కరువు ప్రాంతంలోనూ ఈ-కామర్స్‌కు మార్కెట్ ఉందని నిరూపించిన యువకులు
విదర్భ .. ఈ పేరు వినగానే రైతుల ఆత్మహత్యలే గుర్తువస్తాయి. అయితే ఇప్పటికీ అక్కడి అమ్రావతిలో నిత్యావసరాలకు ఒక ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటు చేయడంలో సాగుతున్న నత్తనడక పనులు ఆందోళన కలిగిస్తాయి. కానీ 23ఏళ్ల ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రశాంత్ మహల్లే, పుష్పక్ దేశ్ ముఖ్ మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. పుష్పక్ కలగన్నట్టుగానే … ఇంటి గడప వద్దకే కావాల్సిన వస్తువులు వచ్చేలా మార్కెట్ వార్కెట్‌ను తెరపైకి తెచ్చారు.
కుగ్రామంలో పుట్టిన వీరిద్దరూ .. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు పుష్పక్‌తో ప్రశాంత్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే ఆలోచనా ధోరణి కావడం, సొంత బిజినెస్‌పై ఒకేలాంటి ఇంట్రెస్ట్ ఉండడంతో మరింత క్లోజ్ అయ్యామని ప్రశాంత్ చెబుతారు. చిన్న చిన్న నిత్యావసర వస్తువులు కొనడానికి ఇబ్బందులు పడడం, వాటి షాపింగ్‌కు కూడా ఎక్కువ సమయం పట్టడం పుష్పక్‌కు నచ్చలేదు. వీలైనంత తక్కువ సమయంలో ఇంటి వద్దకే కావాల్సిన వస్తువులు వస్తే ఎలా ఉంటుందనుకున్నారు. అలా 2011లో క్లిక్ అయ్యిందే ఈ ఐడియా.
ఓ సారి వీరి కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి దివంగత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జే. అబ్దుల్ కలాం ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఆంట్రప్రెన్యూర్‌షిప్ గురించి చెప్పిన మాటలు వీరి మనసులో బాగా నాటుకుపోయాయి. అప్పటినుంచి హౌజ్ జాయ్ – హోమ్ సర్వీసెస్ కంపెనీ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ తదితర సర్వీసులకు సంబంధించి హైపర్ లోకల్ ప్లాట్‌ఫాంపై పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెంటర్‌షిప్, గైడెన్స్ కోసం ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంకరేజ్ చేసే TIE- నాగ్‌పూర్ ఆర్గనైజేషన్‌కు పుష్పక్ వెళ్లారు. అయితే, అక్కడ వారు తేల్చిందేంటంటే … అప్పటివరకూ పుష్పక్ చేసిందంతా శుద్ధ దండగని. అయినా .. తన ఐడియాను తన ఫ్రెండ్ ప్రశాంత్‌తో డిస్కస్ చేయగా, అతడు వెంటనే 'లెట్స్ స్టార్ట్' అన్నాడు.
అవి దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ రాకెట్‌లా దూసుకుపోతున్న రోజులు. దీంతో వీరు ఆలోచనలో పడ్డారు. “ ఎవరో వచ్చి ఇంటి నిత్యావసరాలను ఇచ్చి వెళ్లే వరకూ ఎందుకు ఎదురుచూడాలి, ఆ పని మనమే ఎందుకు చేయకూడదని ? ” అంతే అలా మార్కెట్ వార్కెట్ పుట్టింది - అని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ …
వీళ్లు లాంఛ్ చేసినప్పుడు, ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్క ఈ-కామర్స్ వెబ్ సైట్ కూడా లేదు. అంతేకాదు, అక్కడి జనాలకు ఎన్నో సమస్యలు ఉండేవి. మహారాష్ట్రలోని విదర్భ వాసులు కరెంట్, తాగునీరు, ఉపాధి తదితర సమస్యలతో సతమతమవుతుండేవారు. అన్నింటికన్నా ముఖ్యంగా అన్నదాతల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా ఉండేది.
అటువంటి వాతావరణంలో వీరు తమ ప్లాట్‌ఫాం గురించి జనాలకు ఎలా తెలియజేశారో ప్రశాంత్ ఇలా చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో స్థానిక మరాఠీ భాష ఎంతో ఉపయోగపడింది. ఆటోరిక్షాలపై బ్యానర్లు, లోకల్‌గా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు కో-స్పాన్సర్స్‌గా వ్యవహరించడం, పంపిణీలు, డోర్ టు డోర్ ప్రమోషన్లు .. ఇలా ఎన్నో ప్లాన్ చేస్తే వారికి కొత్త కొత్త ఆర్డర్లు రావడం మొదలైంది.
