భారత్ భిక్షమెత్తుకునే దేశమని కూసిన వాళ్లకే ప్రాణభిక్ష పెట్టారు..!
వ్యవస్థలో అవినీతి కంపు భరించలేక అతను ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలేశారు. ప్రైవేట్ రంగంలో అడుగుపెట్టి ఓ కంపెనీని అధమ స్థాయి నుంచి ఉన్నతికి తీసుకెళ్తే వాళ్లూ ఉద్యోగం నుంచి తొలగించారు. విసుగుతో, బాధతో ఏర్పాటు చేసిన సొంత సంస్థే అద్భుతాలు సృష్టించింది. షావుకార్లకే పరిమితమైన వ్యాక్సిన్లను సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. భారత దేశ బయోటెక్నాలజీ, జెనిటికల్ ఇంజనీరింగ్‌లో ఓ సంచలనానికి తెరలేపిన సక్సెస్ స్టోరీ ఇది.
అతనో ఎలక్ట్రానిక్ ఇంజనీర్, పూర్తిగా టెక్నోక్రాట్. ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి. దేశమన్నా, సమాజంలోని మనుషులన్నా అంతే గౌరవం, అభిమానం. అవినీతి, బేధభావంతో చూసే మనషులంటే విపరీతమైన చిరాకు. పన్నుచెల్లింపుదార్ల సొమ్ము, సామాన్యుల కష్టాన్ని అప్పణంగా లంచాల రూపంలో కాజేసే వ్యవస్థపై అసహ్యం పుట్టి ఏకంగా రెండుసార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిరావడమే గాకుండా, జన్మలో ఎప్పడూ మరోసారి గవర్నమెంటు ఉద్యోగానికి పోనేపోకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నారంటే.. లోపల ఏ స్థాయిలో జుగుప్స ఏర్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ ఖాయిలా పడిన పరిశ్రమను తీసుకుని పారిశ్రామికవేత్త అవతారమెత్తారు. రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. మరుగున పడిన ఆ కంపెనీని మెర్సిడీజ్ బెంజ్లా పరుగులు పెట్టించారు. నాణ్యతతో కూడిన ఉత్పత్తులు తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా వాటిని సరఫరా చేయడంతో ఆ ఖాయిలా పరిశ్రమ మరోసారి కళకళలాడింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.
అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని ముక్కుసూటితనం మరోసారి ముప్పుతిప్పలు పెట్టింది. సంస్థలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపడంతో సదరు యాజమాన్యం తావసంతో ఊగిపోయింది. తమ కంపెనీని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు, అందుకు ఎంత కష్టపడ్డారు అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆ కుంచిత యాజమాన్యం. చివరకు అతడిని సంస్థ నుంచి తప్పించింది. అప్పుడేం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రభుత్వం ఉద్యోగాన్నీ వదులుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగం ముచ్చటా తీరిపోయింది. గమ్యమేంటో తెలియక అగమ్యగోచరంగా మారింది భవిష్యత్తు. మళ్లీ ఉద్యోగం వెతుక్కుందామంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఏదైనా స్టార్టప్ మొదలుపెడదామంటే ఎలా ఉంటుందోననే ఆందోళన. ఇలా అనేక ఆలోచనలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు ఊరు వెళ్లి వ్యవసాయం చేసుకుని హుందాగా బతుకుదామనేంత వరకూ వెళ్లింది ఆలోచన.
ఈ సందర్భంలో జెనీవా వెళ్లేందుకు ఓ అవకాశమొచ్చింది. తన సన్నిహితులు ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి వెళ్తూ ఇతగాడినీ వెంటపెట్టుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అక్కడి సమ్మేళనంలో ఓ విదేశీయుడి ప్రవర్తన ఇతని జీవితంలో పెనుమార్పును తీసుకువస్తుందని తాను ఊహించనేలేదు. భారతదేశం పైనా, ఇక్కడి ప్రజలపైనా ఆ విదేశీయుడు పేలిన అవాకులు, చెవాకులతో ఈ యువకుడిలో కోపం కట్టలుతెంచుకుంది. అయినా తమాయించుకున్నాడు. 'భారతీయులు బికార్లు. బిచ్చమెత్తుకోవడానికి బొచ్చె పట్టుకుని మరీ పశ్చిమ దేశాల చుట్టూ తిరుగుతూ ఉంటారు' అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని అతని మనస్సు తీవ్రంగా గాయపడింది. దీన్నో అతిపెద్ద అప్రతిష్ఠలా భావించాడు. ఆ శాస్తవేత్తకు ఎలా అయినా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయితే అతనిలో అక్కడ వాదించడం వల్ల ప్రయోజనం లేదని గుర్తించి ఇండియా తిరిగి వచ్చారు. భారత్‌కు ఉన్న సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు.
