ఆనాడు బైక్స్ అమ్మి వ్యాపారంలోకి.. ఈరోజు కోట్ల టర్నోవర్ సాధించిన బిజినెస్ మ్యాన్
విదేశాల్లో ఎంబీఏ చదవాలన్న ఆశయంతో జీమ్యాట్ పరీక్షకు సిద్ధమయ్యారు భరత్ అక్కిహేబల్. కానీ విధి ఈయన్ను మరో మార్గంలో నడిపించింది. పేరులో చిన్న తేడా ఉండడంతో భరత్ కు పరీక్షాకేంద్రంలోకి అనుమతి లభించలేదు. దీంతో జీమ్యాట్ గూర్చిన ఆలోచనలకు స్వస్తిపలికి బ్యాంక్ లోన్ తీసుకుని విదేశాల్లో ఎంబీఏ చదవాలా అని ప్రశ్నించుకున్నారు భరత్. అదే డబ్బుతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు
భరత్ కుటుంబంలో మూడు తరాల వారు ప్రభుత్వోద్యోగులు కావడంతో వ్యాపారం మాట ఎత్తగానే అంతా వ్యతిరేకించారు. ఇంట్లోవాళ్లు తనను ఎప్పటికీ అర్ధం చేసుకోలేరన్న భావనతో భరత్ ఇల్లు వదిలి బయటకొచ్చేశారు. బ్యాంక్ లో డబ్బులేదు. వ్యాపారం ప్రారంభించగలనన్న ధైర్యమూ లేదు. పర్స్ లో కేవలం రూ.17లే ఉన్నాయి. వీటితోనే భరత్ ముందడుగేశారు. బైక్స్ రీస్టోరింగ్ లో ఆసక్తితో 13 యెజ్డి, జావా బైక్స్ ను తయారుచేశారీయన. వీటిని అమ్మి ఆ సొమ్ముతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు.
దీనికి ముందు స్టేపుల్స్ లో పనిచేసిన భరత్ చిన్న-మధ్యతరహా కంపెనీలకు ఆఫీస్ స్టేషనరీ అందించే విక్రేతల ఆవశ్యకతను గుర్తించారు. ఈ తరహా పరిశ్రమల వాల్యూమ్ తక్కువగా ఉండడంతో చెల్లింపులు వేగంగా ఉంటాయి. అదే పెద్ద కంపెనీలైతే భారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే తాను చిన్న లేదా మధ్యతరహా పరిశ్రమ ప్రారంభించాలనుకున్నట్లు భరత్ చెప్పారు.
సంస్థ ఏర్పాటు
-----------------------
వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి కోసం భరత్ తన బైక్స్ కలెక్షన్ లో సగాన్ని విక్రయించారు. మరో కంపెనీలో స్పేస్ షేర్ చేసుకుంటూ ఆఫీస్ స్మార్ట్.ఇన్ వెంచర్ ప్రారంభించారు. ఆఫీస్ స్మార్ట్ బిజినెస్ టు బిజినెస్ మోడల్ లో పనిచేస్తుంది. ఆఫీసులకు కావాల్సిన రైటింగ్ ప్యాడ్స్, పెన్స్, ఆఫీస్ సైనేజ్, కస్టమైజ్డ్ టీషర్ట్స్, బీన్ బ్యాగ్స్ అందిస్తుంది. మిగతా వ్యాపారాలతో పోల్చితే ఈ రంగంలో సరకుల జాబితా తక్కువే. ఈ ప్రోడక్ట్స్ ను స్వల్పకాలంలో కనుగొనడమే కాస్త కష్టమైన పని. అందుకే ఆఫీస్ గూడ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు భరత్ తెలిపారు.
మొదట్లో అద్దె కార్ లో తిరుగుతూ సొంతంగా డెలివరీలు చేశారు భరత్. ప్రారంభంలో సరకు డెలివరీ చాలాకష్టంగా ఉండేదన్న ఈ ఔత్సాహిక బిజినెస్ మ్యాన్ నేడు తమ వెంచర్ కోట్ల రెవెన్యూ ఆర్జిస్తోందని చెప్పారు. ముగ్గురు సభ్యుల బృందంతోనే ఈ అద్భుతాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫీస్ స్మార్ట్ కు వెయ్యి రకాలకు పైగా స్టాక్ కీపింగ్ యూనిట్లున్న 40 మంది విక్రేతలున్నారు. పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయికీ పదిరెట్లకు పైగా బిజినెస్ చేయడమే తమ లక్ష్యమని భరత్ వివరించారు.
ఆఫీస్ స్మార్ట్ పనితీరు
--------------------------
క్లైంట్స్ ను వివిధ విభాగాలుగా వర్గీకరించి ఆఫీస్ స్మార్ట్ సేవలందిస్తోంది. ఆఫీస్ స్మార్ట్ కు ఓ పోర్టల్ ఉంటుంది. దీంట్లో స్మార్ట్ ఆల్వేస్, స్మార్ట్ బై, స్మార్ట్ కాంట్రాక్ట్ లుగా వినియోగదారులను మూడు కేటగిరీల్లో విభజిస్తారు. ఓ సంస్థ నెలవారి కొనుగోళ్ల సరాసరిని బట్టి ప్రైస్ ను నిర్ణయించేందుకు ఈ మోడల్ ను అనుసరిస్తున్నారు. కంపెనీలను సూపర్ యూజర్, సబ్ యూజర్ లుగా విభజించి సరకు పంపిణీ చేస్తోంది. సబ్ యూజర్ ద్వారా వినియోగదారులు చేసిన రిక్వెస్ట్ ను సూపర్ యూజర్ ఓకే చేస్తే ఆఫీస్ స్మార్ట్ రంగంలోకి దిగుతుంది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా గూడ్స్ రవాణా చేస్తుంది. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడంలోనూ అతిక్రమణలను గుర్తించడంలోనూ పాలనా విభాగానికి ఉపయుక్తమైన ఆప్షన్లనూ ఆఫీస్ స్మార్ట్ అందిస్తోంది.
