అందరూ ఉద్యోగావకాశాల కోసం వెతుకుతూ ఉంటే.. ‘‘మేం మా ఉద్యోగాలు కోల్పోవడంలో కూడా ఓ గొప్ప అవకాశాన్ని చూశాం’’ అంటున్నారు జంపింగ్ గూస్ (JUMPINGGOOSE) వ్యవస్థాపకులు.
అది 2010 ఫిబ్రవరి. తుహీన్ ఉద్యోగం పోయిందంటూ చాలా ఆవేదనగా పీయూష్ అతడికి ఫోన్ చేశాడు. అప్పట్లో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారిలో తుహీన్ కూడా ఒకరు. విషాదమేంటంటే ఏడాది గడిచే సరికి అంటే 2011లో పీయూష్ కూడా అదే బాటపట్టాడు.
‘‘ఆ రోజు పరిస్థితంతా చాలా నాటకీయంగా అనిపించింది. ఆ రోజు నేను సెలవులో ఉంటే.. పీయూష్ కాల్ చేసి నా ఉద్యోగం పోయిందని చెప్పాడు. దీంతో నేనూ డైలమాలో పడిపోయాను. కొద్ది రోజుల తర్వాత నేను ఆఫీసుకు వెళ్లి నా క్యాబిన్లో కూర్చున్నాను. కాసేపటికే.. ‘మీరు ఇక వెళ్లొచ్చు’ అని చెప్పేశారు.’’ అని నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు తుహీన్.
అయితే, రోజూ బాతాఖానీ వేసుకొనే చోట ఇద్దరు మిత్రులూ కలవడం మాత్రం ఆగలేదనుకోండి.
‘‘ మిమ్మల్ని ఎవరైనా జాబులో నుంచి తీసేశారంటే.. మిగతా కంపెనీలు కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవు. మీరు బతుకు బండిని లాగడానికి ఎలాగూ ఏదో ఒకటి చేయకతప్పదన్న సంగతి తెలుసుకొని తక్కువ జీతాలే ఆఫర్ చేస్తాయి’’ అని తుహీన్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. అంతమాత్రాన తమ పరుగు ఆగలేదని అన్నారు. డిజైన్ పట్ల తమ ప్రేమ, కేవలం బట్టలకే పరిమితం కాకుండా ఇంకా విభిన్నంగా డిజైన్లు రూపొందించాలన్న తపన తమను ముందుకు నడిచిపించిందన్నారు.
యురేకా ! ఒక కొత్త ఐడియా. వారి స్థానంలో ఉన్నవారెవరూ ఆలోచించని ఓ అద్భుతమైన ఐడియా వారికొచ్చింది. అది ‘జంపింగ్ గూస్’గా అవతరించింది.
‘‘2009 నుంచీ ఈ ఐడియా మా బుర్ర తలుపు తుడుతూనే ఉంది. అయితే మా ఉద్యోగాలు పోవడంతో అది బయటకొచ్చింది. ఓ కొత్త ఆవిష్కరణకు తెరతీసింది. మా అంతట మేముగా ఏదో సాధించాలన్న తపన మాకు ఎప్పుడూ ఉండేది. అదే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది.’’ అని చెబుతారు సహ వ్యవస్థాపకులిద్దరూ.
