షేవింగ్ లో సేవింగ్స్ చేసి చూపిస్తున్న స్టార్టప్
గ్రూమింగ్ మార్కెట్ లోతనదైన ముద్ర వేస్తున్న24 ఏళ్ల సిద్ధార్థ ఒబెరాయ్
సాయంత్రం ఆరింటికి కదా ఫంక్షన్ కి వెళ్లేది.. మధ్యాహ్నం నుంచే హడావుడి ఏంటీ మీ ఇంట్లో..?
పక్కింట్లో ఉండే ఆనందరావు కుతూహలంగా అడిగాడు వెంకట్రావుని..!
ఇప్పుడు మా ఆవిడ మేకప్ ప్రారంభిస్తే అప్పటికి తెములుతుందిలే..! ...మనసులో గొణుక్కున్న వెంకట్రావు.. పైకి మాత్రం "చిన్నపని ఉందిలే..అందుకే ముందే రెడీ అవుతున్నామని" సమాధానం చెప్పాడు
ఆడవాళ్ల ముస్తాబుపై ఇలాంటి జోకులు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ జోక్స్ అన్నీ తిరగబడుతున్నాయి. మగవాళ్ల మీద ఇలాంటి జోక్స్ ఆన్ లైన్ లో పేలిపోతున్నాయి. ఇవన్నీ కౌంటర్ గా వస్తున్న జోక్స్ కాదు.. నిజంగానే పరిస్థితి మారుతోంది. మగవాళ్ల సౌందర్య సాధనాల మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతూండటమే దీనికి సాక్ష్యం.
ప్రస్తుతం భారతదేశంలో కేవలం మగవాళ్ల గ్రూమింగ్ మార్కెట్ రూ. 650 కోట్ల రూపాయలు. దీన్ని అందుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు వినూత్న బ్రాండ్లతో ముందుకొస్తున్నాయి. బడా షాపింగ్ మాల్స్ లో హీరోయిన్లతో మగవాళ్లకు షేవింగ్ చేసేసి పబ్లిసిటీ చేసేస్తున్నారు. అయితే టెక్ ప్రపంచంలో కొత్తతరానికి ప్రతినిధి అయిన "సిద్ధార్థ ఒబెరాయ్" ఈ హంగామా ఏమీ లేకుండానే తన స్టార్టప్ కంపెనీతో గ్రూమింగ్ మార్కెట్ పై కన్నేశాడు. "లెట్స్ షేవ్" పేరుతో మార్కెట్ లోకి దూసుకొచ్చాడు.
"లెట్స్ షేవ్.." షేవింగ్ సేవింగ్స్
మాసిన గడ్డంతో రఫ్ గా ఉండే స్టైల్ కు కాలం చెల్లింది. ఇప్పుడంతా నీట్ అండ్ హాట్. కానీ దీన్ని మెయిన్ టెయిన్ చేయడం మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. రేజర్లు, బ్లేడ్ల ధరలు వేలల్లోనే ఉంటున్నాయి. కాదని సెలూన్ కి వెళ్లామా.. బిల్లు క్రెడిట్ కార్డుకి భారం కావడం ఖాయం. ఎప్పుడో ఓ సారి అంటే కానీ ప్రతీసారి వెళ్లలేం. అలాగే పెద్ద పెద్ద బ్రాండ్లను భారీ ఖర్చు పెట్టిన కొనడం క్లిష్టమైన విషయమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు పుట్టుకొచ్చిన స్టార్టప్ "లెట్స్ షేవ్" . అంతర్జాతీయ బ్రాండ్, దాదాపు వంద దేశాల్లో అమ్మకాలు నమోదవుతున్న అమెరికాకు చెందిన డోర్కో గ్రూమింగ్ ఉత్పత్తలను "లెట్స్ షేవ్" అత్యంత తక్కువ ధరకు అందిస్తోంది. నేరుగా కంపెనీ నుంచి కొనుగోలు చేసి.. వినియోగదారుకి అందిస్తోంది. దాంతో మధ్యలో ఎలాంటి లావాదేవీలు ఉండవు కనుక.. తక్కువ ధరకే కస్టమర్ కే చేరుతోంది. దీంతో యువతరానికి హాట్ ఫేవరేట్ గా మారుతోంది. కేవలం మగవాళ్ల బ్లేడ్లు, రేజర్లే కాదు.. లేడీస్ కి అవసరమైన ఇదే తరహా సరంజామా కూడా లెట్స్ షేవ్ అందిస్తోంది.
సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఐడియా
లెట్స్ షేవ్ ఫౌండర్ 24 ఏళ్ల సిద్ధార్థ ఓబెరాయ్. అమెరికాలోని పుర్డ్యూ యూనివర్శిటీలో చదువుకుంటున్న రోజుల్లో సిద్ధార్థకు డైలీ షేవింగ్ పెద్ద సమస్యగా మారింది. సెలూన్ కి వెళ్లినా.. సొంతంగా రేజర్లు కొనుగోలు చేసినా.. జేబుకి భారంగా మారేవి. దీంతో కొన్ని సందర్భాల్లో షేవింగ్ విషయంలో రాజీ పడాల్సి వచ్చేంది. తనకే కాదు తన ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి సమస్యే ఉందని.. దీనికో పరిష్కారం ఎలా కనుగొనాలా అని ఆలోచించేవాడు. అయితే చదువుల బిజీలో అది అలా ఉండిపోయింది. అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇటలీలో ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు చేశాడు. తర్వాత మళ్లీ అమెరికాలో మోటరోలా హెడ్ ఆఫీస్ లో కొన్నాళ్లు శిక్షణ పొందాడు. తర్వాత ఓ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలోనే తన పాత ఐడియాకు రూపం ఇచ్చాడు. అమెరికాలో ప్రసిద్ధ రేజర్లు, బ్లేడ్ల కంపెనీ అయిన డోర్కోకు తన ఆలోచన వివరిస్తూ మెయిల్ పెట్టాడు. అదే సిద్ధార్థ స్టార్టప్ కు పెద్ద అడుగు అయింది.
సిద్ధార్థ ఒబెరాయ్ తో టైఅప్ అయ్యేందుకు డోర్కో కూడా ముందుకు వచ్చింది. దాంతో సిద్ధార్థ సొంతంగా లెట్స్ షేవ్ స్టార్టప్ ను ఇండియాలో సేవలు అందించేలా ప్రారంభించారు. డోర్కో కాలిఫోర్నియా కేంద్రంగా 1955 నుంచి రేజర్లు తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో డోర్కో ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. కొత్త కొత్త ఉత్పత్తులతో యువతరాన్ని ఈ కంపెనీ ఆకట్టుకుంటోంది.
"తక్కువ ధరలో క్వాలిటీ షేవింగ్ అనే ఐడియా వల్లే లెట్స్ షేవ్ ఆవిర్భవించింది. ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తాం. అందువల్ల ధరలో చాలా ఆదా అవుతుంది. సిక్స్ బేడ్స్ రేజర్ విత్ ట్రిమ్మర్ ను ఆవిష్కరించేందుకు లెట్స్ షేవ్ సిద్ధం అవుతోంది. అలాగే మహిళల కోసం సిక్స్ బ్లేడ్స్ బాడీ రేజర్ ను కూడా విడుదల చేయబోతున్నాం" సిద్ధార్థ ఓబెరాయ్
కస్టమర్లను అర్థం చేసుకోవడమే క్లిష్టం
సిద్ధార్థ స్టార్టప్ పాజిటివ్ రివ్యూస్ పొందుతోంది. అయితే ఇది అంత ఆషామాషీగా వచ్చిందేం కాదంటున్నారు. వినియోగదారుల షేవింగ్ హ్యాబిట్స్ ను అర్థం చేసకోవడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదంటున్నారు. పైగా వారి చర్మం తీరు..షేవింగ్ బీహేవియర్ మనిషిని బట్టి మారుతూ ఉంటాయి. అదే సమయంలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తామనే నమ్మకాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. తక్కువ ధరలో అందిస్తూ క్వాలిటీని మెయిన్ టెయిన్ చేస్తున్నట్లు వినియోగదారులు నమ్మితేనే మనుగడ ఉంటుంది. నిజానికి చాలా మందికి ఎలాంటి రేజర్లు వాడాలో తెలియదు. ఏది దొరికితే అది వాడేస్తూంటారు. అందుకే కస్టమర్లకు అవగాహన కలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్కిన్, హెయిర్ తీరును బట్టి రేజర్లను ఎంపిక చేసుకునేలా సమాచారం పొందుపరిచారు.
