అవినీతి అనే పదం వింటే చాలు ఆయన ఆమడ దూరం జరుగుతారు. దాని వాసన ఎక్కడున్నా పసిగట్టి పనిపడతారు. లంచాలు తీసుకునే వాళ్లన్నా.. డబ్బు రుచిమరిగి సామాన్యులను పిప్పిచేసే వాళ్లన్నా ఆయనకు మహా కోపం. ఉన్నతాధికారులు, పొలిటీషియన్లు, బిజినెస్‌మెన్, దొంగ స్వామీజీలు... ఆయన ఎవరినీ వదిలిపెట్టరు. అవినీతికి పాల్పడిన వాళ్లను ఊచలు లెక్కపెట్టేలా చేయడమే ఆయన కర్తవ్యం. ఆశ్చర్యం ఏంటంటే.. ఆయన పనిచేసింది పోలీస్ శాఖలోనే అయినా ఆ డిపార్ట్‌మెంట్ వాళ్లకు కూడా తనంటే టెర్రర్. కరప్షన్‌ను అంతం చేయడంలో భాగంగా ఆయన చేసిన సేవ మామూలుది కాదు. ఎసిబి, సిబిఐలలో పనిచేసి వందలాది మంది అవినీతిపరులను జైల్లో కూర్చోబెట్టిన ఘనత తనది. 'స్టింగ్ కింగ్', 'యాక్షన్ హీరో' తనకు మారుపేర్లు. ఢిల్లీని గడగడలాంచి ఇప్పుడు ఓ సామాన్యుడిలా ఒంటి చేత్తో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ వ్యక్తే ఎన్.డి. కుమార్.. నిమ్మకాయల దిలీప్ కుమార్, ఐపిఎస్. ఆయన తెలుగువారు కావడం.. అందునా విజయనగరం వాసి కావడం.. మనకే గొప్ప.
గోవాలో నార్కోటిక్ ముఠా గుట్ట రట్టుచేశారు. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను, వాటిని తెస్తున్న ముఠాలకు ముచ్చెమటలు పట్టించారు. ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్లు, సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సిఎండి స్థాయిల వ్యక్తుల అవినీతిని సాక్ష్యాధారలతో సహా బయటపెట్టి వాళ్లందరినీ బోనెక్కించారు. ముక్కుసూటి, ఎవరికీ భయపడిన నైజం, ఎలాంటి ఒత్తిళ్లనైనా ఎదుర్కోవడం ఆయన అలవర్చుకున్న లక్షణాలు. గోవా, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో దిలీప్ కుమార్‌కు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదు. మీడియా, జనాలు ఒకప్పుడు ఆయనను ఆకాశానికెత్తారు. అవినీతి భరతం పట్టే టఫెస్ట్ అధికారిని ఇప్పుడే చూస్తున్నామంటూ జేజేలు కొట్టారు.
దిలీప్ కుమార్‌ది విజయనగరం. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి కనకభూషణం ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసేవారు. దీంతో చిన్నప్పటిలో వాళ్ల కుటుంబంలో దేశభక్తి పాళ్లు ఎక్కువే. అక్కడి ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియార్ ఫిజిక్స్‌లో MSc చేసి లెక్చరర్‌గా కూడా పనిచేశారు. 1981లో సివిల్స్ రాసి గ్రూప్ బి అధికారిగా గోవాలో పోలీసు శాఖలో డిఎస్పీగా నియమితులయ్యారు. గోవాలో ఛార్జ్ తీసుకున్నారు. అక్కడి డ్రగ్ డీలర్స్, పెడ్లర్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశారు. పర్యాటక ప్రాంతమైన గోవాలో టూరిస్టులకు, స్థానికులకు భద్రతపై భరోసా కల్పించారు. ఆరేళ్లలోనే ఐపిఎస్‌గా (1987 బ్యాచ్) పదోన్నతి పొంది సిబిఐలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఏడేళ్ల పాటు గోవా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్ బాధ్యతలను చూసుకున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ ఐటి కమిషనర్, గోవా షిప్‌యార్ట్ సిఎండి, బెంగళూరు సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులను పట్టుకుని దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. ఢిల్లీ ఏసిబిలో రెండేళ్లు, విజిలెన్స్‌లో మూడేళ్లు పనిచేశారు.