ఈ ప్రయత్నం నుంచి పుట్టిన టీకా బయోటెక్నాలజీ రంగంలోనే ఓ సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. ఇది భారత్ సహా ప్రపంచానికంతటికీ ఉపయుక్తంగా మారింది. భయంకరమైన వ్యాధితో అసువులు బాస్తున్న చిన్నారులకు ఆ టీకా ఓ సంజీవనిలా మారింది. ఎన్నో పశ్చిమ ప్రాంత దేశాలు ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని మరీ తమ పిల్లల ప్రాణాలను కాపాడుకున్నాయి. భారత్ చెయ్యి చాచే దేశంకాదు... ప్రపంచానికే చెయ్యినందించి ఊతమిచ్చే దేశమని రుజువు చేశారు ఆ ఇంజనీర్.
ఇంతసేపూ మనం మాట్లాడుకున్న ఆ వైజ్ఞానికుడే కె.ఐ. వరప్రసాద్ రెడ్డి. నిజంగా అతను సార్థక నామధేయుడు అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అతనే శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు. హెపటైటిస్ - బి అనే మహమ్మారితో చిన్నపిల్లలు చిగురుటాకుల్లా వణికిపోతూ కన్నుమూస్తున్న తరుణంలో శాంతా వ్యాక్సిన్లు వాళ్లకు పునర్జన్మనిచ్చాయి. అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను అత్యంత చౌకగా ప్రపంచానికి అందించి సామాన్యులకు చేరువ చేశారు వరప్రసాద్ రెడ్డి. 1980-1990ల కాలంలో ప్రతీ శిశువుకూ హెపటైటిస్ - బి వ్యాక్సిన్ తప్పనిసరి అని అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే అప్పుడు ఆ వ్యాక్సిన్ ఖరీదు సుమారు 23 డాలర్ల వరకూ ఉండేది. ఆ రోజుల్లో అంత సొమ్ము పెట్టి కొనగలిగేంత స్థోమత అత్యధిక శాతం మంది భారతీయులకు ఉండేది కాదు. శాంతా రాకతో ఆ టీకా ధర పదోవంతుకంటే తక్కువకు పడిపోయింది. ఒక్క డాలర్ కన్నా తక్కువలోనే వ్యాక్సిన్‌ను తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి శాంతా బయో ఎదిగింది అంటే.. దాని వెనుక ఉన్న శక్తి మాత్రం వరప్రసాద్ రెడ్డిదే. ఈ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అతడిని 2005లో పద్మభూషణ్‌తో సత్కరించుకుని సంతృప్తిపడింది.
హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన అత్యంత ప్రత్యేకమైన సమాగమంలో వరప్రసాద్ రెడ్డి ఎన్నో ముఖ్యమైన జీవిత విశేషాలను మాతో పంచుకున్నారు. అత్యంత ప్రధానమైన, తన జీవితాన్ని మలుపుతిప్పిన జెనీవా ఘటనపై మాట్లాడుతూ..
