కిరాణా స్టోర్ బిజినెస్ దున్నేస్తున్న హైదరాబాదీ స్టార్టప్

నమ్మకమే పునాదిగా దూసుకుపోతున్న షాప్ ట్యాప్

29th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏ వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా అంతా ఆన్ లైన్ లోనే. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి ఈ కామర్స్ సైట్లపై చిన్నపాటి అవగాహన ఉన్న వారికి ఎలాంటి సమస్యలేదు. మరి కంప్యూటర్ గురించి తెలియనివారి మాటేమిటి? వాళ్లు ఆన్ లైన్లో వస్తువుల్ని కొనాలంటే ఎలా? అయినా ఏ నమ్మకంతో ఆన్ లైన్ లో వస్తువులు ఆర్డర్ చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ షాప్ ట్యాప్.

హైదరాబాద్ కు చెందిన కృష్ణ రోజూలాగే ఉదయం ఏడింటింకి కుక్కను తీసుకుని మార్నింగ్ వాక్ కు వెళ్లారు. తిరిగొచ్చేటప్పుడు పాల ప్యాకెట్ కోసం ఇంటి పక్కనే ఉన్న కిరాణా షాపులోకి వెళ్లారు. రోజూ వెళ్లే షాపే అయినా ఆ రోజు కాస్త కొత్తగా అనిపించింది. పరిశీలించి చూస్తే షాపులో ఓ కియోస్క్ అందులో ఒక డివైజ్ కనిపించింది. అందులో రకరకాల గ్యాడ్జెట్స్, ప్రొడక్ట్స్ ఐకాన్స్ కనిపించాయి. కృష్ణ ఎంతోకాలంగా కొనాలనుకుంటున్న ఐఫోన్ మోడల్ కూడా అందులో ఉంది. ఇంకేముంది రెండో ఆలోచనలేకుండా ఆర్డర్ చేసేశాడు. 

షాప్ ట్యాప్ టీం

షాప్ ట్యాప్ టీం


షాప్ ట్యాప్. ఇదో స్మార్ట్ సేల్స్ ప్లాట్ ఫాం. ఆఫ్లైన్ స్టోర్లను ఆన్ లైన్ బాట పట్టించడమే షాప్ ట్యాప్ స్పెషాలిటీ. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య వారధిలా ఇది పనిచేస్తుంది. పాయింట్ ఆఫ్ సేల్ ఫ్లాట్ ఫాం ద్వారా కస్టమర్ ఇన్వెంటరీ చూసి కొనుగోలు చేయొచ్చు. ప్రొడక్ట్స్ కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా షాపు ఓనరును అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. షాప్ ట్యాప్ లో మొత్తం 14 కేటగిరీలున్నాయి. కస్టమర్ ప్రొడక్టు ఎంచుకున్న తర్వాత సేల్స్ మెన్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉంది.

నమ్మకమే పునాదిగా

కృష్ణ షాప్ ట్యాప్ లో ఐ ఫోన్ చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వడానికి కారణం షాప్ యజమానిపై ఉన్న నమ్మకం. షాప్ ఓనర్ కృష్ణకు ఏడేళ్లుగా తెలుసు. అందుకే షాప్ ట్యాప్ గురించి తెలియకపోయినా వెంటనే కొనాలని నిర్ణయించుకున్నారు.

చాలా మంది భారతీయులకు ఇంటి పక్కన, వీధి చివరన ఉండే కిరాణా షాపు యజమానులతో సత్సంబంధాలుంటాయి. షాపు ఓనర్లు ఇంట్లో అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో వారి మధ్య నమ్మకమనే బంధం ఏర్పడుతుంది. అందుకే కస్టమర్లకు పేరున్న బ్రాండ్ల వస్తువులపై కన్నా.. షాపు ఓనరు మాటపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారని షాప్ ట్యాప్ ఫౌండర్ మణికంఠ రేచర్ల అంటారు.