స్టింగ్ కింగ్
దేశంలో మొట్టమొదటిసారి స్టింగ్ ఆపరేషన్ల ద్వారా అవినీతి తిమింగళాలను పట్టుకుని శిక్షపడేలా చేసిన వ్యక్తి దిలీప్ కుమార్. పూర్తి సాక్ష్యాధారాలతో.. కేసు ఏ మాత్రం నీరుగాకుండా అంతా పకడ్బందీ ప్రణాళికతో ఆయన వేసిన ఉచ్చులో ఎంతో మంది అధికారులు చిక్కుకుని విలవిలలాడరు. ఫోన్లలో వాయిస్ రికార్డింగ్, ఫోన్ కెమెరాలతోనే అవినీతిని చిత్రీకరించి బంధించడం ఆయన స్పెషాలిటీ. తమ శాఖలోని ఎవరి సాయమూ లేకుండా.. కంప్లైంట్ ఇచ్చిన వారినే అస్త్రంగా వాడుకుని అవినీతికి చెక్ పెట్టారు కుమార్.
'' ఓ సారి ఢిల్లీలో ఓ ఫ్లోరిస్ట్ షాప్ నడిపే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మునిసిపాలిటీ సిబ్బంది తనని లంచం కోసం వేధిస్తున్నాడని మొరపెట్టుకున్నారు. అయితే నీ దగ్గర లంచం తీసుకునే ప్రతీ ఒక్కరినీ పట్టించగలవా అని అడిగాను. అప్పుడు అతనికి పక్కాగా స్క్రిప్ట్ రాసిచ్చి.. ఒక్కో అవినీతి అధికారినీ ట్రాప్‌లో దించాం. వాళ్ల వాయిస్‌లను, వీడియోలను ఫోన్‌లోనే రికార్డ్ చేయమని చెప్పా. ఆ ఫ్లోరిస్ట్ పక్కాగా అమలు చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే.. ఓ చిన్న ఫ్లోరిస్ట్ కేసులో మొత్తం 20 మంది ప్రభుత్వ సిబ్బంది బుక్కయ్యారు. వాళ్లందరి మీదా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాక్ష్యాలతో ప్రూప్ చేయడంతో అంతా జైలుపాలయ్యారు '' అంటూ ఓ సందర్భాన్ని గుర్తుచేసుకుంటారు దిలీప్.
మరో కేసులో సాంఘిక సంక్షేమ శాఖలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లను, 12 మంది గెజిటెడ్ సిబ్బందిని సింగిల్ షాట్‌లో బుక్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 70 ప్రముఖ కేసులను ఆయన డీల్ చేశారు.
ఒత్తిళ్లు రాలేదా ?
సాధారణంగా పోలీస్ శాఖ అనగానే ఒత్తిళ్లు కామన్. అలాంటిది ఇన్ని కేసులు డీల్ చేసినప్పుడు ఒక్కసారి కూడా ప్రెషర్ రాలేదా అంటే.. రాలేదనే అంటారు. ''ఎందుకంటే ముందు నుంచీ నేను చాలా టఫ్ అని అందరికీ తెలుసు. పొలిటీషియన్లు కూడా నా జోలికి వచ్చేవారు కాదు. ఓ సారి ఢిల్లీ సిఎం షీలా దీక్షిత్‌కు బాగా కావాల్సిన వ్యక్తి జల్ బోర్డ్‌లో పనిచేస్తున్నారు. అతనిని ఓ కేసులో పట్టుకున్నాం. మా దగ్గర సాక్ష్యాలన్నీ పక్కాగా ఉన్నాయి. అసలు అతడు బయటకు వచ్చే ఛాన్సేలేదు. సిఎంతో పెట్టుకుంటున్నావ్.. జాగ్రత్త అని చాలా మంది అన్నారు. కానీ నాకు ఏ ఫోనూ రాలేదు. ఆ ఉన్నతాధికారికి ఆ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఎవిడెన్స్ లేకుండా నేను ఏ కేసూ టేకప్ చేయను. అన్నీ పక్కాగా ఉన్న తర్వాత ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. రికార్డెడ్ ఎవిడెన్స్‌ను నేనే జాగ్రత్తగా డీల్ చేస్తా ''.
ఫ్రెండ్లీ పోలీస్
తన సర్వీసులో ఖైదీలు, అపరాధులను కఠినంగా శిక్షించడం ఆయన నైజం కాదు. వాళ్లను మాటల్లో పెట్టి కౌన్సిలింగ్ చేయడం దిలీప్ స్పెషాలిటీ. నేరస్థులను డీల్ చేసే విధానమే డిఫరెంట్‌గా ఉంటుందని చెప్తారు. వాళ్లకు మనపై నమ్మకం కలిగితే ఆ నేరస్తులే మన మనషులైపోతారని అంటారు. క్రిమినల్స్‌ను కూడా గౌరవంగా ఇచ్చి మాట్లాడితేనే వాళ్ల నుంచి మనకు కావాల్సిన సమాచారం వస్తుందని చెప్తారు దిలీప్.