" మా బంధువుతో కలిసి జెనీవా వెళ్లాను. అక్కడ జరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో అతను ఓ పేపర్‌ను ప్రెజెంట్ చేయాల్సి ఉంది. వ్యాక్సినేషన్ - ప్రాధాన్యత అనే అంశమే ప్రధానంగా సాగిన ఆ కాన్ఫరెన్సులో నేను అనేక విషయాలను తెలుసుకున్నాను. హెపటైటిస్ - బి గురించి మొట్టమొదటగా అక్కడే విన్నాను. ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌ను అయిన నాకు ఈ వ్యాక్సిన్లు, వ్యాధుల గురించి వింటూ ఉంటే అంతా కొత్తగా అనిపించింది. భారత్‌లో 5 కోట్ల మంది భారతీయులు కాలేయ సమస్యలతో బాధపడ్తున్నారనే విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. చైనాలో కూడా సుమారు 5.5 కోట్ల మంది ఈ వ్యాధిని బారిన పడ్తున్నారనే విషయాన్ని గ్రహించాను. ఈ రెండు దేశాలే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఈ మహమ్మారిని తరిమికొట్టలేక తమ చిన్నారులను కోల్పోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. 90వ దశకంలో హెపటైటిస్ - బి వ్యాక్సిన్‌ను కేవలం రెండు దేశాలు మాత్రమే తయారు చేసేవి. అవి కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. అప్పుడే నాకు ఓ మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఎటూ ఉద్యోగం లేదు.. చేసేందుకు ఏ పనీ లేదు. ఏం చేయాలో స్పష్టత కూడా లేదు. అలాంటప్పుడు భారత్‌లోనే ఈ వ్యాక్సిన్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. చౌక ధరలో దేశంలోని నలుమూలలా ప్రతీ సామాన్యుడు ఈ టీకాను కొనేలా చేయాలని బలంగా నిశ్చయించుకున్నాను. దాన్నే నా జీవితాశయంలా మార్చుకున్నాను''.
ఆలోచనైతే ఉంది కానీ.. దాని అమలు విషయంలోనే అతను ఊహించని పరిణామాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్కో అడుగు ముందుకు వేయాలనుకున్న ప్రతీసారీ .. పది సమస్యలు వెనక్కిలాగేవి. ఇలా కుదరదని అర్థమయ్యాక హెపటైటిస్ - బి ఫార్ములా కోసం వరప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. అక్కడ ఈసారి మరిన్ని ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. టెక్నాలజీని ఇవ్వాలని ఓ సైంటిస్టును అడిగినప్పుడు ఆయన చేసిన దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు ఇతనిలో మరింత పట్టుదలను పెంచాయి. '' ఆ విదేశీయుడు అన్న మూడు మాటలను నేను ఎన్నటికీ మరిచిపోలేను. మీ ఇండియన్స్ అంతా బెగ్గర్స్. చేతిలో చిప్ప పట్టుకుని టెక్నాలజీ కోసం మాలాంటి దేశాల వెంటపడుతూ ఉంటారు. మీ భారాన్ని మేం ఇంకా ఎంత కాలం మోయాలి. ఇక అతను చేసిన రెండో వ్యాఖ్య మరింత అసహనానికి గురిచేసింది. ఒక వేళ మా టెక్నాలజీని మీకు ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది. మీ సైంటిస్టులు దాన్ని అర్థం చేసుకోవడానికే ఏళ్లకు ఏళ్లు పడ్తుంది అంటూ తన దేశ అహంకారాన్ని చూపించాడు. మనవాళ్లను కించపరిచేలా అతగాడు చేసిన వ్యాఖ్యలు నాకు దిమ్మతిరిగేలా చేశాయి. మీ ఇండియా చాలా పెద్ద దేశం. రోజూ ఎంతో మంది పిల్లలు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఇక అలాంటివాళ్ల కోసం వ్యాక్సిన్ అవసరం ఏముంది అంటూ కూసిన కూతలు నన్ను కదిలించాయి.
ఆ అవమానాన్నే తన సంస్థ ఏర్పాటుకు ఇంధనంలా మార్చుకుని ఇండియా తిరిగి వచ్చారు వరప్రసాద్ రెడ్డి. శాంతా బయోటెక్నిక్స్కు శ్రీకారం చుట్టి శంకుస్థాపన మొదలుపెట్టారు. ఎవరెస్టును తలపించేలా ఒక్కో అవరోధం అడ్డుపడ్తూ ఉంటే వాటిని అధిరోహిస్తూ ముందుకు కదిలారు.
