క్యాబ్ సర్వీసులన్నింటినీ ఒకే చోట కలిపే యాప్ 'రూటగో'

క్యాబ్ సర్వీసులన్నింటినీ ఒకే చోట కలిపే యాప్ 'రూటగో'

Thursday October 08, 2015,

4 min Read

వారాంతంలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణానికి అనువైన క్యాబ్ నిర్వాహకుడిని కనిపెట్టడం కష్టమవుతోందా? అయితే మీరు రూటగో సైట్ ను సందర్శించాల్సిందే. రూటగో స్థానికంగా అందుబాటులో ఉన్న బెస్ట్ క్యాబ్ ఆపరేటర్స్ వివరాలను అందించడంతో పాటూ వారు అందించే సేవల ఎంపికను తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు సాధారణంగా తక్కువ ఖర్చులోనే లభించే క్యాబ్ సర్వీసులపై ప్రజలు ఆసక్తి చూపుతారు. అందుబాటు ధరల్లోని క్యాబ్స్ కోసం కస్టమర్లు ఎక్కువ మంది ఆపరేటర్స్‌కు కాల్ చేయాల్సి వస్తోంది. వినియోగదారుల్లోని ఈ సందిగ్ధతకు చెక్ పెట్టేందుకే రూటగో స్థాపించినట్లు వీనస్ చెప్తున్నారు.

క్యాబ్ ఆపరేటర్స్‌కు సంబంధించిన సరైన సమాచార వ్యవస్థ లేని సమయంలో రూటగోను ఆవిష్కరించినట్లు వీనస్ చెబుతున్నారు. రూటగో ఓ మార్కెట్ ప్లేస్ గా వ్యవహరిస్తుందని, స్థానిక టూర్-ట్రావెల్ నిర్వాహకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో గణనీయ పాత్ర పోషిస్తుందని అంటున్నారు. రవాణా ఆపరేటర్లను ఒకచోట చేర్చడం ద్వారా చెల్లింపులు, లభ్యతలను తెలుసుకోవడం కస్టమర్లకు సులభమైందని అంటారు. నిర్వాహకుల రేటింగ్‌ను బట్టి సేవలు ఎంచుకునే అవకాశం వినియోగదారులకు లభించిందని వెల్లడించారు.

రూటోగో టీమ్

రూటోగో టీమ్


రూటగోను స్థాపించాలన్న ఆలోచన మరో సహ-వ్యవస్థాపకుడు అనీష్ రేయంచది. జర్మనీలో ఇంటర్న్‌గా ఉన్నప్పుడు అనీష్‌కు ఈ ఐడియా వచ్చింది. ఆయన జర్మనీలో ఉండగా స్థానికంగా తిరిగేందుకు ఇంటర్ సిటీ రైడ్ షేరింగ్ సర్వీసులను ఆశ్రయించారు. ఇలాంటి సేవలనే భారత్‌లోనూ ప్రారంభించాలనుకున్నారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారు లేకపోవడంతో ఈ ఐడియాకు వెంటనే కార్యరూపం ఇవ్వలేకపోయారు.

రెకిట్ బెన్కైసర్‌లో చేరిన అనీష్‌కు తనలానే ఆలోచించే వీనస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అనీష్ వీనస్‌తో కలిసి తన ప్రాజెక్ట్ ను అమల్లో పెట్టే పని ప్రారంభించారు. ఇంటర్‌సిటీ రైడ్ షేరింగ్‌పైనే కాకుండా క్యాబ్స్ సేవలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో, భారత్‌లో నగరాల్లో ప్రయాణించేందుకు వాహనాన్ని బుక్ చేసుకోవడం కష్టతరంగా ఉందన్న అంశాన్ని గుర్తించారు.

రూటగో బృందం

నగరంలో రవాణా సదుపాయాలు, ఆపరేటర్లు అందించే సేవలు తెలుసుకునేందుకు వినియోగదారులు పాత పద్ధతులనే పాటిస్తున్నారు. రవాణా ఖర్చు, లభ్యత తెలుసుకునేందుకు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లు చేయాల్సి వస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే టూర్-ట్రావెల్ ఆపరేటర్లను ఒకే వేదికపైకి తెచ్చే కార్యక్రమం ప్రారంభించామని వీనస్ తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుంటూ కస్టమర్ సులభంగా క్యాబ్‌ను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు. 

image


పొదుపు చేసుకున్న మొత్తంతోనే రూటగో ప్రాథమిక సాంకేతిక పనిని ప్రారంభించారు అనీష్, వీనస్. తమ ప్రణాళికకు ఓ రూపం వచ్చిన తర్వాత బంధుమిత్రులతో పాటూ సీనియర్ సహోద్యోగుల నుంచి కొంత మొత్తాన్ని సేకరించగలిగారు. ప్రస్తుతం 13 మందితో పాటూ 8 మంది ఇంటర్న్స్ ఆపరేషన్స్, టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో సేవలందిస్తున్నట్లు వీనస్ చెప్పారు. తమ సంస్థ విస్తృతిని పెంచుతూ కార్పొరేట్స్, ట్రావెల్ ఏజెంట్లను భాగస్వామ్యులుగా చేసుకుంటున్నట్టు తెలిపారు.

