త్వరలో తెలంగాణ సర్కారు నూతన ఐటీ పాలసీ
ట్విట్టర్ లో తెలిపిన ఐటీ మంత్రి కేటీఆర్
ప్రపంచం అబ్బురపడేలా టీఎస్ ఐపాస్ ను ప్రకటించి దిగ్గజ కంపెనీలను ఆకర్షించిన.. తెలంగాణ సర్కార్ తాజాగా ఐటీ పాలసీకి రూపకల్పన చేసింది. ఏప్రిల్ 4న హైదరాబాద్ HICCలో కొత్త ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి సీఎం కేసీఆర్ ఈ కొత్త పాలసీ ప్రకటిస్తారని ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు.
ఐటీతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇందుకోసం రాష్ట్రానికి కొత్త ఐటీ పాలసీని సిద్ధం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన టీఎస్ ఐ పాస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలు ఎన్నో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. దాదాపు 410 పెద్ద కంపెనీలు 1250కి పైగా చిన్న కంపెనీలు హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో యూనిట్ల ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ఈ కంపెనీలు 33వేల కోట్ల రూపాయలతో లక్ష మందికి ఉపాథి అవకాశాలు కల్పించనున్నాయి.
టీఎస్ఐపాస్ సక్సెస్ కావడంతో.. దాన్ని ఆదర్శంగా తీసుకొని కొత్త ఐటీ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. నూతన పాలసీని ఏప్రిల్ 4న ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాదులోని హెచ్ఐసీసీ లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి న్యూ ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న నిపుణులతో సంప్రదించి కొత్త ఐటీ పాలసీకి రూపకల్పన చేశారు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా న్యూ ఐటీ పాలసీ సిద్ధం చేశారు. కొత్త పాలసీ ద్వారా ఐటీ కంపెనీలకు పలు రాయితీలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మ్యానుప్యాక్చరింగ్ కంపెనీలకు స్పెషల్ సబ్సిడీలు కల్పించనున్నారు. కేవలం ఎలక్ట్రానిక్ మ్యానుప్యాక్చరింగ్ రంగాలే కాకుండా అటు యానిమేషన్, గేమింగ్ రంగాలకు కూడా ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ప్రపంచంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దాలని కొత్త పాలసీకి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు.
అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను మనదేశం భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీంతో భారీగా విదేశీ మారకద్రవ్యం దేశం నుంచి తరలుతోంది. ఈ దిగుమతులు తగ్గించాలన్న లక్ష్యంతో మోడీ సర్కార్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఇటీవల భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. ఈనేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా కొత్త ఐటీ పాలసీకి కేసీఆర్ సర్కార్ రూపకల్పన చేసింది.