స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సంచలనం మార్క్ 1
ప్రతి నెలా కొత్త ఫోన్ ఫీలింగ్ కలిగిస్తామంటున్న CREO
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇవాళ మార్కెట్లోకి వచ్చిన కొత్త ఆవిష్కరణ రేపటికి పాతదై పోతోంది. జనం కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే కంపెనీలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నాయి.
కస్టమర్లకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసే విషయంలో టెస్లా మోటార్స్ అన్నింటికన్నా ముందుంది. ఈ కంపెనీ అమెరికాలో లాంఛ్‌చేసిన S మోడల్ కారు కొన్న కస్టమర్లకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. 2015 అక్టోబర్ 14న కారు ఓనర్లు ఉదయం నిద్ర లేచేసరికి S మోడల్ కార్లో మేజర్ అప్ గ్రేడ్ యాడ్ చేసింది టెస్లా కంపెనీ. అదే ఆటో పైలట్ ఫీచర్. కంపెనీ సొంతంగా రూపొందించిన టెస్లా వెర్షన్ 7.0సాఫ్ట్‌వేర్‌తో కారులో ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాడ్ అయింది.
సాధారణంగా కంపెనీలు హార్డ్‌వేర్ సాయంతోనే తమ ప్రొడక్ట్స్ లో ఫీచర్స్ అప్‌గ్రేడ్ చేస్తాయి. కానీ పోటీ ప్రపంచంలో కంపెనీల ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడన్నీ సాఫ్ట్ వేర్, ఫర్మ్‌వేర్ అప్‌గ్రేడ్స్ అన్నీ సాఫ్ట్‌వేర్‌తోనే చేస్తున్నాయి. వాస్తవానికి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని డెవలప్ చేయాలన్న ఆలోచనతో టెస్లా కంపెనీ S మోడల్ కారులో రాడార్, కెమెరాలు, అల్ట్రాసానిక్ సెన్సర్ లాంటి వాటిని ముందుగానే అమర్చింది.
అమెరికన్ కంపెనీ టెస్లా చేసిన ఎక్స్పెరిమెంట్నే ఇండియన్ కంపెనీ CREO చేయాలని నిర్ణయించింది. ఇటీవలే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించిన ఈ కంపెనీ- ఫోన్ రిలీజ్ చేశాక కస్టమర్లకు తమ సాఫ్ట్వేర్ సాయంతో నెలకో కొత్త ఫీచర్ యాడ్ చేస్తామని అంటోంది. తద్వారా కస్టమర్లకు ప్రతినెలా ఓ కొత్త ఫోన్ వాడుతున్న అనుభూతి కలిగిస్తామని చెబుతోంది.
ఇదీ నేపథ్యం
స్నేహితులైన సాయి శ్రీనివాస్ కిరణ్, శుభం మల్హోత్రా 2013లో మ్యాంగోమేన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్ తొలుత గూగుల్ క్రోమ్‌కు పోటీగా HDMI మీడియా స్ట్రీమింగ్ డివైజ్ Teeweను 2014 సెప్టెంబర్‌లో లాంఛ్ చేసింది. 2015 మేలో Teewe 2ను లాంఛ్ చేసి- దేశంలో 50వేల కస్టమర్లను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలోనే మ్యాంగోమేన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి CREOగా పేరు మార్చుకున్న ఈ స్టార్టప్- ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ మార్క్ 1ను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉంది.
2015 మార్చిలో CREO సీక్వోయా క్యాపిటల్, ఇండియా కోషంట్ ఫండ్ నుంచి 11కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్ సమకూర్చుకుందీ కంపెనీ. అంతకు ముందే ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. 2016 జనవరిలో సీక్వోయా క్యాపిటల్, కోషెంట్ఫండ్, బీ నెక్ట్స్ వెంచర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల ఫండింగ్ సమకూర్చుకున్నట్లు CREO ప్రకటించింది.