" రెండు నుంచి ఆరు బ్లేడ్ల రేజర్ల వరకు అందుబాటులోఉంచాం. ప్రతి ఉత్పత్తికి ప్రత్యేక పేజీ క్రియేట్ చేశాం. కస్టమర్ల స్కిన్ కి ఎలాంటి రేజర్ బాగుంటుందో రికమెండ్ చేసేలా సమాచారం ఉంటుంది. ఒక్క గాటు పడకుండా... షేవింగ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుంది" సిద్ధార్థ ఒబెరాయ్
లెట్స్ షేవ్ లో డిస్ట్రిబ్యూషన్ రంగానికి చోటు లేదు. నేరుగా ఉత్పత్తిదారులవద్ద నుంచే కొనుగోలు చేస్తారు దీని వల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. దీని కోసం లెట్స్ షేవ్ బృందం ప్రత్యేకంగా గోడౌన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకుంది. లాజిస్టిక్స్, సప్లై చైన్, మరికొన్ని చోట్ల గోడౌన్ల నిర్మాణం విషయంలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి... ఎంత బిజినెస్ జరుగుతోంది అన్న వివరాలు వెల్లడించడానికి సిద్ధర్థ ఆసక్తి చూపించలేదు.. కానీ రిపీట్ కస్టమర్స్ రేటు ప్రొత్సహకరంగా ఉందని ఉత్సాహంగా చెబుతున్నారు. అందుకే కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.
అంచనాలకు మించిబిజినెస్
మెన్స్ గ్రూమింగ్ మార్కెట్ ఇండియాలో అంచనాలకు మించి పెరుగుతోంది. భారత్ లో ఈ మార్కెట్ ఆరు వందల మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏడాదికి పదకొండు శాతం చొప్పున పెరుగుతోంది. మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లోఈ పెరుగుదల రేటు అధికంగా ఉంది. మార్కెట్ ప్రొత్సాహకరంగా ఉండటంతో పెట్టుబడులను కూడా ఈ రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన హెయిర్ కేర్ చైన్ ఆర్ అండ్ ఆర్ లో సింగపూర్ కి చెందిన ఎవర్ స్టోన్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ యూలుక్ గ్రేట్ బ్రాండ్ పేరుతో దాదాపుగా 25 సెలూన్లు నిర్వహిస్తోంది. లండన్ కు చెందిన హెయిర్ కేర్ సంస్థ ట్రూఫిట్ అండ్ హిల్ ఇప్పటికే మెట్రో నగరాల్లో ఆరు సెలూన్లను ప్రారంభించింది.
ప్రత్యేకంగా రేజర్ల స్పెషాలిటీతోనే లెట్స్ షేవ్ నడుస్తోంది. ఇలా మరే ఇతర అగ్రిగ్రేటర్ స్టార్టప్ సేవలు అందించడం లేదు. కానీ ఈ-కామర్స్ జెయింట్స్ స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్,అమెజాన్ లతో లెట్స్ షేవ్ పోటీ పడాల్సిందే. వీటిలో బీభత్సమైన గ్రూమింగ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో షాపింగ్ చేస్తున్నవారిలో 69శాతం మగవారే.
24ఏళ్ల సిద్ధార్థ ..ఈ కామ్ జెయింట్స్ ను తన విభాగంలో ఢీకొట్టి గెలవగలననే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే స్పెషలైజ్ చేసి మరీ షేవింగ్ ప్రొడక్ట్స్ అందిస్తూండటమే తన ప్రత్యేకత అని నమ్ముతున్నారు.