1993లో శాంతాను మొదలుపెట్టినప్పుడు.. అప్పటి వరకూ దేశంలో ఏ ఇతర బయోటెక్నాలజీ సంస్థ కూడా లేదు. కొన్ని కాలేజీల్లో ఈ కోర్సులు ఉన్నా వీటిపై అవగాహన అంతంతమాత్రంగానే ఉండేది. ఈ రంగంలో జరిగిన పరిశోధన కూడా పెద్దగా లేదు. దీంతో సరైన ఉద్యోగుల దొరకడం మరో ప్రధాన ఇబ్బందిగా మారింది. ఇక చేసేదిలేక ఓ కొత్త విధానాన్ని ఆయన అవలంభించారు. దేశభక్తితో పాటు కష్టపడిపనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్లను ఏరికోరి ఎంపిక చేశారు. ఆలోచనల్లో స్పష్టత, ఏదో ఒకటి చేయాలనే తపన ఉండే వాళ్లతో ఎలాంటి పనైనా చేయించవచ్చని, వాళ్లకు ఏదైనా నేర్పించవచ్చనే విషయాన్ని ఆయన గుర్తించారు.
నిధులకు సంబంధించిన మరో సమస్య తర్వాత ఇబ్బందిపెట్టింది. శాస్త్ర,పరిశోధనతో కూడిన వ్యవహారం కావడంతో డబ్బు అధికంగా అవసరం ఉంటుంది. తన దగ్గరున్న సొమ్ముతో పాటు కుటుంబ సభ్యుల నుంచి రూ.1.90 కోట్లు మాత్రమే సేకరించారు. అయితే అంత పెద్ద బృహత్తర ప్రాజెక్టుకు ఈ సొమ్ము ఏ మాత్రం సరిపోలేదు.
'' ప్రాజెక్టుపై మాకు ఉన్న ధృడవిశ్వసానికి దేవుడు కూడా కరుణించాడు. ఎక్కడో ఒమన్ దేశం నుంచి పెట్టుబడులను పంపించాడు. ఒమన్ దేశ విదేశాంగ మంత్రికి మా ఆలోచన నచ్చి రూ. 2 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా ఆయన సొంత పూచీకత్తుపై ఆ దేశ ఆర్థిక సంస్థల నుంచి రుణం కూడా ఇప్పించారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటు వేగం అనూహ్యంగా పెరిగింది ''.
అప్పట్లో భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇలాంటి కొత్త ప్రాజెక్టులకు ప్రోత్సాహాన్ని ఇవ్వకపోవడంపై ఆయన ఇప్పటికీ మండిపడుతునే ఉంటారు. ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా పాజిటివ్‌గా స్పందించకపోవడంతో చాలా బాధపడ్డారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలంటే వరప్రసాద్ రెడ్డికి మరింత కోపం. ఎందుకంటే దేశంలో నూతన ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన ఆ సంస్థలు కూడా మొహం చాటేయడాన్ని ఆయన ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు.
ఓ ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌కు బయోటెక్నాలజీతో ఏం సంబంధం..? ఈ ప్రాజెక్టు నిజంగా సాధ్యమయ్యేదేనా..? దేశంలో ఇప్పటివరకూ ఇలాంటిది లేదే..? వ్యాక్సిన్లకు ఇండియాకు డిమాండ్ ఉంటుందా..? వంటి తలతిక్క ప్రశ్నలను బ్యాంకు అధికారులు అడిగేవారని పాత రోజులను ఆయన గుర్తుచేసుకుంటారు. దేశంలో ఏటా 2.5 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారని, వాళ్లందరికీ ఈ టీకా అత్యవసరమని వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసినా, ఫలితం శూన్యం. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా డిమాండ్ ఉంటుందని, విదేశీ సంస్థలు రూ. 840కు ఇస్తున్న టీకాను రూ.50 కంటే తక్కువగా ఇద్దామనే తన ఆలోచనను వాళ్లను అర్థం చేసుకోలేకపోయారని బాధపడతారు. చివరకు ఒమన్ దేశస్థులు ఈ అవసరాన్ని గుర్తించి ఆర్థికంగా తోడ్పడడం వల్లే ముందుకు కదిలినట్టు చెప్తారు. ఆశ్చర్యంగా భారత ప్రభుత్వం కూడా టెక్నాలజీ పరంగా ఏ మాత్రం సాయం చేయలేదంటారు వరప్రసాద్ రెడ్డి.
