'రైల్ యాత్రి'తో ప్రయాణీకులకు సమస్త సమాచారం
రైల్ యాత్రి, మనందరికీ తెల్సిన ట్రెయిన్ ట్రావెల్ పోర్టల్. కానీ ఇప్పుడు సరికొత్త ఇన్‌సైట్స్ సెక్షన్‌తో ప్రయాణికులకు పనిని మరింత సులభతరం చేస్తోంది. పక్కా స్కెచ్ వేసుకుని జర్నీని ప్లాన్ చేసుకునే వీలును కల్పిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ట్రావెలింగ్‌కు సంబంధించిన డేటాను అందించేందుకు ఇన్ సైట్, థింక్ డిజిటల్ ట్రావెల్, థింక్ విత్ గూగుల్, సోజర్న్ వంటి ఎన్నో వేదికలు ఉన్నాయి. అయితే రైల్ యాత్రి ప్రయత్నం ఏంటంటే ... ఈ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్‌తో డేటా విశ్లేషణలను సులువుగా అందించడం.
రాబోయే రోజుల్లో సప్లై కన్నా .... రైల్ టికెట్ల డిమాండ్ నానాటికి పెరిగే అవకాశముందని రైల్ యాత్రి గట్టి నమ్మకం. ప్రయాణికుల సౌకర్యార్థం విశ్వవ్యాప్తంగా చాలా డేటాను ఉపయోగిస్తుంటారు. కానీ భారత్‌తో పోలిస్తే అది అంత పాపులర్ కాలేదు.
“ మేము అందించే ప్లాట్‌ఫామ్ ఎలాంటిదంటే .. మా డేటాను చూసి, ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్యాసింజర్లు చిటికెలో తెలుసుకుంటారు ” అంటారు రైల్ యాత్రి వ్యవస్థాపకులు మనీష్ రతీ.
రైలు ప్రయాణికుల అవసరాలు తెలుసుకోవడం
రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు రైల్ యాత్రి తనదైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫీచర్స్‌తో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అందులో భాగంగా పుట్టిందే 'సీట్ అవైలబిలిటి ఫోర్‌కాస్ట్' (అంటే సీట్ కన్ఫర్మ్ అవుతుందో.. లేదో ఊహించి చెప్పడం). దీని సాయంతో పాయింట్ A నుంచి పాయింట్ B వరకూ ఏ ట్రెయిన్లో ప్రయాణిస్తే బాగుంటుందో తెలుస్తుంది.
ఈ సీట్ లభ్యత గురించి ట్రైయిన్ మ్యాన్, కన్ఫర్మ్ టికెట్ లాంటి ఎన్నో ఫ్లాట్‌ఫారమ్స్ సమాచారం అందిస్తున్నా .. రైల్ యాత్రి తనదైన కొత్త సమాచారంతో ఆకట్టుకుంటోంది.
ఈమధ్యే లాంఛ్ అయిన ‘రైల్ యాత్రి ఇన్‌సైట్స్’ .. బిజీగా ఉండే రైల్ రూట్ల వివరాలు, ఆయా రూట్లలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ ఉండే ప్రాంతాలు, రైళ్ల రాకపోకలు, ఒక వేళ లేట్‌గా నడిచే అలవాటు ఉంటే వాటి సమాచారాన్ని అందిస్తుంది.
“ మాకు తెలిసి రైలు ప్రయాణానికి సంబంధించి ఎంత చెప్పినా తక్కువే ” అంటారు మనీష్.
వివిధ ప్రాంతాల నుంచి సమాచారం కోసం ప్రయత్నించే రైలు ప్యాసింజర్ల సహాయార్థం ఈ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మ్యాప్స్‌ను వినియోగిస్తుంది. దూర ప్రాంతాలకు సంబంధించిన రైలు వివరాలే కాకుండా, లోకల్ ట్రైయిన్ల సమాచారం, రైల్వే స్టేషన్స్‌కు సమీపంలో ఉండే రెస్టారెంట్ల వివరాలు కూడా అందిస్తుంది. అంతేకాదు దేశంలోని 30 నగరాల్లో ... ఈ వెబ్ సైట్, మొబైల్ యాప్ సాయంతో ప్రయాణికులు కారును అద్దెకు కూడా తీసుకోవచ్చు.
ఈ ప్లాట్‌ఫామ్‌కు ప్రస్తుతం నెలకు 20 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఉండగా కేవలం ఒక్క ఏడాదిలోనే 10 లక్షల డౌన్ లోడ్స్ జరిగాయంటే అతిశయోక్తి కాదు.
ఎలా పనిచేస్తుంది
వివిధ మెటా డేటా ఫీల్డ్స్ ద్వారా ఏడాది కాలంపాటు రైల్ యాత్రి సమీకరించిన డేటా సమాచారాన్ని ఈ ఇన్‌సైట్స్ సేకరిస్తుంది. అలా సేకరించిన సమాచారంపై పనిచేయడం మొదలెడుతుంది. సదరు రైలు సరైన సమయానికి గమ్యాన్ని చేరుకుంటుందా, రైలు ఫ్రీక్వెన్సీ, కన్ఫర్డ్ సీట్ దొరుకుతుందా లేదా లాంటి వాటికి సమాధానాలు ఇస్తుంది. ఏడాది కాలం పాటు ఉన్న డేటానంతటినీ క్రోడకరించి.. ఊహాజనితమైన వివరాలను అందిస్తుంది. టికెట్ విషయానికి వస్తే.. కన్ఫర్మ అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయి.. ? అసలు అవుతుందా.. కాదా.. ? అని గత చరిత్రను పరిగణలోకి తీసుకుని.. డేటా ఇస్తుంది.
కేవలం రైళ్ల రాకపోకల గురించి సమాచారం ఇవ్వడమే కాదు, ఎటు వైపు నుంచి ప్లాట్‌ఫాంలోకి ఎంటర్ కావాలో, రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ ఉందో లేదో లాంటి చిన్న చిన్న సందేహాలను కూడా తీరుస్తుంది. “ ఈ సమాచారం అంతా యూజర్స్ యాడ్ చేసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేదిక జనం కోసం, జనం ఇచ్చిన సమాచారంతో నడుస్తోంది ” అంటారు మనీష్.
రైళ్ల షెడ్యూల్స్, ఇతరత్రా సమాచారం ఏ ట్రావెల్ పోర్టల్‌లో అయినా దొరుకుతుంది. కానీ రైలు సరిగ్గా సమయానికి వస్తుందా లేదా అనే విషయాన్ని ప్యాసింజర్లకు తెలియజేయడం ఇండియాలో ఇదే ప్రప్రథమం. ఏడాదిగా అవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ ఇదో పెద్ద డేటా బ్యాంక్‌గా ఎదిగింది. ప్రయాణికులకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందించే ఓ మార్గంగా మారింది.
ఈమధ్య కాలంలో రైలు ప్రయాణికుల దగ్గర రైళ్లకు సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది. మళ్లీ అదే సమాచారాన్ని యాప్స్ అందించడం దండగ. “అయితే క్వాలిటి పర్‌ఫెక్ట్ గా ఉన్నప్పుడు వారు ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం కొంత వెచ్చించడానికి వెనకాడరు. నిజానికి కొంతమంది యూజర్స్ వరుసగా రెక్వెస్ట్ చేస్తుండడంతో మేము కొన్ని కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెట్టాం ” అని చెప్పారు మనీష్.