ఆన్లైన్ షాపింగ్ సైట్లను ఒక్కచోటికి చేర్చి, ప్రొడక్ట్ రివ్యూస్ చెప్పే 'హపింగో'
ఓ సంపన్న వ్యక్తి నుంచి అందుకున్న 60లక్షల పెట్టుబడితో ఆన్ లైన్ షాపింగ్ ను కొత్త పుంతలు తొక్కించిన విజేతల కథే ఇది. స్వాతి గౌబా కాలేజ్ విద్యార్ధినిగా ఉన్నప్పుడే డ్రెస్సింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత కోసం తపిస్తుండేవారు. స్వతహాగా షాపింగ్ అంటే విపరీతమైన ఇష్టమున్న ఈమె తరచూ ఈ-కామర్స్ సైట్లలో విండో షాపింగ్ చేస్తుండేవారు. అయితే కోరుకున్న ఉత్పత్తి గురించి సమాచారం తక్కువగా ఉండడం, మరిన్ని అంశాలు తెలుసుకునే వెసులుబాటు లేకపోవడం స్వాతిని నిరాశకు గురిచేసేది. ఈ అంశాన్నే క్యాష్ చేసుకోవాలనుకున్నారీమె. వ్యాపారస్తుల కుటుంబమే కావడంతో ఆమె కూడా సొంతంగా బిజినెస్ ప్రారంభిచాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఈ-కామర్స్ లోకి అడుగుపెట్టేశారు.
ఒకే రకమైన సైట్స్‌ను పలుసార్లు బ్రౌజ్ చేయడంతో ఉత్పత్తుల గూర్చి మరింత సమాచారం ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించారు స్వాతి. జొమాటో నుంచి రెస్టారెంట్ల వివరాలు తెలుసుకున్నట్లే ఉత్పత్తి గురించి వివిధ వెబ్ సైట్స్ అందించే విషయాలన్నింటినీ ఒకే సైట్లో ఉండే వెసులుబాటును కల్పించాలని అనుకున్నారు. రొటీన్‌గా చేసే సెర్చ్‌లో ఇతరులు తమ అభిప్రాయాలతో మనల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని గమనించారు. అందుకే వాస్తవికతకు పెద్దపీట వేస్తూ సమాచారాన్ని అందించాలనుకున్నారు.
సొంతంగా సైట్ ప్రారంభించడానికి ముందే స్వాతి ఉద్యోగం చేస్తున్నారు. ఈ జాబ్ చేస్తూనే సొంత డిజిటల్ ఏజన్సీ ఉన్న మాయుర్ను కలుసుకున్నారు. మీడియా-టెక్నాలజీ రంగంలో గడించిన అనుభవంతో వీరిరువురూ హపింగో అనే వెబ్ సైట్ ప్రారంభించారు. హొపింగో గురించి తెలుసుకున్న భాస్కర్ విశ్వనాధమ్... స్వాతి ఆలోచనపై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయం హపింగోకు కేటాయించారు.
హపింగో కార్యకలాపాలు
హహింగోలో ఉత్పత్తుల వివరాలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయని నిర్వాహకులు చెబ్తున్నారు. ఈ సైట్ ఆన్ లైన్‌లోని 700లకు పైగా ఈ స్టోర్స్‌కు చెందిన విషయాలను అందిస్తుంది. యాక్సెసరీస్, దుస్తులు, ఫర్నిచర్‌తో పాటూ అనేక విభాగాలకు సంబంధించి 16 కేటగిరీల్లో సేవలందిస్తోంది.
2014 నవంబర్‌లో హపింగో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రతీ రోజూ 500 కొత్త ఉత్పత్తుల సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ వెబ్ సైట్ పనిచేస్తోంది. సైట్లో ఉత్పత్తుల గురించి పొందుపరిచే సమాచారం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో సాగుతుంది. దీంతో పేరున్న బ్రాండ్స్ కూడా తమ ప్రొడక్ట్స్ పై అభిప్రాయాలు రాయాలంటూ హపింగోను కోరుతున్నట్లు వ్యవస్థాపకులు చెప్పారు.