ఇలా ఒక్కో అవాంతరాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఆయనను విజయం వరించింది. పరిశోధనలో ఫలితం వచ్చింది. హెపటైటిస్ బి ని ఎదుర్కొనే టీకా భారత్ నుంచి సిద్ధమైంది. అయితే అప్పటివరకూ ఇలాంటి టీకాల అమ్మకాలకు సంబంధించి దేశంలో ఎలాంటి ప్రోటోకాల్ లేదు. వీటి అమ్మకానికి సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయనే అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది.
1997 ఆగస్టులో శాంతా బయోటెక్నిక్స్ నుంచి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. యాధృచ్ఛికంగా అది మన భారత దేశ గోల్డెన్ జూబ్లీ సంవత్సరం. స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలు పూర్తైన సందర్భంలో జరుగుతున్న వేడుకల్లో శాంతా కూడా తనవంతు పాత్రను పోషించింది. చరిత్రలో నిలిచిపోయేలా బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ఓ అధ్యాయాన్ని లిఖించింది.
అంత చౌకగా వ్యాక్సిన్ అయితే తయారైంది కానీ.. మన దేశ ప్రభుత్వం మాత్రం దాన్ని ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పెట్టేందుకు సిద్ధపడలేదు. మహమ్మారిని తరిమికొట్టేందుకు పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ టీకాలు ఉపయోగిస్తుంటే మన వాళ్లు మాత్రం మిన్నకుండిపోయారు. ఈ లోపు మల్టీనేషనల్ కంపెనీల నుంచి ధర తగ్గించమనే ఒత్తిడి కూడా అధికమైంది. అదే చేస్తే ఈ కష్టానికి ఫలితం ఉండదనే ఉద్దేశంతో మరోసారి తన పోరాటాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు పద్నాలుగేళ్ల కష్టం తర్వాత హెపటైటిస్ బి టీకాను జాతీయ టీకాకరణ కార్యక్రమంలో చేర్చారు.
లంచాల రుచి మరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి ఒకరు ఇందుకోసం చేతులు తడపాలని అడిగిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే అద్భుతమైన ప్రోడక్టును దేశం కోసం తయారుచేసి, విలువలకు కట్టుబడినప్పటికీ ఇలాంటి వాళ్లతో వ్యవహారం నెరపాల్సి వస్తోందని బాధపడినా, ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆలస్యమైనా ఫరవాలేదు కానీ పైసా కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. తల్లి నుంచి పుణికిపుచ్చుకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం వల్లే ఇలా చేశానంటారు వరప్రసాద్. మొదటి సంస్థకు 'శాంతా' అని తన పేరు పెట్టడంతో చాలా సంతోషించింది ఆ తల్లి. పేరుకే గృహిణే కానీ.. తల్లి ప్రభావం ఆయనపై చాలా ఎక్కువగా ఉంది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు. నవంబర్ 17,1948లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో రైతు కుటుంబానికి చెందిన వెంకటరమణారెడ్డి, శాంతాలకు జన్మించారు వరప్రసాద్ రెడ్డి. తల్లిదండ్రులిద్దరూ అప్పట్లోనే విద్యావంతులు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. తండ్రి ఆరోతరగతి పూర్తి చేస్తే తల్లి మాత్రం ఎనిమిదో క్లాసు వరకూ చదివారు. అప్పట్లో ఎనిమిదో తరగతికే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. నిత్యం ఆధ్యాత్మిక భావనలతో ప్రశాంత వదనంతో కనిపించే తల్లిని చూసి ఆయన చిన్నప్పటి నుంచే స్ఫూర్తిపొందేవారు. అయితే పెద్ద కుటుంబం కావడంతో అక్కడ ఇతని చదువుకు ఆటంకం రావొచ్చనే ఉద్దేశంతో తల్లి.. వరప్రసాద్ రెడ్డిని నెల్లూరులో ఉన్న తన తమ్ముడి ఇంటికి పంపారు.
సామాజిక సేవే ధ్యేయంగా బతికిన అతని మామ.. సిపిఐ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. చివరు భూములు, ఆస్తులను కూడా పార్టీకి రాసి ఇచ్చేశారు. నిత్యం ఏదో ఒక ప్రజాసేవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండేవారు. ఆయన వెంట తిరిగే వరప్రసాద్ రెడ్డిపై కూడా ఈ ప్రభావం పడింది.