సేల్స్
------------------
అభివృద్ధి గణాంకాలను బట్టి ఆఫీస్ స్మార్ట్ ప్రారంభ దశ నుంచి ఇప్పటివరకూ ఐదురెట్లు గ్రోత్ నమోదుచేసింది. దీంతో ఇన్వెస్టర్స్ సాయం లేకుండానే ఈ దశకు చేరుకుంది. 2014 జనవరిలో రూ.లక్ష చేతికందగా 2015 జనవరిలో రూ.5 లక్షలు ఆర్జించింది. ప్రతీనెలా రెవెన్యూలో 33 శాతం అభివృద్ధి సాధిస్తోందీ వెంచర్. ఆఫీస్ స్మార్ట్ 15 యాక్టివ్ క్లైంట్లకు సేవలందిస్తోంది. నెలకో కొత్త యూజర్ యాడ్ అవుతున్నారు. అయితే ఈ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధిపరచి నెలకు కొత్తగా ముగ్గురు వినియోగదారులను సాధించేందుకు భరత్ కృషిచేస్తున్నారు.
బెంగళూరు, తమిళనాడు, హైద్రాబాద్ ల్లో విస్తరించిన ఆఫీస్ స్మార్ట్ దక్షిణ బెంగళూరు-కొరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్, ఎంజీ రోడ్, జయనగర్, జేపీనగర్ ల్లో హైపర్ లోకల్ డెలివరీలు చేస్తోంది. మూడో పార్టీ భాగస్వాముల ద్వారా తమిళనాడు, హైద్రాబాద్ ల్లో సరకు అందిస్తోంది. మదురై, కానూర్, కోయంబత్తూర్, తిరుచి, పాండిచెరీల నుంచి రిపీట్ సేల్స్ ఆర్డర్స్ అందుకుంటోంది. వారంలో ఈ వెంచర్ రూ.20వేలు విలువచేసే ఆరు లేదా పది డెలివరీలు నిర్వహిస్తోంది. కస్టమర్ల నెట్ వర్క్ ను మరింతగా విస్తరించుకున్న తర్వాత యాప్ ఆవిష్కరణపై దృష్టిసారిస్తామని భరత్ చెప్తున్నారు. ఫండింగ్ పెంపుకు కృషిచేస్తూనే ఆఫీస్ గూడ్స్ పంపిణీకి 500 ప్రాంతాల్లోని కార్యాలయాల అధిపతులతో చర్చిస్తున్నారు.
సిబ్బంది
---------------------
టు పిజ్జా రూల్ రూపకర్త జెఫ్ బెజోస్ స్ఫూర్తిగా ప్రారంభమైన ఆఫీస్ స్మార్ట్ లో ముగ్గురే ఉద్యోగులున్నారని భరత్ చెప్పారు. కనీస నైపుణ్యం ఉన్న వారిని రిక్రూట్ చేసుకుని శిక్షణనిచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరు ఎలాంటి పనినైనా సమర్ధవంతంగా నిర్వర్తించే స్కిల్స్ సాధించారని ఆర్డర్ సైకిల్ ను పూర్తిచేయగలరని వివరించారు. ఆర్డర్ ప్రారంభ దశలోనే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వీరికి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు.
బీ2బీ బిజినెస్ పై యువర్ స్టోరీ పరిశీలన
భారత్ లో 300 బిలియన్ల డాలర్ల విలువ ఉన్న బీ2బీ బిజినెస్ 2020 నాటికి 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ రంగంలో 95శాతం గుర్తింపుకు నోచుకోలేదు. 2012లో భారత్ ఆఫీస్ ఉత్పత్తుల మార్కెట్ సైజ్ 20 బిలియన్ డాలర్లు. అంటే బీ2బీలో అవకాశాలు కోకొల్లలు. ఆఫీస్ గూడ్స్ సరఫరాలో ఆఫీస్ స్మార్ట్.ఇన్ కు మరో పోటీదారు జొఫియో.కామ్. జొఫియో.కామ్ కు గూగుల్ ఎస్ఎంఈ హీరోస్ గా 2014లో గుర్తింపు సైతం లభించింది. గుర్గావ్ లో 2013లో ప్రారంభమైన ఆఫీస్ఎస్.కామ్ కు ప్రారంభ దశలో 2 నుంచి 5 మిలియన్ల పెట్టుబడి సాధించింది. చెన్నైకు చెందిన కాబ్స్టర్ కూ పెద్ద మొత్తంలోనే నిధి లభించింది.
ఆఫీస్ గూడ్స్ బిజినెస్ లోకి అడుగిడిన వారంతా ఈ-సేకరణ, సమగ్ర జాబితా, ఖర్చు నిర్వహణ, కాస్ట్ ఆప్టిమైజేషన్, సలహాలు, విశ్లేషణలు, కేంద్రీకృత జాబితాలపైనే దృష్టి పెట్టారు. ఇతర పోటీదారుల నుంచి వ్యత్యాసం చూపడంపై వీరంతా నిర్లక్ష్యం వహించినట్టే చెప్పొచ్చు. అయితే ఈ మార్కెట్ కొత్తది కావడంతో మార్పులు చేర్పులకు సమయం పడుతుంది. మార్పులకు యత్నిస్తూ ఈ వ్యాపారంలో ముందడుగే వేస్తే...అద్భుత విజయాలు సాధ్యమవుతాయి.