ఆటిజం పిల్లలకు ఆత్మీయ 'స్పర్శ'
కాస్త థెరపీ - మరికాస్త శ్రద్ధ
పిల్లలకు చిన్నప్పుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఆమడ్యూస్ మోజార్ట్, ఐజాక్ న్యూటన్, మైకెలాంజిలో లాంటి వాళ్లను ఆదర్శంగా చూపిస్తుంటారు. వాళ్లలా మీరుకూడా పెద్దయ్యాక పేరు గడించాలని చెప్తుంటాం. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనం వారిలోని మేధావితనాన్ని మాత్రమే చూస్తాం. కానీ పైన చెప్పిన వాళ్లందరికీ చిన్నప్పుడు బుద్ధిమాంద్యం ! ఐన్‌స్టీన్, న్యూటన్, మైకెలాంజిలో ఆటిజం బాధితులు. వాళ్లకు ఏదీ ఒక పట్టాన తలకెక్కేది కాదు. నలుగురిలో కలవలేరు. ముబావంగా ఉండేవారు. ఇలాంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి లెక్క. మన దేశంలో కోటి మంది ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఆరు లక్షల మంది మగపిల్లలున్నారు.
వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్ డిజార్డర్. దాన్ని భూతద్దం నుంచి చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో కచ్చితంగా ఆటిజం లక్షణాలున్నట్టే. పైన చెప్పిన ఆరు లక్షల మందిలో చాలామందికి ఎటువంటి డయాగ్నసిస్ జరగలేదు. వారిలో ఆ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు. ప్రభుత్వ పరంగా ఆటిజం బాధితులకు ఎటువంటి ప్రోత్సాహం అందదు.
ఈ పరిస్థితి మారాలి. ఆటిజానికి సంబంధించిన పరిష్కారం వెతకాలి! దానికి ఒక కేంద్ర బిందువును ఏర్పరచాలి! ఇదే ఆలోచన కలిగింది సురభి వర్మకు. అలా 2005లో స్పర్శ్ అనే సంస్థ ఏర్పడింది. ఆటిజం, డిస్‌లెక్సియాలపైనే సంస్థ ఫోకస్. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి -స్వేచ్ఛగా మాట్లాడగల స్థాయికి తీసుకెళ్లడం సంస్థ ప్రధాన ఉద్దేశం. సమాజానికి అంటీముట్టనట్టు ఉండే ఆటిజం బాలలను, వారి తల్లిదండ్రులను జనంతో మమేకం చేసే ప్రయత్నం సంస్థ లక్ష్యం. అలా చేయాలంటే ఆటిజంపట్ల సంపూర్ణ అవగాహన కావాలి. దానికోసం బరోడాలోని మహరాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో సురభి మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు.
పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. స్పర్శ్ చేసే పని అదే. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికితీయడానికి, వారి వారి కుటుంబాలను, స్కూళ్లనుకూడా భాగస్వాములుగా మారుస్తోంది స్పర్శ్. ఈ బృహత్తర కార్యం కోసం సృజనాత్మక శిక్షణా కోర్సులను రూపొందించింది. స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే అండ్ స్టడీ గ్రూప్స్, ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా కాకుండా, ప్రతి ఒక్క అమ్మాయి/అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని, వారికి తగ్గట్టే కోర్సులు రూపొందించారు. ఆటిజం అనేది ఒక రుగ్మత మాత్రమే. అంతమాత్రాన ఆటిస్టిక్ పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడేవారు మాత్రం కారు' అంటున్నారు సురభి.
ఒకరకంగా చెప్పాలంటే ఆటిజం పిల్లలను అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే, ఆటిజానికి ఇదీ కారణమని నిర్ధారించే లెక్కలు లేవు. ఒక పిల్లవాడు అస్సలు మాట్లాడలేకపోవచ్చు. మరొకరు బాగా మాట్లాడొచ్చు. ఒకరికి బొమ్మలతో ఆటాడుకోవడం రాదు. మరొకరికి పజిళ్లతో, చిన్న చిన్న బ్లాకులను పేర్చడంలో టాలెంట్ ఉండొచ్చు. వాళ్లందరికీ ఆటిజం ఉన్నా.. వేర్వేరు లక్షణాలుంటాయి! నిజానికి ఆటిజం అన్న పదాన్ని గుర్తించడమే కొత్త. కేవలం 30 ఏళ్లయ్యింది అంతే! ఈ రుగ్మతను తొలి దశలోనే గుర్తించడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
అపనమ్మకాలు, అపోహలు దూరం దూరం
నిస్సహాయులకు పునరావాసం. రీహేబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. ఐక్యరాజ్యసమితిలో ఈ అంశంపై జరిగిన సదస్సులో తొలి సంతకం చేసిన దేశాల్లో ఇండియా ఒకటి. ఆటిజం పిల్లలు సమాజానికి భారమనే భావన ఉంది. ఆటిజం ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికోసం చట్టాలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారాయనే చెప్పాలి. సామాజిక గుర్తింపు దొరకదు. ఆటిజం పిల్లలు సాధారణ జీవితానికి అనర్హులు అనే భావన బాగా పాతుకుపోయింది. ఇలాంటి వాళ్లు జీవితాంతం తల్లిదండ్రుల మెడకు గుదిబండలే అనుకుంటారు. అదీగాక, మన సమాజంలో పక్కింటి పిల్లలతో పోల్చి చూడడం పరిపాటి. ఇది తల్లిదండ్రులను మరింత కుంగదీసేస్తుందంటారు సురభి.