ఓ వైపు భక్తిభావంతో దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్న తల్లి, మరోవైపు దేవుడే లేడు, మానవ సేవే ముఖ్యమనే మామయ్య. ఇలా ఏ దారిని పట్టుకోవాలో తర్జనభర్జన పడ్డాక, చివరకు మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు వరప్రసాద్. ఏదో తెలియని శక్తి సృష్టిని ముందుకు నడిపిస్తోందని భావిస్తున్న తల్లిని కాదనలేము. అందుకే ఏదో శక్తి ఉందనే విషయాన్ని రూఢీ చేసుకున్నారు. అలానే మానవ సేవే ముఖ్యమనే మతాన్ని నమ్మారు.
చిన్నప్పుడు పాఠం చెప్పిన తెలుగు టీచర్ ప్రభావం కూడా జూనియర్ వరప్రసాద్‌పై ఎక్కువగానే ఉంటుంది. అతను పాఠం చెబ్తున్న తీరుతో మంత్రముగ్ధుడై.. చివరకు తెలుగుపై అధిక మమకారం పెంచుకున్నారు. తెలుగు, సాహిత్యంపై డిగ్రీ చేయాలని అనుకున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. తన ఆలోచనను మామయ్యతో పంచుకున్నారు. అయితే అప్పుడు దేశ నిర్మాణంలో యువకుల పాత్రను అతని మామయ్య వివరించారు. గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మించి దేశానికి ప్రయోజనకరమయ్యే పనిచేయాలనే అతని సూచనతో అయిష్టంగానే ఇంజనీరింగ్‌లో చేరారు. '' బలవంతంగానే నేను సైన్స్ విద్యను అభ్యసించాల్సి వచ్చింది. నేనో అసాధారణ స్టూడెంట్ కానేకాదు. నేనో మామూలు విద్యార్థిని మాత్రమే. ఒకటి, రెండు ర్యాంకులు కూడా.. ఏడులోనో.. ఎనిమిదిలోనూ నా నెంబర్ ఉండేది''.
1967లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి బీఎస్ఈ పట్టా అందుకున్న వరప్రసాద్ రెడ్డి ఆ తర్వాత కాకినాడలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. అక్కడ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన కంప్యూటర్స్ సైన్స్‌లో పిజి డిప్లొమా చదివేందుకు జర్మనీ వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయనకు జర్మన్ల పద్ధతులు చూసి ముచ్చటేసింది. సమయానికి వాళ్లు ఇచ్చే విలువ, వాళ్ల సంస్కృతి బాగా నచ్చాయి. ఈ మధ్యలో ఒకసారి యూఎస్ వెళ్లిన ఆయనకు అక్కడి వ్యవహారం ఎందుకనో నచ్చలేదు.
1971-72లో ఇండియా తిరిగి వచ్చిన ఆయనకు వెంటనే ఉద్యోగం లభించింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావడంతో హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకుడిగా చేరారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో గొప్ప అద్భుతాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. టెక్నాలజీలో భారత్ తన కాళ్లపై తాను నిలబడేందుకు తీర్చిదిద్దిన వ్యవస్థ డిఆర్డిఓ. '' కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఎన్నో అద్భుతాలు సృష్టించేందుకు అవకాశాలున్నాయి. కానీ అక్కడి వికాసానికంటే విలాసానికే అధిక ప్రాధాన్యం. ప్రజల సొమ్మును పూర్తిగా దుబారా చేసేవారు. దాన్ని చూసి ఓర్చుకునే శక్తి నాలో లేదు. అందుకే ఐదేళ్ల పాటు భరించిన తర్వాత ఇక బయటకు వచ్చేశా'' అంటారు వరప్రసాద్ రెడ్డి.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే ఉన్నతోద్యోగులు, నిత్యం మిలటరీ సిబ్బంది చొరబాట్లు, నిఘా నేత్రాలు, ప్రోటోకాల్స్ వంటివి ఆయనకు నచ్చలేదు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలోనే బుద్ధి వికసిస్తుందని కానీ ఇలాంటి బంధనాల వల్ల ప్రయోజనం ఉండబోదనే విషయాన్ని గుర్తించినట్టు చెప్తారు. ఈ ఉద్యోగానికి స్వస్తి చెప్పిన తర్వాత సొంతూరు వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని అనుకున్నారు. అయితే పట్టణం వీడితే పాత జ్ఞాపకాలు మరింత బాధిస్తాయని భావించారు.