పేఫిక్స్ తో మొదలైన ప్రయాణం

మణికంఠ 2012లో ప్రారంభించిన పేఫిక్స్ స్టార్టప్ నుంచి పుట్టుకొచ్చిన ఐడియానే షాప్ ట్యాప్. ICFAI కోర్సు చేస్తున్న సమయంలో మణికంఠకు మాస్కోలో నెల రోజుల పాటు ఇంటర్న్ షిప్ చేసే అవకాశం దొరికింది. నెల రోజుల దాని కోసమని మాస్కోకు వెళ్లిన ఆయన.. ఆ సిటీలో వర్క్ కల్చర్, బిజినెస్ బేస్ కు ఫిదా అయిపోయాడు. దానిపై మరింత స్టడీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్న్ షిప్ ను మరో 30 రోజులు పొడగించుకోవాలనుకున్నాడు. ఇంటర్న్ షిప్ పొడగించమని కోరుతూ కాలేజ్ కు ఎన్నో లెటర్లు రాశాడు. కానీ మేనేజ్ మెంట్ అందుకు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాడు. కాలేజీకి వెళ్లకపోవడంతో సెమిస్టర్ పాటు సస్పెండ్ అయ్యానని మణికంఠ తెలిపారు.

60 రోజులు గడిచాయి. స్టడీ కంప్లీట్ అయింది. కాలేజ్ నుంచి సస్పెండ్ కావడంతో కాలేజ్ కు వెళ్లే ఛాన్స్ లేదు. ఖాళీగా ఉన్న సమయంలో పేమెంట్స్ మోడ్ కు సంబంధించి కిరాణాషాపు ఓనర్లు పడుతున్న అవస్థలు తప్పించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలోంచే పేఫిక్స్ పుట్టుకొచ్చింది.

“కిరాణా జనరల్ స్టోర్లలో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసేందుకు ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ కోసం ఒక్కో డివైజ్ ఉపయోగిస్తారు. ఇది షాపు ఓనర్లకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏ సర్వీస్ ప్రొవైడర్ కు అయినా సింగిల్ వాలెట్ నుంచి పేమెంట్ చేసేలా పేఫిక్స్ సాఫ్ట్ వేర్ తయారుచేశా”- మణికంఠ

పేఫిక్స్ టీం మాస్కోకు చెందిన Qiwi సర్వర్ ఆర్కిటెక్చర్ తో కమిషన్ బేసిస్ పై సర్వీసులు అందించేది. ఒకే ఒక్క రిటైల్ స్టోర్ తో ప్రారంభమైన పేఫిక్స్ ప్రయాణం అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 590 స్టోర్లకు విస్తరించి 8 కోట్ల 79లక్షల రూపాయల అమ్మకాలు జరిపింది.

షాప్ ట్యాప్ కు బీజం

2014 నాటికి ఇలాంటి పేమెంట్ ఆప్షన్లున్న స్టార్టప్ లు చాలా పుట్టుకొచ్చాయి. దీంతో ఇంకేదైనా కొత్తగా చేయాలనిపించింది. కిరాణా స్టోర్లకు వెళ్లినప్పుడు సాధారణంగా ఎదురయ్యే మరో సమస్య గుర్తుకొచ్చింది. అదే షాపు ఇన్వెంటరీ, స్టాక్ మేనేజ్ మెంట్. సాధారణంగా రిటైలర్లు హోల్ సెల్లర్స్ నుంచి సరుకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను మాత్రమే స్టాక్ పెట్టుకుంటుంటారు. అయితే కొందరు కస్టమర్లు షాపులో లేని వస్తువులు అడుగుతుంటారు. అక్కడ దొరకకపోతే పక్కషాపుకు వెళ్తారు.

వాస్తవానికి కస్టమర్లు కోరే ప్రతి వస్తువును షాపులో స్టాక్ పెట్టుకోవడం కష్టం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు షాప్ ట్యాప్ ను డెవలప్ చేశాడు మణికంఠ. పేఫిక్స్ వల్ల అప్పటికే రిటైలర్లతో మంచి సంబంధాలు ఏర్పడటంతో.. షాప్ ట్యాప్ ఐడియా గురించి స్టోర్ ఓనర్లకు చెప్పి ఒప్పించడం సులువైంది. పేఫిక్స్ కోసం పనిచేసిన టెక్నికల్ టీంతో కలిసి షాప్ ట్యాప్ రూపొందించాడు మణికంఠ. రకరకాల బ్రాండ్లను, హోల్ సెల్లర్లను ఇందులో భాగస్వాములుగా చేర్చడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. నెట్ వర్క్ పెంచుకునేందుకు కొంత సమయం పట్టింది. ఇదే సమయంలో ఓ ఏంజిల్ ఇన్వెస్టింగ్ కంపెనీ షాప్ ట్యాప్ కు 10 లక్షల రూపాయల సీడ్ ఫండింగ్ తో పాటు టెక్నాలజీ సపోర్ట్ అందజేసింది. అలా గతేడాది నవంబర్ లో షాప్ ట్యాప్ సేవలు ప్రారంభమయ్యాయి.