జంపింగ్ గూస్
జంపింగ్ గూస్ 2011లో వాస్తవ రూపం దాల్చింది. కంపెనీ పేరు విషయంలో ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకొని కంపెనీకి ఈ పేరు పెట్టారు. జంపింగ్(ఎగరడం) అన్నది వినోదానికి, వేగానికి, అలుపెరగకుండా సాగడానికి చిహ్నమైతే.. గూస్(బాతులు) సమన్వయానికి, ప్రత్యేకించి ఒక నాయకుడని లేకున్నా కూడా కలిసికట్టుగా ముందుగు సాగే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
‘‘ప్రత్యేకించి ఒకే నాయకుడంటూ లేకుండా కూడా ఈ బాతులు జట్టుకట్టి ముందుకుసాగుతాయి. ఉమ్మడిగా సృజనశీలత ఉండడం, స్వేచ్ఛగా ఆలోచించడం, మరింత కారుణ్యంతో వ్యవహరించడమన్నది మన సంస్కృతిలో భాగం కూడా’’
ఈ సహ వ్యవస్థాపకులు అందరిలాంటి వారు కాదండోయ్. వీరి ఆలోచనలంతా స్వేచ్ఛాభావనల చుట్టే తిరుగుతుంటాయి. మన సంస్కృతిని ప్రతిబింబించే ఫిలాసఫీ కలసిన డిజైన్ రూపొందించడంలో వీరు దిట్ట. అయితే డిజైన్ రంగాన్నే ఎందుకు ఎంచుకున్నారు ? అని అడిగితే,
‘‘మాకు డిజైన్ తప్ప వేరే ఏదీ అర్థం కాదు’’ అని నవ్వుతూ సెలవిచ్చారు.
మళ్లీ కిందకు..
అయితే వారు మరోసారి అనుకోకుండా మరింత దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. 2012లో వారికి ఎలాంటి టీమ్ లేనప్పటికీ వారే అన్నీ చూసుకుంటూ సంస్థను నడిపిస్తున్నారు. ఆ సమయంలో వారు చాలా మంది క్లయింట్లను కలిసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. కొన్ని అసైన్మెంట్లు వచ్చినప్పటికీ డబ్బులు మాత్రం రాలేదు.
ఇక కంపెనీ మూసేద్దామని అనుకున్నారిద్దరూ. అయితే 2013లో వారి కృషి ఫలించింది. ‘‘పడి లేచిన కెరటంలా ముందుకు సాగాలన్న సంకల్పమే 2013లో మా మంత్రం. ఈ ఏడాదిని టర్నింగ్ పాయింట్‌గా మార్చుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అనుకున్నంతా అయ్యింది. చిన్న చిన్న క్లయింట్ల ద్వారా ముందుకుసాగాం. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది.’’ అని తెలిపారు.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ...
ఇప్పుడు, 16 మంది సభ్యుల బృందం డిజైన్ ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకుంది. తమకంటూ ఓ కొత్త స్టూడియో ఏర్పాటు చేసుకొంది. బిజినెస్ జైంట్ మింత్రా(Myntra)యే వారి మొదటి పెద్ద ప్రాజెక్టు. ఆ తర్వాత వారు వెనుదిరిగి చూసుకోలేదు. సెలబ్రిటీ ఫ్యాషన్ బ్రాండ్ HRX (Hrithik Roshan Extreme) పనులను వీరే చూస్తున్నారు. అలాగే ఒక ఫ్లిప్ కార్ట్ ఆఫీసులో క్రాఫ్ట్ ఇన్స్టలేషన్ల బాధ్యత కూడా వీరే తీసుకున్నారు. కొత్త కొత్త విధాలుగా కొత్త మార్కెట్లోకి తీసుకెళ్లడానికి తాము ఎప్పుడూ ముందుంటామని చెబుతున్నారు. వోక్స్ పాప్ లాంటి కొత్త స్టార్టప్‌ల నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో కూడా తాము కలిసి పనిచేశామని చెబుతున్నారు.
ఫిలాసఫీ
తమ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చే కొత్త డిజైన్లను తాము చాలా ప్రేమిస్తామని వీరు చెబుతున్నారు. ‘‘ డిజైన్ అన్నది మానవ జీవితంలో ఓ భాగమని మేం నమ్ముతాం. ఒక వ్యక్తి లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో చూస్తాడు, అనుభూతి చెందుతాడు, వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందేలా మన డిజైన్ ఉండాలి’’ అంటున్నారు ఈ జంపింగ్ గూస్ వ్యవస్థాపకులు.