ఈ గందరగోళంలో ఉన్న ఆయనకు 1977లో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగానికి పిలుపొచ్చింది. అప్పుడు ఆ సంస్థకు ఎండిగా ఉన్న డా. రామ్ కె వేపా సమర్థతను తెలుసుకున్న ఆయన ఉద్యోగంలో చేరారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిన తను సంస్థకు సంబంధించిన వ్యవస్థలను ఎలక్ట్రానిక్స్ దిశగా మార్చే ప్రయత్నం చేశారు. తక్కువ కాలంలో ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం అతడిని సంస్థకు డైరెక్టర్‌ను చేసింది.
అయితే ఈ వ్యవస్థ వ్యవస్థ కోసం కాకుండా కొంతమంది వ్యక్తుల కోసం నడుస్తున్న వైనాన్ని ఆయన పసిగట్టారు. ముఠాకట్టిన అధికారులు, రాజకీయ నేతల మూకుమ్మడి చర్యలతో కార్పొరేషన్ ఇబ్బందుల్లోకి జారుకుంటోందని గుర్తించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలిచ్చి ఆదుకోవాల్సిన కార్పొరేషన్‌ను వాళ్ల కనుసన్నల్లో నడిచేలా మార్చారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ సంస్థను పూర్తిగా ముంచేసేందుకు కొంతమంది సిద్ధం కావడాన్ని వరప్రసాద్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఒకే కంపెనీకి మూడు, నాలుగు బ్యాలెన్స్ షీట్లను తయారు చేస్తూ.. ఒకటి కార్పొరేషన్‌కు, మరొకటి భాగస్వాములకు.. మరొకటి సొంతానికి ఉపయోగిస్తున్న వాళ్లపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
కానీ పై అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడారు. వ్యాపారం చేయడమంటే అంత సులువు కాదని, జిమ్మిక్కులు చేయకుండా బిజినెస్మెన్ కావడం అసాధ్యమని వాదించారు. అయితే పారదర్శకతతో పారిశ్రామికవేత్త కావడం నిజంగా అంత కష్టమా.. ఓ సారి ఆ అవతారాన్ని ఎత్తిచూద్దామని అప్పుడు అనిపించింది వరప్రసాద్ రెడ్డికి. అదే తను ఆంట్రప్రెన్యూర్‌గా మారేందుకు పడిన తొలిఅడుగు.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ పేరును ప్రస్తావించారు. అప్పట్లో ఆ సంస్థకు అప్పుల్లో కూరుకుపోయి పతనానికి పది అడుగులు దూరంలో ఉంది. అయితే ప్రమోటర్ మాత్రం గొప్ప స్కాలర్. అప్పట్లోనే న్యూయార్క్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉండేవారు. ఈ లోగా బ్యాటరీలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్న వరప్రసాద్ రెడ్డి.. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. హైదరాబాద్ బ్యాటరీస్‌లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి భాగస్వామిగా చేరారు. తన బుర్ర, బుద్ధితో కంపెనీని మెల్లిగా ఒక్కో అడుగూ పైకి ఎక్కిస్తూ.. పరుగులు తీయించారు వరప్రసాద్. అప్పుల్లో ఉన్న హైదరాబాద్ బ్యాటరీస్.. మళ్లీ లాభాల్లోకి వచ్చింది. విమానాలు, మిస్సైల్స్‌కు కూడా బ్యాటరీలు సరఫరా చేసే స్థాయికి సంస్థ ఎదిగింది. నాలుగు డబ్బులు కళ్లజూసిన ప్రమోటర్‌కు బుద్ధి మారింది. లాభాలను మరింతగా దండుకునేందుకు ప్రభుత్వానికి చెల్లించే పన్నులను కట్టవద్దంటూ ఇతనికి సూచించారు. ఈ ఆలోచనను వ్యతిరేకించిన వరప్రసాద్ రెడ్డి ఇందుకు ససేమిరా అన్నారు.