అడ్డంకులు
అయితే, అమ్రావతిలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం తీసుకురావడమంటే పెద్ద ఛాలెంజే. తాము అందించే ప్రొడక్ట్స్‌ను చూసి సహజంగా అందరికీ వచ్చే డౌటే స్థానికులకు వచ్చేది. వారు ఎప్పుడూ అడుగుతుండేవారు, తాము తెచ్చిచ్చే వస్తువులు ఎక్స్‌పైరీ అయిపోయినవా లేక ఎక్కడి నుంచైనా దొంగిలించినవా అని. ఇంకొందరైతే, మేము ట్యాక్సులు చెల్లించట్లేదని .. అందుకే ఆయా వస్తువులన్నింటిని డిస్కౌంట్స్‌లో ఇస్తున్నామని, ఫ్రీగా డెలివరీ చేస్తున్నామని అనుమానం వెల్లిబుచ్చేవారు.
2012లో ఈ కాంసెప్ట్ చాలా కొత్తది కావడంతో, కావాల్సిన వస్తువులు సప్లై చేయమని లోకల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను నమ్మించి, ఒప్పించడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. FMCG కంపెనీలతో టై-అప్ కావడానికి చాలా తిప్పలు పడ్డాం. “ ప్రొడక్ట్ క్వాలిటి, ధరల విషయంలో ఒక బ్యాలెన్స్‌ను ఏర్పాటు చేయడంలో చాలానే కష్టపడాల్సి వచ్చింది ” అంటారు ప్రశాంత్.
అయితే సప్లై చెయిన్‌ను నిర్వహించడం అంత సులభమేమీ కాదు. సమయానికి ప్రొడక్ట్స్ అందించడమే కాదు, ఇతరులతో పోలుస్తూ ధరలు నిర్దేశించడం.. వంటివన్నీ సమస్యలే. “గ్రాసరీ ఐటమ్స్ - మార్జిన్ కేటగిరీ కిందకు వస్తాయి, అంటే పెద్ద పెద్ద డిస్కౌంట్లకు అంతగా స్కోప్ ఉండదు ” అంటారు ప్రశాంత్. “ మిగతా బిగ్ ప్లేయర్స్‌తో పోలిస్తే మార్కెట్ వార్కెట్ కు పెద్దగా ఎదుగుదల లేదని మాకు తెలుసు. కానీ విదర్భ వంటి ప్రాంతంలో ఈ-కామర్స్ అడుగుజాడలను మేము వేయగలిగామంటే గర్వంగా ఉంది. ఇప్పటికే మాకు 95% రిటర్నింగ్ కస్టమర్స్ ఉన్నారు, అంటే ఇది మాకు విక్టరీనే,” అంటారు ప్రశాంత్.
ఎక్కువగా యువతే ఇంటర్నెట్, సోషల్ మీడియాను వాడుతుండడంతో, ఇక్కడ ఈ-కామర్స్ పాతుకుపోవడానికి కొంత సమయం పట్టింది. అయినా ఇప్పటికీ చాలామంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించడానికి వెనకాడుతున్నారు. డెలివరీ పేమెంట్ ఆప్షన్‌లో .. క్యాష్ అనే సెలెక్ట్ చేస్తున్నారు.
విదర్భ లాంటి ప్రాంతంలో ఈ-కామర్స్ ప్రారంభించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తక్కువ ఖర్చులు, మ్యాన్ పవర్‌కు ఎక్కువగా చెల్లించక్కర్లేదు. అంతకు మించి .. నిజాయితీపరులైన కస్టమర్లు. “పక్కా ప్లాన్ వేసుకుని, సేల్స్ టార్గెట్ పెట్టుకుంటే … ఇక్కడ స్టార్టప్‌లు మంచి లాభాలు ఇస్తాయి” అంటారు ఆయన. ఇప్పటివరకు రిజిస్టర్డ్ కస్టమర్లు 1500కాగా, ఆవరేజ్‌గా తీసుకునే ఆర్డర్ రూ.1450 వరకూ ఉంది.
మార్కెట్ – భవిష్యత్ ప్రణాళిక
ప్రస్తుతం ఈ టీమ్ తమ ప్లాన్స్, విజన్‌ను నిజం చేసుకునేందుకు .. అనుభవం ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూస్తోంది. బిగ్ ప్లేయర్స్‌లాగా కాకుండా, మా టీమ్ కేవలం మూడు గంటల్లోనే డెలివరీ చేస్తుందని ప్రశాంత్ చెప్పారు. “ ప్రొడక్ట్స్‌పై మాకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. మేమే ప్యాక్ చేస్తాం కాబట్టి, క్వాలిటీని చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది” అని తెలిపారు. ఈమధ్య ఈ టీమ్ .. ఇన్వెంటరీ బేస్డ్ – వేర్ హౌజింగ్ మోడల్‌ని ఫాలో అవుతోంది.
త్వరలోనే వీరు ఒక యాప్‌ను కూడా డెవలప్ చేయబోతున్నారు. “మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి, మేము రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం,” అని ప్రశాంత్ చెప్పారు.
చిన్న నగరాల్లో ఈ-కామర్స్
ఈ ఏడాది చివర్లో ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ ఆరు బిలియన్ అమెరికన్ డాలర్లను టచ్ చేయనుంది. అంటే ఎన్నో చిన్న నగరాలు త్వరలోనే ఈ పరుగులో భాగం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుండడంతో, అతి త్వరలోనే ఈ-కామర్స్ 51% శాతంతో అభివృద్ధి అంచులను చేరుకుంటుందని అంచనా.