లోక్‌పాల్ రూపకల్పనలో కీలకపాత్ర
అవినీతిపై సుదీర్ఘ పోరాటం చేసిన దిలీప్ కుమార్ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కూడా కీలకపాత్ర పోషించారు. లోక్‌పాల్ మూమెంట్ సమయంలో అర్వింద్ కేజ్రీవాల్, అన్నా హజారేలకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మొదటిసారి పగ్గాలు చేపట్టినప్పుడు కేజ్రీవాల్‌కు సలహాదారుగా ఉన్నారు.
అప్పట్లో సిఎం బయటపెట్టిన అనేక కుంభకోణాల జాబితా తయారీలోనూ దిలీప్ పాత్ర స్పష్టంగా ఉంది. షీలా దీక్షిత్, ముకేష్ అంబానీపై కరప్షన్ కేసులు రిజిస్టర్ చేయడంలో ఆయన ముఖ్యభూమిక పోషించారు. అయితే లోక్‌పాల్ బిల్లు రాకుండా నీరుగార్చడం, ప్రభుత్వాలకు ధృడ సంకల్పం లేకపోవడం ఆయనను బాధించింది.
యాంటీ బకాసుర్ బ్రిగేడ్
ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చి అక్కడే సెటిల్ అయిన దిలీప్ కుమార్ ఇప్పుడు యాంటీ బకాసుర్ బ్రిగేడ్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవినీతిని రూపమాపడం, కరప్షన్‌పై యువతరంలో చైతన్యం తీసుకురావడమే ఉద్దేశంగా ఆయన ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. అవినీతి అనగానే అసహ్యం పుట్టేలా పిల్లలకు వివరించి చెప్పడం కూడా యాంటీ బకాసుర్ బ్రిగేడ్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం వైజాగ్‌లో మొదలైన ఈ పోరాటం విజయవంతమైతే.. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి బ్రిగేడ్‌లు మొదలుపెడ్తారని చెప్తున్నారు దిలీప్ కుమార్. ఇందుకోసం వైజాగ్‌లో వంద ప్రాంతాలను గుర్తించి వంద మంది కో ఆర్డినేటర్లను ఎంపిక చేయబోతున్నారు. వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి వాళ్లపై నిఘా ఉంచి అవినీతిని బట్టబయలు చేయడం, చట్టసంస్థలకు సహకారంతో వాళ్లకు శిక్షపడేలా చేయడం ఈ బ్రిగేడ్ లక్ష్యం.
జనాల మీద పడి అవినీతి సొమ్మును అడ్డంగా బొక్కేస్తున్న రాజకీయ నేతలు, అధికారులు, దొంగ స్వాములు బకాసురులకు ఏ మాత్రం తీసిపోరని అంటారు దిలీప్. పెట్టీ కేసుల్లో దొరికే దొంగలనే చితకబాది కోర్టులకు ఈడుస్తున్నప్పుడు.. ఇలా కోట్లకు కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటున్న వాళ్లకు ఎలాంటి శిక్షపడాలో ఆలోచించాలని కోరుతున్నారు. ఓ రకంగా అవినీతిపరులంతా సంఘవిద్రోహ శక్తులేననేది ఆయన మాట. అందుకే 'బకాసుర్ - ది జంబో క్రిమినల్' అనే పేరుతో పుస్తకాన్ని రాశారు దిలీప్. తన సర్వీసులో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, కరప్షన్ చేసిన పోరాటాన్ని కథలుగా రాశారు.
ఈ క్యాంపెయిన్‌లో చిన్న పిల్లలు, ఉద్యోగులు, యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లను కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన కో ఆర్డినేటర్లు ఒక్కో ఏరియా బాధ్యత తీసుకుంటారని దిలీప్ వివరించారు. పిల్లలకు మార్గనిర్దేశం చేసేందుకు సీనియర్ సిటిజన్లు కూడా కలిసిరావాలని ఆయన కోరారు.
భవిష్యత్ లక్ష్యాలు
- ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలి.
- ముఖ్యంగా పిల్లల్లో అవినీతి వ్యతిరేకత గురించి అవగాహన పెరిగితే తర్వాతి తరాల్లో అయిన ఇధి కాస్త తగ్గుముఖం పడ్తుంది.
- ఒక్కడితో ఏ పనీకాదు. అందుకే కొంత మంది సమూహం ముందుకు దూకితే ఎక్కడో చోట చిన్న మార్పు అయినా కనిపిస్తుంది.
- విశాఖలో సక్సెస్ చేస్తే.. దేశవ్యాప్తంగా అదే మోడల్‌ను జనాలు అడాప్ట్ చేసుకుంటారు.