ఫ్యూచర్ ప్లాన్స్

కిరాణా షాపుల్లో 15వేల రూపాయలు డిపాజిట్ గా తీసుకుని షాప్ ట్యాప్ కియోస్క్ ఏర్పాటు చేస్తారు. షాపుకు వచ్చే వారంతా స్థానిక భాషలో ఉన్న ఇన్వెంటరీని బ్రౌజ్ చేసి, ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం షాప్ ట్యాప్ 9 భాషల్లో అందుబాటులో ఉంది. కిరాణా స్టోర్ ఓనర్ మొబైల్ లోని ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తారు. షాప్ ట్యాప్ టీం ప్రొడక్ట్ డెలివరీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది.

“ఒక్కో ప్రాంత ప్రజలకు ఒక్కో రకమైన అవసరాలుంటాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు వస్తువులు వినియోగిస్తారు. అందుకే 4 నెలల పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సర్వే చేసి ఏ ఏ ప్రాంతంలో ఏ ప్రొడక్ట్స్ అవసరమో గుర్తించాం. దాని ఆధారంగా పాయింట్ ఆఫ్ సేల్ లో ఇన్వెంటరీ తయారుచేశాం”- మణికంఠ

ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ అంతటా విస్తరించాలని షాప్ ట్యాప్ లక్ష్యంగా పెట్టుకుంది. టైర్ -2, టైర్ -3 సిటీలకు సేవల్ని విస్తరించాలనుకుంటోంది. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణలో బిజీ అయింది.

యువర్ స్టోరీ టేక్

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ఆన్ లైన్ షాపింగ్ క్రమంగా పెరుగుతోంది. ఇండియాలో దాదాపు లక్షా 20వేల కిరాణా స్టోర్లు ఉన్నాయి. భవిష్యత్తులో రిటైల్ మార్కెట్ లో వీటి విలువ 600 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2014 - 15లో ఈ కామర్స్ వృద్ధి రేటు దాదాపు 25శాతంగా ఉందని స్వీడన్ కు చెందిన ఓ సంస్థ సర్వేలో తేలింది. ఇందుకు ఓమ్నీ ఛానెల్ మార్కెటింగ్ కారణమని చెప్పింది. పెరుగుతున్న నెట్ వినియోగం ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ సేల్స్ పైనా ప్రభావం చూపుతోంది. డెలాయిట్ ఫారెస్టర్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికా రిటైల్ సేల్స్ లో 36 శాతం వెబ్ ద్వారానే జరుగుతోంది. 2017నాటికి ఇది 70 శాతానికి పెరిగే అవకాశముందని అంచనా. ఈ రంగంలో భారత్ కూడా దూసుకుపోతోంది.

స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటి బడా ఈ కామర్స్ సైట్లతో షాప్ ట్యాప్ పోటీ పడుతోంది. 2015 అక్టోబర్ లో స్నాప్ డీల్ ఓమ్ని ఛానెల్ ప్లాట్ ఫాం ప్రారంభించి ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ కస్టమర్లకు సేవలందిస్తూ సరికొత్త షాపింగ్ అనుభవాన్ని కలిగిస్తోంది. జివామీ, పెప్పర్ ఫ్రై, లెన్స్ కార్ట్ సైతం ఆఫ్ లైన్ ద్వారా కస్టమర్లకు టచ్ అండ్ ఫీల్ ఎక్స్ పీరియన్స్ కలిగిస్తోంది. ప్రస్తుతం షాప్ ట్యాప్ కు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్ లోని కిరాణా స్టోర్ లతో ఇప్పటికే అనుబంధం ఉండటం షాప్ కు ప్లస్ పాయింట్. అయితే పెద్ద కంపెనీల పోటీని తట్టుకుని షాప్ ట్యాప్ మార్కెట్ లో ఎలా నిలదొక్కుకుంటుందో వేచి చూడాల్సిందే.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India