వివిధ రంగాల్లో అనుభవమున్న 22 మంది ఫ్రీలాన్స్ క్యురేటర్లు ఉత్పత్తులను పరిశీలించి అభిప్రాయాలు వెల్లడిస్తారు. ప్రతీరోజూ తమ దగ్గరికి వివిధ బ్రాండ్స్ నుంచి 2 వేల స్టైల్స్ వస్తున్నాయని వాటిలో 500 ఉత్పత్తుల వివరాలు రాస్తున్నామని తెలిపారు. ఇతరత్రా సైట్స్ అయితే ట్రాకర్స్, క్రాలర్స్ను ఎంచుకుంటున్నాయని, తాము వాటికి భిన్నంగా కార్యకలాపాలు సాగిస్తున్నామన్నారు.
హపింగోకు 10 వేల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ సైట్ రిటెన్షన్ రేట్ 44 శాతం. 9 నిమిషాల సరాసరిని పరిగణిస్తే మహిళల దుస్తుల గురించే ఎక్కువగా బ్రౌజింగ్ సాగుతోంది. వీళ్లలో 2 నుంచి 4 శాతం కొనుగోళ్లలోకి మరలుతున్నారు.
హపింగోకు మార్చ్ వరకు యాక్టివ్ యూజర్స్ 400 నుంచి 600 మంది ఉన్నారు. అయితే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి నుంచి ప్రస్తుత గణాంకాలను పరిశీలస్తే వినియోగదారులు 500శాతం పెరిగారు. ఆర్గానిక్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఫేస్ బుక్ ప్రకటన ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాబడి
హపింగోకు మూడు రంగాల నుంచి రాబడి వస్తోంది. రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్లు, తమ ఉత్పత్తులను హైలెట్ చేసినందుకు బ్రాండ్స్ చెల్లింపులు, నిర్దేశిత ప్రొడక్ట్స్ పై కథనాల నుంచి ఈ సంస్థకు డబ్బులు సమకూరుతున్నాయి. హపింగో ఇతర ఈ-స్టోర్స్తోనూ అనుబంధ మార్కెటింగ్ నిర్వహిస్తోంది. హపింగో ద్వారా ఇతర స్టోర్స్‌లో సేల్స్ జరిగితే సదరు సైట్స్ ఈ సంస్థకు కొంత మొత్తం చెల్లిస్తాయి.
ముందంజలో..
డిజిటల్ మాల్‌ను ఏర్పాటు చేయడమే హపింగో లక్ష్యం. ఈ కార్యక్రమంలో యూజర్స్‌కు సైతం భాగస్వామ్యం కల్పించేందుకు వ్యవస్థాపకులు ప్లాన్ చేస్తున్నారు. వినియోగదారులు తమదైన స్టైల్స్‌తో స్టోర్ ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటూ వారి ఉత్పత్తులు అమ్ముడైతే కొంత కమిషన్ చెల్లించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై స్పష్టత లేనప్పటికీ.. అనుబంధ చెల్లింపుల ద్వారా సమకూరిన మొత్తంలో 20 నుంచి 25 శాతాన్ని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న వినియోగదారులకు చెల్లించాలనుకుంటున్నట్లు మాయుర్ తెలిపారు. నవంబర్ నుంచి ఈ కొత్త వేదిక అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు.
మరో మూడు నెలల్లో హపింగో మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యాక్టివ్ యూజర్స్ సంఖ్య 10లక్షలకు చేరుకుంటుందని వ్యవస్థాపకులు భావిస్తున్నారు. ఇక రిజిస్టర్డ్ యూజర్స్ సంఖ్య 30 వేల నుంచి లక్షకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హపింగో అనుభవాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్న మాయుర్ ప్రతిరోజూ ఉత్తేజకరంగా గడిచిపోతోందని చెప్పారు. ప్రశంసలు, విమర్శలు, ఫీడ్ బ్యాక్, సలహాలు తమ జీవితంలో భాగమైపోయాయని తెలిపారు. తామందిస్తున్న సేవలతో వినియోదారులు సంతృప్తిగా ఉన్నారన్న మాయుర్ వారే తమ సౌహార్ద్ర రాయబారులని ఆనందం వ్యక్తం చేశారు.