సవాళ్లు

రూటగోను అమల్లో పెట్టడమే అనీష్, వీనస్‌లకు ఓ సవాల్‌గా మారింది. సాంకేతిక అంశాల్లో తమ బృందానికి తర్ఫీదునివ్వడం ప్రధాన సమస్యగా పరిణమించింది. తొలినాళ్లలో రూటగో టీమ్ జైపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అవుట్ సోర్సింగ్‌ నిర్వహించింది. అయితే, ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని నెలలకే సంస్థ మూతపడింది. కొద్ది రోజుల తర్వాత తమ ఉత్పత్తికి కనీస విలువనిచ్చే ఢిల్లీలోని ఓ కంపెనీని రూటగో కనుగొంది. అయితే తమ వేదికను వినియోగించుకోవాలని క్యాబ్ ఆపరేటర్లను ఒప్పించడం సంస్థకు మరో సవాల్‌. ఈ కష్టంపై వీనస్ స్పందిస్తూ "ఆఫ్ లైన్ బుకింగ్ విధానానికి అలవాటుపడ్డ నిర్వాహకులను ఆన్‌లైన్లోకి మారేలా చేయడం పెద్ద పనే" అని వ్యాఖ్యానించారు.

అందరినీ కలుపుకుపోతూ..

మే నెలలో రూటగో కార్యకలాపాలు ప్రారంభించిన అనీష్, వీనస్ ఆఫ్‌లైన్ మార్కెట్‌కూ సేవలు విస్తరించారు. ఆండ్రాయిడ్ యాప్ కూడా ఆవిష్కరించారు. యాప్ విడుదల చేసిన కొన్నిరోజులకే 2500 సార్లు డౌన్ లోడ్ అయినట్లు కంపెనీ గుర్తించింది. రూ.5వేల సరాసరితో 300లకు పైగా బుకింగ్స్‌ను పూర్తిచేశారు. రూటగో రోజుకు 8 నుంచి 10 బుకింగ్స్ చేస్తుంది. ఒక్కోసారి 12 బుకింగ్స్ కూడా జరుగుతాయి. తమ సంస్థ అభివృద్ధి అసాధారణంగా ఉందని వీనస్ చెప్తున్నారు. నెలకు 250 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రిప్‌కు బుకింగ్ అయిన మొత్తంపై కొంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు.

మార్కెట్ ప్లేస్ మోడల్‌లో రూటగో సిబ్బంది సేవలందిస్తున్నారు. వాహనాల అందుబాటును బట్టి రవాణా ఖర్చు ఉంటుంది. ప్రైసింగ్ ఆధారంగా వినియోగదారులకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్దేశిత సమయంలో కార్స్ సరఫరా ఆధారంగా ఓ ప్రైస్ పాయింట్ వద్ద డిమాండ్‌ను బట్టి కస్టమర్లు తక్కువ ధరలోనే సేవలు పొందే ఛాన్స్ ఉన్నట్లు వీనస్ వివరించారు. బిల్లింగ్ అమౌంట్‌పై వినియోగదారులు రూ.2వేల వరకూ ఆదా చేసుకునే వీలుందని తెలిపారు. తామందించే వెసులుబాటు ఫిక్స్డ్ ప్రైస్‌పై క్యాబ్స్ సరఫరా చేసే వారి వద్ద లేదని చెప్పారు. 

వినియోగదారులను ఆకర్షించేందుకు రూటగో పలు చర్యలు చేపట్టింది. ఒన్ వే జర్నీకి ఇతర ఆపరేటర్లు వసూలు చేసే మొత్తంలో 50శాతం మాత్రమే ఛార్జ్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్‌ను ఢిల్లీ క్యాపిటల్ పరిధిలోని 32 మార్గాల్లో ప్రారంభించింది. ఈ రూట్స్‌లో కస్టమర్లు ఒన్ వే ప్రయాణానికి క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాక కొన్ని గంటల పాటూ క్యాబ్స్‌ను అద్దెకిచ్చే అవకాశాన్నీ రూటగో కల్పిస్తోంది. దీంతో పాటూ ఓలా, టాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్ లాంటి రేడియో క్యాబ్స్‌కు మెటా సెర్చ్ ఇంజిన్‌లా ఉపయోగపడుతోంది.

ఢిల్లీ-ఎన్ సీ ఆర్, ఛండీగడ్‌ల్లో రూటగో కార్యకలాపాలు సాగిస్తోంది. మరో రెండు నెలల్లో ఉత్తర భారతంలోని ప్రధాన నగరాలన్నింటికీ సేవలు విస్తరించనుంది. నగరాల్లో క్యాబ్ రైడ్ షేరింగ్ పైనా దృష్టిపెట్టింది. రవాణాకు క్యాబ్ రైడ్ షేరింగ్ ప్రత్యామ్నాయంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తోంది.


మార్కెట్ తీరుతెన్నులు

భారత్‌లో రేడియో ట్యాక్సీ మార్కెట్ విలువ 6 నుంచి 9 బిలియన్ డాలర్లు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సెక్టార్ ఏటా 17 నుంచి 20శాతం అభివృద్ధి సాధిస్తోందని అంచనా. ఈ రంగంలో 4-6 శాతం మార్కెట్ మాత్రమే వ్యవస్థీకృతమైంది. తక్కినదంతా 2 నుంచి 50 కార్లున్న ఆపరేటర్లే నిర్వహిస్తున్నారు. రేడియో క్యాబ్స్ మార్కెట్లో అభివృద్ధికి వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో అమెజాన్-ఫ్లిప్ కార్ట్ తరహాలో ధరల యుద్ధం తెరపైకి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. దేశంలో 10వేల నుంచి 15వేల కార్లతో సేవలందిస్తున్న 8, 10 ప్రధాన ఆపరేటర్లు ఉన్నారు. వీరు మరింతగా స్థిరపడడానికి 18-24 నెలలు పట్టే అవకాశముంది. ఈ అంశాలే రూటగో లాంటి సంస్థల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ట్యాక్సీల సేవలను ఒకచోట చేర్చేందుకు స్కూట్ లాంటి వేదికలూ ఆవిర్భవిస్తున్నాయి.

website