ఆటిజంపై అవగాహన పెంచి, సామాజిక చైతన్యం తీసుకురావడం చాలా ముఖ్యం. ఇది మానసిక వైకల్యంగా భావిస్తుంటారు. ఆటిజం పిల్లలు పైకి వెర్రిబాగులతనంతో కనిపిస్తుంటారు. వారి వాలకం చూసినవాళ్లు మానసిక వికలాంగులుగా, ఏదో తేడా ఉన్నట్టుగా అనుకుంటారు. ఆటపట్టిస్తారు. ఎగతాళి చేస్తారు. వారికి చదువు సంధ్యలు అబ్బకపోవచ్చు. కానీ, వారు డిఫరెంట్ లెర్నర్స్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ విషయంలో రుజువైంది.
ఆటిజం అనేది నయం చేయలేని రుగ్మత కాకపోయినా, దీని లక్షణాలను మాత్రం సరిదిద్దవచ్చు. అలా చాలామంది ఎంతో ఎత్తుకు ఎదిగారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రాథమిక దశలోనే అంటే, ఏడాది, ఏడాదిన్నర వయసులోనే- పిల్లల నడవడిని, ప్రవర్తనను గుర్తించినట్టయితే చాలావరకు సరిదిద్దడానికి అవకాశముంటుంది. ఆ వయసువారిలో ఉండాల్సిన సహజమైన ప్రవర్తన వారిలో కనిపించదు. అయితే, ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఓ పట్టాన ఒప్పుకోరు. స్పర్శ్ టీమ్‌కి ఇది చాలా ఇరకాటంగా ఉంటుందట! తమ పిల్లలలో ఏదైనా తేడా ఉందంటే తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. వాళ్లు గనుక తొలి దశలోనే తమ పిల్లలలో ఆటిజం లక్షణాలు గుర్తించినట్టయితే, మాకు సరిదిద్దడంఎంతో తేలిక అంటారు సురభి.
ఆటిజం, డిస్‌లెక్సియా రుగ్మతలనుంచి బాలలను గట్టెక్కించడానికి స్పర్శ్ కు ప్రొఫెషనల్ టీమ్ ఉంది. వీరిలో స్పెషల్ ఎడ్యుకేటర్, సైకాలజిస్ట్, స్పీచ్/లాంగ్వేజ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఒక పిల్లల స్పెషలిస్టు ఉన్నారు. వీళ్ల ముందున్న మరో పెద్ద సమస్య పాఠశాలలు. సాధారణ బడులలో ఆటిజం పిల్లలను చేర్చుకోవడానికి ఇష్టపడరు. అందువల్ల ఆటిజంపై అవగాహన, సామాజిక స్పృహ ఉండే స్కూళ్లకోసం అన్వేషిస్తుంటారు.
అయోమయ స్థితిలో ఆశా కిరణం
ఆటిస్టిక్ పిల్లల ఎదుగుదలలో స్పర్శ్ టీమ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఒక పిల్లవాడు మూడేళ్ల వయసున్న పిల్లాడిని స్పర్శ్‌లో చేర్చారు. ఆటిజం డిజార్డర్ అంతగా లదు. స్పర్శ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజున ఆ పిల్లాడు ఒక మంచి స్కూలులో అందరిలానే చదువుకోగలుగుతున్నాడు. 40మంది స్టూడెంట్స్ ఉంటేఅతను టాప్-10లో నిలుస్తున్నాడు. మ్యాథ్స్ ఒలింపియాడ్, ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో చురుకుగా పాల్గంటున్నాడు. ఆ స్కూలు ప్రిన్సిపాలే ఆశ్చర్యపోయాడు పిల్లాడిని చూసి. ఈ సంగతి గురించి సురభి గర్వంగా చెప్పుకొచ్చారు.
మరో పిల్లవాడి కేసు మరీ చిత్రమైంది. ఒక పిల్లాడికి బుద్ధిమాంద్యం ఉంది. ఆరేళ్ల వరకు స్కూల్ మొహమే తెలియదు. కానీ స్వర్శ్ టీం ఇచ్చిన ప్రోత్సాహంతో అతనిప్పుడు జూనియర్ ఇంటర్ వరకు వచ్చాడు. ఇంగ్లీషులోనూ, బిజినెస్ స్టడీస్‌లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఓపెన్ స్కూలుద్వారా టెన్త్ బోర్డు పరీక్షలు రాసి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. స్పర్శ్ చూపిన శ్రద్ధ, థెరపీల మూలంగా అతనిప్పుడు సగర్వంగా తలెత్తుకునే స్థితిలో ఉన్నాడు.
ఆటిజం పిల్లల విషయంలో ఇతర సంస్థలతో టై-అప్ చేసుకోవాలన్నది స్పర్శ్ ఆలోచన. దాంతోపాటు పిల్లలకు తగిన ఉపాధి మార్గం కూడా చూపించాలనుకుంటున్నారు. ఆటిజం పిల్లలకు సమానావకాశాలు కల్పించడానికి వారికోసం ఒక సమగ్ర ప్రణాళిక రచిస్తున్నామంటున్నారు సురభి