సంబంధించిన వెబ్ సైట్ లేదా మార్కెటింగ్ చానల్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. ఆ దుకాణంలో షాపింగ్ చేయాలనుకున్న కస్టమర్ ఇంట్లోనే .. ఆ ఏఆర్ చానల్ పై క్లిక్ చేస్తే చాలు మనకు ఆ స్టోర్ మొత్తం కళ్ల ముందు ఉంటుంది. ఏ ఫ్లోర్ కి వెళ్లాలన్నా.. ఏ మూల ఉన్న వస్తువును చూడాలన్న ఒక్క క్లిక్ తో సరిపోతుంది. నడుచుకుంటూ వెళ్లి ర్యాకుల్లో ఏమేమి ఉన్నాయో పరిశీలిస్తూ వెళ్లే అనుభూతి కలిగే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. నడుచుకుంటూ మెట్లెక్కెతూ పైకివెళ్లి షాపులో మూలమూలా చూసి రావచ్చు. ఇంట్లో ఉండే అక్కడున్న వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

"మా టెక్నాలజీ ఆఫ్ లైన్ స్టోర్లలోకి వెబ్, మొబైల్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్లినట్లే వెళ్లి షాపింగ్ చేసే అనుభూతి కల్పిస్తుంది. వాటిని ఫిజికల్ గా చూసిన ఫీలింగ్ కల్పిస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్లోని వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసుకోవచ్చు. " ఎం.ఎ.కోదండరామ, ప్రేక్ష్ ఫౌండర్

ఆన్ లైన్ షాపింగ్ లో ఉన్న పరిమితులే ఈ ఆగుమెంటెడ్ రియాలిటీకి మంచి ఆదరణ కల్పించేలా చేస్తోంది. ఆన్ లైన్ షాపింగ్ లో కావాల్సిన ఉత్పత్తుల కోసం వెదుకుతాం. అదే ఈ టెక్నాలజీలో అయితే షాపు మొత్తం కలియదిరిగి మనకు కావాల్సినవాటిని ఎంపిక చేసుకోవచ్చు.

ప్రేక్ష్ వ్యవస్థాపకులు<br>

ప్రేక్ష్ వ్యవస్థాపకులు


"ప్రేక్ష్ " అనువజ్ఞుల స్వప్నం

టెక్నాలజీ ఆధారంగా ప్రారంభమయ్యే స్టార్టప్స్ అన్నీ దాదాపుగా కొత్త తరానికి చెందిన వారివే ఉంటాయి. కానీ ఈ అడ్వాన్సుడ్ ఆగుమెంటెండ్ రియాలిటీ టెక్నాలజీ స్టార్టప్ ఆలోచన మాత్రం యాభై ఏళ్ల ఎం.ఎ.కోదండరామ మదిలో వచ్చింది. ఎంఎకేగా పేరు తెచ్చుకున్న ఈయన విప్రో, నోకియా, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ లో సుదీర్ఘకాలం పనిచేశారు. సొంతంగా స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తర్వాత కొంత మంది పార్టనర్లును ఎంపిక చేసుకున్నారు. మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో యాక్సెంచర్, సిటీబ్యాంక్ లాంటి ఎమ్మెన్సీ కంపెనీల్లో ఆరేళ్ల పాటు పనిచేసిన సాకేత్ సిన్హా ఎంఎకేతో చేతులు కలిపారు. టెక్నికల్ అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ లో నాలుగేళ్ల అనుభవం ఉన్న సాత్విక్ మురళీధర్, మల్టీమీడియా రంగంలోనే దశాబ్దానికిపైగా అనుభవం సంపాదించిన టీ.సీ.శరత్ కో ఫౌండర్లుగా స్టార్టప్ ని ప్రారంభించారు.

ఈటెక్నాలజీ ఉపయోగాన్ని ముందుగా ఆఫ్ లైన్ స్టోర్ల యజమానులకు అర్థం చేసుకునేలా చేయడమే మొదట్లో పెద్ద సవాల్ గా మారిందనిఈ బృందం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే వీరు రెండు ఆఫ్ లైన్ బ్రాండ్ స్టోర్లతో ముందుగా అవగాహన కుదుర్చుకున్నారు. ప్రేక్ష్ ఏఆర్ టెక్నాలజీతో ఆ స్టోర్లు అనుసంధానమైన తర్వాత వారి బిజినెస్ పదహారు శాతం పెరిగింది.

" విర్చువల్ స్టోర్స్ తో ఆఫ్ లైన్ స్టోర్లకు ఎలాంటి డిస్కౌంట్లు ఇచ్చే అవసరం లేకండా ఆదాయాన్ని పెంచగలుగుతున్నాం. ఈ విధానాన్ని వినియోగదారులకు మరింత చేరువగా తీసుకెళ్లడమే మా లక్ష్యం" ఎంఎకే, ప్రేక్ష్ ఫౌండర్

ప్రేక్ష్ టీం <br>

ప్రేక్ష్ టీం


విస్త్రతమైన అవకాశాలు

ప్రేక్ష్ ప్రస్తుతం గూగుల్ స్ట్రీట్ వ్యూ టెక్నాలజీని ఉపయోగించుకంటోంది. ఆఫ్ లైన్ స్టోర్ లో మొదట... 360డిగ్రీల పానోరమిక్ టూర్ ని రికార్డు చేస్తారు. స్టోర్ లో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనిపించేలా ఈ దృశ్యీకరణ ఉంటుంది. తర్వాత దానికి ఏఆర్ పద్దతిలో మెరుగులు దిద్ది.. అక్కడున్న వస్తువులన్నింటినీ ఆన్ లైన్ లో కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా వెబ్ సైట్, ఈకామ్ అక్కర్లేదు. సోషల్ మీడియాలో అయినా దీని ద్వారా షాపింగ్ చేయవచ్చు.

ప్రేక్ష్ బేటా వెర్షన్ ను విడుదలచేయాడానికి ఎనిమిది నెలల సమయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో బెంగళూరులోని పదిహేను స్టోర్లకు దీనిని అందుబాటులోకి తెచ్చారు. బేబీఓయే, వ్యాన్ హ్యూసేన్ లాంటి స్టోర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ఆఫ్ లైన్ స్టోర్లలో విస్త్రతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎడ్యూకషనల్ ఇన్ స్టిట్యూషన్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎయిర్ పోర్టులు, మాల్స్ కు కూడా విస్తరించేంలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

భవిష్యత్ బంగారం

రెండు మూడేళ్లుగా వర్చువల్ రియాలిటీ, అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా ఇప్పటికే వర్చవల్ రియాలిటీ రంగంలో భారీమొత్తం పెట్టుబడి పెట్టింది. ఆన్ లైన్ షాపింగ్ లో వర్చువల్ రియాలిటీని మెన్ స్ట్రీమ్ చేయాలని అలీబాబా ప్రయత్నం చేస్తోంది. గూగుల్,ఫేస్ బుక్ కూడా ఇప్పటికే ఈ రంగంలో పరిశోధనల కోసం ఐదు బిలియన్ల డాలర్లు పెట్టుబడులుగా పెట్టాయి.

వినియోగదారులు సరికొత్త అనుభూతిని పొందడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. దాంతో ఈ ఆగుమెంటెడ్ రియాలిటీ సంచలనాలు సృష్టించే సందర్భం చాలా దగ్గరలోనే ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. దానిలో మొదటి అడుగు "ప్రేక్ష్" దే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెబ్ సైట్