పల్లె సీమల్లో దాగి ఉన్న కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒడిసి పట్టిన 'ఇన్ త్రీ'
ఓ వస్తువును కొనుగోలు చేయాలంటే దుకాణానికి వెళ్లి దాన్ని ఆసాంతం పరిశీలించి ఆ పిదప బేరం ఆడి కొనుక్కోవడం. ఇది ఒకప్పటి మాట. ఇంట్లో కూర్చుని... చేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ నుంచే కావాల్సిన వస్తువును గంటల వ్యవధిలో తెప్పించుకోవడం నేటి మాట.
ఆన్ లైన్ ద్వారా అమ్మకం- కొనుగోళ్లు సాగిస్తున్న ఈ కామర్స్ వ్యాపారం విలువ లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ కామర్స్ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు పట్టణ ప్రాంత వినియోగదారులే. విద్యావంతులు అధికంగా ఉండడం, ఇంటర్నెట్ టెక్నాలజీ, సదుపాయాలు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడంతో ఈ కంపెనీలు తమ వ్యాపారాన్ని సులభంగా సాగించేందుకు వీలు కలుగుతోంది.
భారత దేశంలో 70 శాతం గ్రామీణ ప్రాంతమే.. అయితే పట్టణ ప్రాంతం కేవలం 30 శాతానికే పరిమితం అయి ఉంది. కేవలం భారత దేశంలో 30శాతం మాత్రమే ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే లక్షల కోట్ల వ్యాపారం సాగుతూ ఉంటే మరి 70శాతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తే ఇంకెంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతాయి.
సరిగ్గా ఈ సూత్రాన్నే ఒడిసి పట్టుకుని 'ఇన్ త్రీ' కంపెనీ కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన గృహోపకరణాలను సరఫరా చేస్తోంది. తమిళనాడు, కర్ణాటకలోని పలు గ్రామీణ ప్రాంత జిల్లాలను టార్గెట్ చేసుకున్న ఇన్ త్రీ కంపెనీ తమ సేవల ద్వారా అనతి కాలంలోనే వారికి చేరువయ్యింది.
ఐడియా జీవితాన్నే మార్చేసింది
ఇన్ త్రీ ఈ కామర్స్ వ్యవస్థాపకుడు రామనాథన్ గతంలో ఐసీఐసీఐ, టీవీఎస్ గ్రూపుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. మామూలుగా ఉద్యోగం చేసుకుంటున్న రామనాథన్.... వ్యాపార సలహాల విషయంలో మేనేజ్‌మెంట్ గురూగా ప్రసిద్ధమైన దివంగత ఆర్.కె.ప్రహ్లాద్ తో ఒక్కసారి జరిపిన సంభాషణ ఆయన జీవితాన్ని మార్చేసింది. గ్రామీణ భారతంలో వ్యాపార అవకాశాలను గ్రహించిన రామనాథన్.... ఎప్పటికైనా వారికి సేవలందించే విధంగా ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించాడు. అయితే తగిన పెట్టుబడి లేకపోవడంతో గృహోపకరణాలను అందించే యురేకా ఫోర్బ్స్‌తో పాటు నోకియా, టైటాన్ లాంటి సంస్థలకు సలహాలు అందించే ఒప్పందం కుదుర్చుకుంది. దానితో పాటు కట్టెల పొయ్యిల వల్ల గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు ఇన్ త్రీ కంపెనీ ద్వారా తమిళనాడులో పొగ రాని పొయ్యిలను కూడా తయారు చేసి విక్రయించడం ఆరంభించారు. ఆ పిదప సోలార్ బల్బుల అమ్మకం కూడా ప్రారంభించారు. దీనికి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది.
దీంతో ఇన్ త్రీ పేరుతో ఈ కామర్స్ వ్యాపారం ఆరంభించి గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా వివిధ గృహోపకరణాల అమ్మకాలు ప్రారంభించారు రామనాథన్. వ్యాపార విస్తరణ కోసం ఎన్జీఓలు, వ్యవసాయ బోర్డుల సహకారం తీసుకున్నారు. కొన్ని రోజుల్లోనే రామనాథన్ కృషి ఫలించింది. వారి ఉత్పత్తులకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఇన్ త్రీ తమ ఈ కామర్స్ కార్యకలాపాల ద్వారా ఏకంగా ఏడు లక్షల వస్తువులను విక్రయించింది. అంతే కాదు ఏకంగా 50 లక్షల మంది గ్రామీణ వినియోగదారులకు చేరువైంది. ఇన్ త్రీ తమ ఉత్పత్తుల విక్రయానికి బూన్ బాక్స్ సంస్థతో కలిసి పని చేస్తోంది. ఉత్పత్తులు తమవే అయినా బూన్ బాక్స్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవహారాల్లో సాయం అందజేస్తోంది. ప్రస్తుతానికి తమ కంపెనీ లాభాల్లో పయనిస్తోందని, గత ఏడాది ఏంజిల్ ఇండియా నెట్ వర్క్ నుంచి నిధులను కూడా పొందినట్లు ఇన్ త్రీ యజమాని రామనాథన్ తెలిపారు.
సవాళ్లు అధిగమిస్తూ..
గ్రామీణ ప్రాంతాల్లో ఈ కామర్స్ వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ వ్యాపారంలో ఉండి వంద కోట్ల టర్నోవర్ సాధించిన స్టోర్ కింగ్ సంస్థ ఆదర్శం అని అంటారు. ఈ సంస్థ కర్ణాటక, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో 50 కోట్ల వరకు అమ్మకాలు సాధించి ఏకంగా రెండు కోట్ల రూపాయల నికర లాభాన్ని సైతం ఆర్జించింది. గ్రామాలు, పట్టణాలతో మమేకం అవుతున్న పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కామర్స్ వ్యాపారానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని రామనాథన్ అంటున్నారు. అయితే అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, క్రెడిట్ కార్డుల వినియోగం అంతగా పెరగపోవడం ప్రధాన అవరోధాలని చెప్పుకొచ్చారు. మోడీ ప్రభుత్వం గ్రామాలను బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానించే ప్రక్రియను ముమ్మరం చేయడం, కొత్త స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి దేశంలో 70శాతం వరకు ఉన్న గ్రామీణ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని కొత్తగా ఈ కామర్స్ సహా ఏ వ్యాపారం ప్రారంభించినా భవిష్యత్తుకు ఢోకా ఉండదని ఇన్ త్రీ నిర్వహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.