“సరికొత్త స్మార్ట్ ఫోన్ డెవలప్ చేయాలన్నది మా లక్ష్యం. మేం రూపొందిస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో సంచలనం అవుతుందని అనుకుంటున్నాం. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సాయంతో యూజర్లకు కొత్త అనుభూతి కలిగించాలనుకుంటున్నాం.” సాయి, సీఈఓ
CREO ఫిలాసఫీ
హార్డ్‌వేర్‌లకు ప్రాధాన్యమున్న ప్రస్తుత తరుణంలో సరికొత్త సాఫ్ట్వేర్లతోనే మార్కెట్లో స్థానం సుస్థిరం చేసుకోగలమన్నది CREO నమ్మే సిద్ధాంతం. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ లెవల్లో ఫీచర్స్ డెవలప్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది
“స్మార్ట్ఫోన్లు కొన్న కొన్నినెలల తర్వాత స్లో అయిపోతుంటాయి. ఉత్పత్తిదారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనందునే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మా కంపెనీ అలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. యాజర్లకు ప్రతినెలా ఫంక్షనల్, స్మార్ట్ ఫీచర్స్‌కు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ పంపుతూ ఫోన్ పనితీరు బాగుండేలా చూసుకుంటాం. కస్టమర్లు నెల నెలా ఓ కొత్త ఫోన్ యూజ్ చేస్తున్న అనుభూతి కలిగిస్తాం.-సాయి, సీఈఓ
కమ్యూనిటీ ఇంక్లూసివ్ అప్డేట్ సిస్టం
CREO కమ్యూనిటీ ఇంక్లూసివ్ అప్డేట్ సిస్టం ఫాలో అవ్వాలని నిర్ణయించింది. అంటే యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్, సలహాలు తీసుకుని కొత్త ఫీచర్లు డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా ఎవరి సలహా, సూచనలు తీసుకుని ఫీచర్‌ను డెవలప్ చేశారో.. వారికే ఆ క్రెడిట్ దక్కేలా ప్లాన్ చేస్తోంది. యూజర్లు నెక్ట్స్ అప్డేట్లో ఎలాంటి ఫీచర్లు కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు కంపెనీ అప్లికేషన్‌ను తయారుచేస్తోంది. ప్రస్తుతం షియోమీ ఇలాంటి ఫీడ్‌బ్యాక్ విధానాన్నే అమలుచేస్తూ కస్టమర్లకు దగ్గరవుతోంది.
CREO మార్కెట్లోకి తీసుకురానున్న ఫోన్ ధర ఎంతన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే టెక్నోక్రాట్లను ఆకట్టుకునే ఫోన్లా మార్క్ 1 ఉంటుందని సాయి ధీమాతో చెబుతున్నారు. ఏడాదికి 12 అప్డేట్స్ ఇవ్వాలని భావిస్తున్న CREO.. టెక్నాలజీ గురించి అంతగా తెలియని వారినీ దృష్టిలో పెట్టుకుంది. అందుకే ప్రతి నెలా పంపే కొత్త ఫీచర్లు.. అప్‌గ్రేడ్ చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం కస్టమర్లకే వదిలేసింది. భారత్ లాంటి దేశాల్లో ఫోన్లో రెగ్యులర్‌గా కొత్త ఫీచర్లు యాడ్ అవుతూ ఉంటే.. అలాంటి వాటిని కొనేందుకు కస్టమర్లు ఇష్టపడతారు.
ఫ్యూచర్ ప్లాన్స్
ఏడాదికి 12 అప్డేట్స్ అందిస్తామంటున్న కంపెనీ అందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ఇప్పటికే రెడీ చేసుకుంది. అయితే ప్రతి నెలా ఎలాంటి ఫీచర్స్ అప్డేట్ డెవలప్ చేయాలన్న విషయాన్ని మాత్రం యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిర్ణయించనుంది. CREOలో మేకర్స్, ఇంజినీర్స్, డెవలపర్స్, డిజైనర్లతో కలిసి మొత్తం 70 మంది పనిచేస్తున్నారు. స్టార్టప్ ఫౌండర్స్ అయిన సీఈఓ సాయి, సీటీఓ శుభం అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక కోర్ టీంలో సీపీఓగా రచిత్ రస్తోగి, వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్ట్స్ గుల్షర్ సింగ్ డిజైనింగ్, ప్రొడక్ట్ మేనేజింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. వార్తిక వర్మ సీఎంఓ, చీఫ్ సేల్స్ ఆఫీసర్‌గా లలిత్ మోహన్, నిషిత పంగ్లే బ్రాండింగ్ డిజైన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. కంపెనీ రూపొందించే సాఫ్ట్వేర్లను భవిష్యత్తులో ఇతర కంపెనీలకు విక్రయించాలని CREO భావిస్తోంది.
సెక్టార్ రివ్యూ
స్టేట్ ఆఫ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అడాప్షన్ ఇన్ ఇండియా అనే అంశంపై CMR తాజాగా జరిపిన సర్వేలో భవిష్యత్తులో హార్డ్‌వేర్ కన్నా సాఫ్ట్వేర్ కీలకంగా మారనుందని.. మిగతా వాటికన్నా ప్రత్యేకంగా నిలుపుతుందని తేలింది. స్పెసిఫికేషన్ వార్ పీక్ లెవల్ కు చేరడంతో OEMలు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అప్డేట్స్ అందించే విధానాన్ని అనుసరించాలని సర్వే స్పష్టం చేసింది. CMR అధ్యయనం ప్రకారం 95 శాతం బ్రాండ్లు ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజర్ ఇంటర్ఫేస్ లెవల్ లోనే మార్పులు చేస్తున్నాయి. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అప్పియరెన్స్ పై మాత్రమే ప్రభావం చూపుతుంది.
ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణ ప్రాంతంలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఏడాదిలోనే 65 శాతానికి పెరిగి 2015 అక్టోబర్ నాటికి 197 మిలియన్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2016 జూన్ నాటికి 109 మిలియన్లకు చేరవచ్చన్నది అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో CREO కంపెనీ రిలీజ్ చేయనున్న స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు చేరువవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.