ప్ర‌కృతి ఒడిలో మ‌హాద్భుత వైద్యం.. కేరాఫ్ కరీంనగర్‌

ప్ర‌కృతి ఒడిలో మ‌హాద్భుత వైద్యం.. కేరాఫ్ కరీంనగర్‌

Sunday March 13, 2016,

4 min Read


అదో ప్రకృతి వైద్యశాల! మందులకు లొంగని రోగాలను కూడా మటుమాయం చేస్తుంది ! అలాగని ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లతో విసిగించరు! పంచభూతాలైన నీరు, భూమి, గాలి, సూర్యరశ్మి, ఆకాశం, నిప్పు ద్వారనే చికిత్స చేస్తారు! తెలంగాణలోనే కాదు యావత్ దేశంలోనే పేరుమోసింది కరీంనగర్‌ సహజ వైద్యాలయం.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో వెలసింది ప్రకృతి వైద్యాలయం! పచ్చని చెట్లు, అందమైన మొక్కలు, ఆహ్లాదకర వాతావరణంలో రోగికి స్వాంతన చేకూర్చే ఒక దేవాలయం. మందుల గోల లేదు. ఆపరేషన్ల హడావిడి ఉండదు. పరీక్షలు, రిపోర్టుల బాధ లేదు. 

యోగా, వ్యాయామం, మర్ధన, సంతులిత ఆహారం! వీటితోనే రోగాలను పారదోలడం ఇక్కడి ప్రత్యేకత! మనం తినే ఆహారమే మనకు మందుగా పనిచేస్తుందని బోధిస్తూ, చిన్న చిన్న వ్యాయామాలు, ప్రకృతి పరంగా అందించే చికిత్సలతో జబ్బులు నయం చేయడం ఈ ఆస్పత్రి స్పెషాలిటీ! 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన సహజ ఆరోగ్య కేంద్రం ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద ప్రకృతి చికిత్సాలయంగా మారింది.

డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆస్పత్రులు నడుస్తున్న రోజులివి. ఇలాంటి ధోరణి మారాలి. వైద్యం పేదోడికి భారం కావొద్దు. ఆ మంచి సంకల్పంతోనే డాక్టర్‌ తంగెడ అమరేందర్ రావు ఈ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్ నిర్మించారు! భార్య మంజులను కూడా తనలాగే నేచురోపతి చదివించారు! కూతురు, కొడుకు కూడా అదే చదివారు! అల్లుడు, కోడలిని కూడా అలాంటి వారినే సెలక్ట్ చేసుకున్నారు! ఇప్పుడు వీరంతా ప్రకృతి వైద్య సేవలో తరిస్తున్నారు! అనేక దవాఖానాలు తిరిగి, లక్షల రూపాయలు ఖర్చు చేసినా నయంకాని రోగాలతో బాధపడుతున్నవారంతా.. ఇక్కడికి వచ్చి పూర్తిగా కోలుకుంటున్నారు!

మల్టీ స్పెషాలిటీల పేరుతో లక్షలు దండుకుంటున్న ఈ రోజుల్లో, నేచర్‌ క్యూర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వెనుక డాక్టర్‌ అమరేందర్‌ రావు బలమైన సంకల్పం ఉంది! పదో తరగతి చదువుకునేటప్పుడు, ప్రకృతి చికిత్స విధానంపై క్లాస్ లో టీచర్ చెప్పిన పాఠమే ఆనాడు స్ఫూర్తి రగిలించింది ! అదే స్ఫూర్తితో నేచురోపతితో వైద్య విద్యను పూర్తి చేశారు! ఆ తర్వాత 1974లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొదట ఓ చిన్న ఆస్పత్రిని ప్రారంభించారు! 

ఆస్పత్రి సేవలను గుర్తించిన అప్పటి జిల్లా కలెక్టర్ కేఎస్ శర్మ.. నగర శివారులోని బొమ్మకల్ గ్రామంలో నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు! ఆ స్థలంలో అమరేందర్ రావు ఓ భవనం నిర్మించి.. వైద్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా పచ్చని చెట్ల మధ్య.. ఓ ప్రశాంత కుటీర వాతారణాన్ని క్రియేట్ చేశారు! రోగులు ఉండేందుకు వీలుగా కాటేజీలు, గదులు నిర్మించారు! వ్యాయామ పరికరాలు, సన్ బాత్, స్టీమ్ బాత్, మడ్ బాత్ ట్రీట్ మెంట్, వ్యాక్యూమ్ థెరఫీ, పంచకర్మ విధానాలు అమలులోకి తెచ్చారు!

image


ప్రకృతి చికిత్సా విధానంలో ముఖ్యమైనవి యోగాసనాలు, ఆహారపు అలవాట్లు. వ్యాధిని బట్టి రోగికి రకరకాల యోగాసనాలు నేర్పిస్తారు! ముందుగా ఉపవాస చికిత్సతో ప్రారంభించి, క్రమంగా A-విటమిన్ ఉండే ఆహారాన్ని అందిస్తారు! తర్వాత సాత్వికాహారం. అంటే, పండ్లు, పాలు, మజ్జిగ వగైరా. ఆ తర్వాత పప్పులు, అన్నం, పెరుగు పెడతారు! పక్షవాతం, నడుం, మెడ నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇక్కడ సంపూర్ణ చికిత్స అందుతోంది! వ్యాధి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు ఇక్కడే ఉంచుకుని చికిత్స చేస్తారు!

