ఆధునిక డబ్బావాలాకు అద్భుతమైన గిరాకీ
ఇంటి భోజనం... ఈ మాటల్లో మ్యాజిక్ ఉంటుంది. అమ్మ ప్రేమ-ఇంటితో ముడిపడిన అనుభూతులు మదిలో కదలాడతాయి. ఈ అంశాలనే ఛండీగఢ్ లో ఓ తల్లీకూతుళ్లు ప్రారంభించిన "ఘర్ కా ఖానా" టిఫిస్ సర్వీస్ ప్రస్ఫుటం చేస్తోంది. ఉద్యోగస్తులైన దంపతులు, బ్యాచిలర్స్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఇంటి భోజనం కోసం తపిస్తుంటారు. వీరందరి కోరికలకు "ఘర్ కా ఖానా" కేరాఫ్ అఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
గగన్‌దీప్ అంబాలాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు ముగిసిన తర్వాత బీఎస్సీ చదివేందుకు ఛండీగఢ్ వచ్చారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబ పోషణకు డిగ్రీ రెండో సంవత్సరం నుంచే ఉద్యోగం చేయాల్సి వచ్చిందామె. తండ్రి మరణంతో తల్లిని తనతో పాటూ ఛండీగఢ్ తీసుకొచ్చి "ఘర్ కా ఖానా" టిఫిన్ సర్వీస్ ప్రారంభించారు.
టిఫిన్ సర్వీస్ కెరీర్‌ను యువత తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ గగన్‌దీప్ మాత్రం ఇందులోనే స్థిరపడాలని అనుకున్నారు. మొదట్లో తల్లితో కలిసి రోజు ఉదయం ఐదు గంటలకే వంటింట్లో పని ప్రారంభించేవారు. టిఫిన్స్ సరఫరా చేయడం తిరిగి ఇంటికి వచ్చి తల్లికి సాయం చేయడం. ఇదే గగన్ దీప్ నిత్యకృత్యం. ఉదయం ఐదు గంటలకు వంట గదిలో ప్రారంభమైన వీరి రోజు రాత్రి 11 గంటలకు వంటగదిలోనే ముగిసేది. తాము చేస్తున్న పని సులభతరం అవడానికి ముందు అంతా కష్టంగా గడిచిందని గగన్ దీప్ చెప్తారు. ఈ కష్టమే తనను ప్రోత్సహించిందని అంటారు.
గగన్ దీప్ బలం, సామర్థ్యం ఆమె తల్లి జస్విందరే. " నా అవసరలన్నింటా అమ్మ తోడుగా ఉంటుంది. 50ఏళ్ల వయసులో ఉదయం ఐదు గంటలకే లేస్తూ అమ్మ పనిచేస్తుంటే నేనెందుకు వేకువజామునే లేవకూడదు ? కష్టపడి పనిచేయకూడదని రోజూ అనుకుంటూనే ఉంటా. మా అమ్మే నాకు స్ఫూర్తి " అని చెప్తారు గగన్ దీప్.
గగన్ దీప్-జస్విందర్ కౌర్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. మనిషిగా తాను విజయవంతం అవడానికి తల్లే కారణమంటారు గగన్ దీప్. ఇద్దరం ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకుంటారు. సవాళ్లపై ఆమె మాటల్లోనే "మహిళలు తమను తాము సీరియస్‌గా పరిగణించుకుంటే ప్రపంచం కూడా వారిని సమానంగా గుర్తిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని" అంటారు. తాను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతానని.. కష్టించి పనిచేస్తే ఫలితం ఉంటుందని విశ్వసిస్తానని చెప్పారు. చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నానంటున్నారు.
మరపురాని ఆవేదన
ఇప్పటికీ అతిపెద్ద సవాలు, తీరని నష్టం తన తండ్రి మరణమని గగన్‌దీప్ ఆవేదన పడ్తూ ఉంటారు. తండ్రి లేకుండా జీవితం చాలా కఠినంగా గడిచిందని, అయినా మా అభివృద్ధిని ఆయన చూడలేకపోయారని బాధపడ్తారు. భగవంతుడు కొన్ని తన దగ్గరే ఉంచుకుంటాడని అందరికీ అన్నీ దొరకడం కష్టమన్న విషయాన్ని అర్ధం చేసుకున్నానని నిట్టూర్చారు.
వ్యాపారంలో నిలబడేందుకు, ఆహార పదార్ధాల్లో వైవిధ్యం చూపేందుకు గగన్‌దీప్ తీవ్రంగా కష్టపడ్డారు. మొనాటనీ చేధించేందుకు, బడా సంస్థల పోటీతో కనుమరుగై పోకుండా ఉండేందుకు శ్రమించారు. కఠిన శ్రమ-సానుకూల దృక్పథమే తమను నడిపిస్తోందని తల్లీకూతుళ్లు చెప్తున్నారు. వినియోగదారుల అభిమానం-విశ్వాసమే తమను ఆటుపోట్ల నుంచి రక్షిస్తోందని అంటారు.
మరిన్ని లక్ష్యాలు
విద్యారంగంలో కౌన్సిలర్‌గా గగన్ దీప్ కెరీర్ ప్రారంభించారు. ఓ బ్యూటీ సర్వీస్ కోసం అసిస్టెంట్ మేనేజర్‌గా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నారు. ఘర్ కా ఖానాలో గగన్‌దీప్ తల్లితో పాటూ 10 మంది పనిచేస్తున్నారు. మరో కుక్‌తో కలిసి జస్విందర్ ఇప్పటికీ వంటలు చేస్తుంటారు.
ఇద్దరు-ముగ్గురు సహాయకులు, నలుగురు డెలివరీ వ్యక్తులు, ఒక అకౌంట్స్ మేనేజర్ పనిచేస్తున్నారు. స్థిరపడే వరకూ సొంతంగానే తమ వ్యాపారాన్ని నడపాలని అనుకుంటున్నట్టు గగన్‌దీప్ చెబుతారు. ఐదేళ్ల పాటూ హాబీగా నడిపిన ఈ బిజినెస్ అద్భుత ఫలితాలనిస్తోందని ఆనందపడ్తారు.
ప్రస్తుతం గగన్ దీప్‌ను కొందరు ఫుడ్ టెక్ స్టార్టప్స్‌తో పాటూ పెట్టుబడిదారులు కూడా సంప్రదిస్తుండడంతో ఆమెలో విశ్వాసం పెరిగింది. వ్యాపారం, మార్కెటింగ్ అనుభవాలతో గగన్ దీప్ మరింత ఎత్తుకు చేరుకునేందుకు కృషిచేస్తున్నారు. ఛండీగఢ్‌లో అమలు చేస్తున్న మోడల్‌నే మరో 6 నెలల్లో లూథియానాలోనూ ప్రవేశపెట్టే ఆలోచన ఉందని చెప్తున్నారు. ఈ రెండు చోట్లా మార్కెట్ విస్తృతి ఎక్కువగా ఉంటుందని అక్కడి నుంచి పంజాబ్, హర్యానా, జైపూర్‌లకూ విస్తరిస్తామని తెలిపారు. తమలాంటి ఆలోచనలున్నవారితో చేతులు కలిపేందుకూ సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంజిన్ అంతా రెడీ చేశామని దానికి కనెక్షన్ ఇచ్చి పనిచేయించాల్సి ఉందని గగన్‌దీప్ సరదాగా అంటారు.