భవిష్యత్ దార్శనికుడు - సికె ప్రహ్లాద్
బిజినెస్ గురు, మేనేజ్మెంట్ గురుగా... సి.కె. ప్రహ్లాద్ ఎన్నో లక్షలమందికి చిరపరిచితం. ఆయన గురించి ఎన్నో విషయాలూ చాల మందికే తెలిసే ఉంటాయి. ఆయన కృషి, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని మనమూ ఎదగాలని స్ఫూర్తి పొందుతాం. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన మేనేజ్మెంట్ నెక్స్ట్ మ్యాగజైన్ ఎడిటర్ బెండిక్ట్ పరమానంద్ రాసిన ‘సి.కె. ప్రహ్లాద్ : ది మైండ్ ఆఫ్ ది ఫ్యూచరిస్ట్’ పుస్తకంలోని మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించుకుందాం.
147 పేజీల పుస్తకంలో జీవితం పట్ల ప్రహ్లాద్ కు ఉన్న దృక్పధం, జాతీయ అంతర్జాతీయ వ్యాపారాల ప్రభావాన్ని చక్కగా వివరించింది. ఈ పుస్తకంలోని పరిచయ అధ్యాయాన్ని ఫ్రీ పిడిఎఫ్‌గా డౌన్ లోడ్ చేసుకునే వీలును కల్పించారు.
ప్రహ్లాద్, 11మంది సంతానంలో తొమ్మిదోవారు. కోయంబత్తూరులో పెరిగారు. చెన్నైలో స్కూలు, కాలేజీ చదువులను పూర్తిచేశారు. సమాజంలో తాండవిస్తున్న దారిద్ర్యాన్ని చూసి చలించిపోయేవారు. ఇదే విషయాన్ని ఆయన తన పిల్లలకు అప్పుడప్పుడు చెబుతుండేవారు.
బహుశా అప్పుడేనేమో ... ఆయనలో ఏదో చేయాలన్న తపన బీజం వేసింది. యూనియన్ కార్బైడ్‌లో పనిచేస్తున్నప్పుడు యూనియన్లు, మేనేజ్మెంట్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంలో ప్రహ్లాద్ తన ప్రతిభను చాటారు. ఆ తర్వాత కొత్తగా అహ్మదాబాద్‌లో ఏర్పాటైన IIM లో చేరారు. ఇండియన్ పిస్టన్స్ లో చేరి, IIT మద్రాస్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్స్‌లో పాఠాలు చెప్పారు. టీచింగ్‌లో ఉన్న మానసిక ఆనందాన్ని స్వయంగా అనుభవించారు.
కొన్నాళ్లకు ప్రహ్లాద్, ఆయన భార్య అమెరికాకు వెళ్లారు. హార్వర్డ్‌లో గ్రాడ్యువేషన్ పూర్తిచేసి, 1970లో భారత్ కు తిరిగొచ్చారు. అయితే ఎమర్జెన్సీ సమయం కావడంతో ... ఆయనకు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఆయన మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని యూనివర్సిటి ఆఫ్ మిచిగాన్కు వెళ్లారు. రాబోవు 20 ఏళ్లల్లో తాను ఏ స్థాయిలో ఉండబోతున్నారో ఊహించుకుంటూ ... అందుకోసం తగు ప్రణాళికలను వేసుకుంటూ, ఆ విధంగా ముందుకు వెళ్లేవారు.