కన్నతల్లి, మేనమామల నుంచి నేర్చుకున్న విషయాలకు కట్టుబడి ఉండాలని మరోసారి నిర్ణయించుకున్నారు. ఏ తప్పూ చేయకుండా హుందాగా, నీతినిజాయితీతో బతకాలని భావించారు. దీంత ప్రమోటర్లకు బుద్ధి మరింత వక్రమార్గం పుట్టి ఇతనని కంపెనీ నుంచి తప్పించారు.
పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. " ఆ రోజులు నాకు చాలా దుఃఖపూరితమైనవి. చాలా ఆవేదనకూ, అవమానికి గురయ్యాను. ఓ పథకం ప్రకారం నన్ను వాళ్లు కంపెనీ నుంచి తప్పించారు. అవన్నీ పక్కకుబెడితే నేను ఈ సంస్థ వల్లే ఆంట్రప్రెన్యూర్ అయ్యాను'' అంటారు ఆయన. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన పాత ప్రమోటర్లను సమర్ధిస్తూనే ఉంటారు. అయితే ఇందులో వెటకారంపాలూ కాస్త ఎక్కువే కనిపిస్తాయి. నా కంటే వాళ్లు మరింత సమర్ధవంతులు అయి ఉండవచ్చు. సంస్థను నడిపించడంతో వాళ్లు నా కంటే మెరుగ్గా ఉండవచ్చు. చిన్నస్థాయి సంస్థను ఉన్నతికి తీసుకెళ్లడం వెనుక వాళ్ల కృషి చాలానే ఉంది. ఎంత చెప్పుకున్నా.. ఆ అనుభవం నాకు చాలా పాఠాలనే నేర్పింది అంటారు వరప్రసాద్ రెడ్డి.
మొత్తమ్మీద శాంతా బయోటెక్నిక్స్ ప్రయాణంలో తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సంఘటన ఏదైనా ఉందా అని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే.. '' మా సంస్థలో డ్రైవర్ల నుంచి శాస్త్రవేత్తల వరకూ ప్రతీ ఒక్కరికీ షేర్లను ఇచ్చాం. అప్పట్లో శాంతాను విదేశాలకు చెందిన సనోఫి అవెంటిస్ కొనుగోలు చేసినప్పుడు ఉద్యోగులంతా ఆనందంలో మునిగిపోయారు. రూ. 500 దక్కాల్సిన ఒక్కో షేరుకు ఏకంగా వాళ్లు రూ. 2345 ఇచ్చి మరీ కొనుగోలు చేశారు. దశలవారీగా శాంతాలో మొత్తం వాటాను కొనుగోలు చేసిన సనోఫి సంస్థ.. వరప్రసాద్ రెడ్డిని మాత్ర గౌరవ ఛైర్మన్‌గానే ఉంచింది. అతని అనుభవానికి, సమర్థతకూ పెద్దపీట వేశారు. ఇప్పటికీ వరప్రసాద్ రెడ్డి శాంతా బయోటెక్‌కు ఛైర్మన్‌గా, బ్రాండ్ ఎంబాసిడర్‌గా కొనసాగుతూనే ఉన్నారు.
విదేశీయుడు చేసిన అవమానానికి ఎలా కసితీర్చుకున్నారు అని చివరగా ఆయన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబ్తూ.. '' మన దగ్గర తయారైన టీకాలను యూనిసెఫ్ సహా అనేక ప్రపంచ దేశాలు కొనుగోలు చేసి మరీ వినియోగించేవి. మేం కొన్ని టీకాలను ఉచితంగా కూడా సరఫరా చేసేవాళ్లం. కొన్ని పశ్చిమ దేశాలు కూడా మేం పంపిన ఉచిత వ్యాక్సిన్లను ఉపయోగించేవి. భారత్ ఎప్పుడూ దాతగానే నిలుస్తుంది తప్ప.. దిగజారి చేతులు చాపే స్థితే ఉండదు అని మరోసారి రుజువు చేసినట్టు భావించాను.
''ఏదో సంపాదించేసి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని శాంతా బయోటెక్నిక్‌ను ప్రారంభించలేదు. నన్ను రెచ్చగొట్టారు. రెచ్చిపోయిన నేను రెట్టించిన ఉత్సాహంతో సంస్థను ఏర్పాటు చేశాను. విర్రవీగిన విదేశీయుడికి విజయంతో సమాధానం చెప్పాననే సంతృప్తి ఉంది''.