ఇక్కడ జరిగే ట్రీట్‌మెంట్‌ కూడా వినూత్నంగా ఉంటుంది. ప్రాచీనమైన చైనా సూదుల వైద్య విధానంతో నడుము, మెడ నొప్పులకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. సన్నటి సూదుల నొప్పి తెలియకుండా శరీరంలో అవసరమైన చోట గుచ్చుతారు. ఆ తర్వాత నువ్వుల నూనెతో ప్రతిరోజు మర్దనా చేస్తారు! వ్యాక్యూమ్ థెరపీని క్రమంగా నిర్వహిస్తారు! గాజు సీసాలతో చేసే కప్పింగ్ చికిత్సా విధానంతో నడుం నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. స్పిరిట్ ను దూదిలో మండించి, దాన్ని సీసాలోకి ఆవిరి పడతారు! ఆ సీసాలను రోగి వీపుపై పెడతారు. దీంతో నడుంలోని కండరాలన్నీ ఒక్కదెబ్బకు సర్దుకుంటాయి.

ఇక చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించడానికి, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడానికి బురదతో చేసే మృత్తిక చికిత్స ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది! నల్లరేగడి మట్టిని మెత్తగా కలిపి తల నుంచి పాదాల వరకు పట్టిస్తారు! 40 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత స్నానం చేయిస్తారు! ఇలా చేయడం వల్ల శరీరంలో ఉష్ణతాపం పెరిగి చెమట, మలినాలు బయటకు వస్తాయి! ఎలాంటి చర్మవ్యాధులున్నా ఆల్ క్లియర్.

జలచికిత్సా విధానం ఇక్కడి మరో ప్రత్యేకం! టబ్ బాత్, స్టీమ్ బాత్, కేశుర్‌ బాత్, ఐస్ బాత్ వంటి వివిధ రకాల స్నాన విధానాల ద్వారా రోగాలను తగ్గిస్తారు! అదే విధంగా క్రోమియో థెరఫీ పేరుతో జరిపే చికిత్సలో విధరకాల రంగుల అద్దాల ద్వారా సూర్యకాంతిని శరీరంపైకి ప్రసరింపజేసి చికిత్స అందిస్తారు! ఎరుపు రంగుతో శరీరంలో వేడిని తగ్గిస్తారు. ఆకుపచ్చ రంగుతో క్రిములను చంపేస్తారు. జీర్ణ కోశ వ్యాధులను తగ్గించేందుకు పసుపురంగు సూర్య స్నానం చేయిస్తారు.

గడిచిన 40 ఏళ్లలో వేలాది మంది రోగులు ఇక్కడ చికిత్స పొందారు! సామాన్యుల దగ్గర్నుంచి ప్రముఖుల దాకా అందరూ ఈ ప్రకృతి చికిత్సాలయంలో స్వాంతన పొందినవారే.

image


ఏ రోగికైనా జబ్బు నయం కావాలంటే నాలుగు విషయాలు కీలకం. దవాఖాన పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలి! అలాగే రోగికిచ్చే ఆహారం సాత్వికంగా ఉండాలి! ట్రీట్‌మెంట్‌ పాజిటీవ్‌గా జరగాలి! జబ్బును బట్టి, అవసరమైన ఎక్విప్‌మెంట్‌, ఫెసిలిటీస్‌ సరిగా ఉండాలి. అప్పుడే రోగి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడతాడని అంటున్నారు డాక్టర్‌ అమరేందర్‌ రావు!

ప్రకృతి వైద్యవిధానం అనేది జీవన విధానం! పంచ భూతాలతో కూడుకున్నది! ఈ నేచర్‌ క్యూర్‌ సెంటర్లో వైద్యం మూడు విధాలుగా కొనసాగుతుంది! మొదటిది ఆహారం, రెండవది చికిత్స, మూడవది వ్యాయామం! శరీరానికి, మనసుకు హాయిగొలిపే వాతావరణం అన్నిటికంటే ముఖ్యం ! అదే ఇక్కడ కీలకం!

ఇక ఫిజియోథెరపీ ఈ సెంటర్లో మరో కీలకమైన ట్రీట్‌మెంట్‌! ఆధునిక కాలంలో వస్తున్న అనేక రకాల జబ్బులకు ఇక్కడ మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామని డాక్టర్‌ మంజుల అంటున్నారు!

డయాబెటీస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం ఇక్కడ మంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని పేషెంట్లు చెప్తున్నారు! నేచర్‌క్యూర్‌ ద్వారా ఒక ప్రత్యేక జీవన విధానం అలవడుతుందని సంతోషంగా చెపుతున్నారు!

image


వాహనాలను ఎలాగైతే సర్వీసింగ్ చేయించుకుంటామో, రోగాలు రాకుండా ఉండేందుకు యేడాదికోసారో, ఆర్నెల్లకోసారో మన శరీరాన్ని కూడా అలాగే సర్వీసింగ్ చేయించుకోవాలి! సాఫ్ట్‌ వేర్‌ లాంటి ఉద్యోగాల్లో అధికంగా ఒత్తిడికి లోనయ్యేవారు సైతం ఈ నేచర్‌ ట్రీట్‌మెంట్‌ బాటపడుతున్నారు!

పేషెంట్లు ఉండేందుకు వసతి, ఆహారం, చికిత్సకు కలిపి 900 రూపాయలు ఛార్జ్ చేస్తారు! కాటేజ్ లో ఉండాలనుకునే వారు మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది! నిరుపేదల విషయానికొస్తే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంది. ఈ వైద్యానికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తే పేదలకు తమవంతు సేవ చేస్తామని డాక్టర్‌ అమరేందర్ రావు అంటున్నారు.