కేవలం తాను పాటించడమే కాదు ... చేసే ప్రతి పని సమర్థవంతంగా ఉండాలని, జాతి పట్ల గౌరవం ఉండాలని చిన్నప్పటి నుంచే తన పిల్లలకు చెప్పేవారు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం, జూనియర్ ఫ్యాకల్టీ, ప్యూన్స్, ట్యాక్సీ డ్రైవర్స్ ఇలా అందరితో ప్రేమగా మాట్లాడే ఆయన నైజం గురించి ఆయన కుటుంబ సభ్యులు, కొలీగ్స్ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
ఎప్పటికీ నిత్య విద్యార్థి
ప్రహ్లాద్ ఒక అంకితభావం కలిగిన టీచర్. ప్రతి సెమిస్టర్‌కు కొత్తగా నోట్స్ మెటీరియల్ తయారుచేయడమే కాదు, స్టూడెంట్స్‌కు స్వయంగా గ్రేడింగ్ కూడా ఇచ్చేవారు. బెస్ట్ టీచర్ అవార్డులు ఆయనకు ప్రతి ఏటా దాసోహమనేవి. అంతెందుకు ఈయన పాఠాలు వినేందుకు వేరే క్లాసు విద్యార్థులు కూడా వచ్చేవారు. విద్యార్థులపై ఆయన ప్రభావం ఎంతో ఉండేది. ఉదాహరణకి ... మార్కెటింగ్ గురు, ‘ఎ నెవెర్ బిఫోర్ వరల్డ్’కు రచయిత అయిన రామా బిజాపుర్కర్కు గురువంటే అపారమైన భక్తి.
ప్రహ్లాద్ … భవిష్యత్తు ఊహకర్త. ప్రపంచంలో పెను మార్పు తీసుకువచ్చేందుకు దోహదపడే అన్ని అంశాలపై ఆయన దృష్టి పెట్టేవారు ... అందులో పరిశీలన, మాట్లాడడం, రాయడం ఇలా అన్నీ పొందుపరుచుకునేవి. లీడర్‌గా ఎదగాలంటే అందరితో సఖ్యత, న్యాయంగా ఉండడం, జయాపజయాలతో సంబంధం లేకుండా సహనం, ఓర్పు పాటించడం ముఖ్యమని ప్రహ్లాద్... మేనేజర్లకు సలహా ఇచ్చేవారు. ఆయన రచనల్లో వ్యాపార సూత్రాలకు సంబంధించిన ఎన్నో విలువైన అంశాలు ఉండేవి. MNCలకు దిశానిర్ధేశం చేయడంలో, బిజినెస్‌లో తొలి అడుగులు వేస్తున్న వారికి బాసటగా ఉండడంలో ఆయన ఎప్పుడు ముందుండేవారు.
ఆయన సలహాలతో ఎన్నో కంపెనీల దశ తిరిగింది
ఎలక్ట్రానిక్స్ జైంట్ ఫిలిప్స్ దశ తిరగడంలో, భారతీయ కంపెనీలైన ఐటిసి, హిందుస్థాన్ లీవర్, అరవింద్ ఐ హాస్పిటల్ల పనితనాన్ని నలుగురి దృష్టిలోకి తీసుకురావడంలో ప్రహ్లాద్ కృషి ఎంతో ఉంది. 1980 నుంచి 2010 .. యావత్ ప్రపంచంలో రాజకీయ, వైజ్ఞానిక, సాంఘిక, ఆర్థిక మార్పులు సంభవిస్తున్నప్పుడు .. ఎందరో జాతీయ, అంతర్జాతీయ వ్యాపారులను ప్రహ్లాద్ ప్రభావితం చేశారు.
1989లో జరిగిన ఢిల్లీ సంఘటన అందరినీ షేక్ చేసింది. ఒక సభలో ప్రసంగిస్తున్న ప్రహ్లాద్ ... 2000 సంవత్సరం కల్లా భారత్ ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్‌గా ఎదుగుతుందని నమ్ముతున్నారా అని అక్కడి వారిని అడిగారు. ఒకే ఒక్కరు చెయ్యిపైకి ఎత్తారు .. వారే భారత్ వచ్చిన జర్మన్ అంబాసిడర్.
చిరు వస్తువులపై సమయం వెచ్చించే చైనా మార్గదర్శకాలతో పోకుండా ... హై-ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధించాలని భారతీయ తయారీదారులను ప్రహ్లాద్ ప్రోత్సహించేవారు. క్వాలిటీ విషయంలో, నీతినియమాలు పాటించడంలో ఏ రాజీ లేకుండా ఈ మార్పులన్నీ జరగాలని సూచించేవారు.
“ భారత్ .. ఈ పేరు చెబితే చాలు ఆయనలో గర్వం తొణికిసలాడేది. జాతీయతా భావం ఆయనలో అణువణువునా ఉండేది. ఈ అభిప్రాయంతో ఏకీభవించని వారిని ఆయన తేలికగా కొట్టిపారేసేవారు ” అని పరమానంద్ చెప్పారు.
ఒకవేళ ఇప్పుడుగనక ప్రహ్లాద్ బ్రతికే ఉంటే ... ఆర్థిక వ్యవస్థలో అవకతవకలను చూసి, చిందరవందరగా మారిన స్టాండర్డ్స్ ను చూసి ఆందోళన చెంది ఉండేవారని పరమానంద్ అంటారు.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలనే తాపత్రయం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత భారత్ ఎలా ఉండాలని ప్రహ్లాద్ కలలు కన్నారో తెలుసా .. 500మంది క్వాలిటి టెక్నీషియన్స్, ఫార్చూన్ 500 ఫర్మ్స్ లో భారత్ కనీసం 30 వాటికి సొంతదారుగా ఉండాలని, గ్లోబల్ ట్రేడ్ లో 10శాతం షేర్ సొంతం చేసుకోవాలని, పేదరికం, దరిద్ర్యం దాదాపు అంతం అవ్వాలని, పర్యావరణానికి జరుగుతున్న నష్టం తగ్గాలని. ఆయన విజన్ ను నిజం చేసేందుకు సరైన పద్దతిలో పనిచేస్తే .. 2022 నాటికి భారత్ లో 500 వరల్డ్ క్లాస్ సిటీస్ పుట్టుకొస్తాయి, 10 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మన గడ్డ నుంచే తయారవుతారు.
క్లుప్తంగా చెప్పాలంటే .. ఈ పుస్తకం జీవితంపై ఆశలను రేకెత్తిస్తుంది, సి.కె.ప్రహ్లాద్ అంకితభావం, ఆయన అపార జ్ఞానాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది, మనకోసం ఒక అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని అందివ్వాలనుకున్న ఆయన తపన కనిపిస్తుంది.
ప్రహ్లాద్ గురించి ప్రపంచంలోని బిజినెస్ క్యాపిటన్స్, లీడర్స్ చెప్పిన మాటలతో ఈ కథనాన్ని ముగిద్దాం ...
- “ సికె రగిల్చిన జ్వాల మనందరిలో రగులుతూనే ఉంటుంది.” – సంజయ్ రెడ్డి, జివికే గ్రూప్
- “ అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేయాలని, అందుకోసం గొప్పగా ఆలోచించాలని, పెద్ద టార్గెట్స్‌ను పెట్టుకోవాలని బిజినెస్ లీడర్స్‌కు నేర్పించారు ” – శ్రీధర్ మిట్టా, నెక్ట్స్ వెల్త్ ఆంట్రప్రెన్యూర్స్.
- “ ఇండియన్ మ్యానుఫాక్చరింగ్‌పై సికెకి ఉన్న నమ్మకం .. నాకు అమృతంలా అనిపించేది ” – బి. ముత్తురామన్, టాటా స్టీల్.
- “ ఒక్కసారి గతంలోకి వెళితే, ఆయన చిరు వ్యాపారులను కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్‌గా ప్రవర్తించమనేవారు. ఇవాళ, అటువంటి చిరు వ్యాపారులే నిజంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలేంతగా పరిణతి చెందారు.” – సుబ్రతో బాగ్చి, మైండ్ ట్రీ
- “చాలామంది మేనేజ్ మెంట్ గురూస్ .. ఔట్ ఆఫ్ ది బాక్స్ ... ఆలోచించమని, అందులో తమను తాము ఫిట్ అయ్యేలా చూసుకోమ్మని సలహానిస్తే .. సికె మాత్రం బిజినెస్ లీడర్స్ సొంతంగా తమకు తామే బిజినెస్ బాక్స్ ను తయారుచేసుకునేందుకు సాయం చేశారు” – రతన్ టాటా.