మగవారు కొంచెం ఎక్కువ సమానం కాదు.. ఆడవారు కొంచెం తక్కువ సమానం కాదు..
లింగ వివక్ష పోవాలంటే ప్రయత్నాలు ఇంట్లోనే మొదలు కావాలి.. అమ్మ ఉద్యోగం చేసి, నాన్న పిల్లల్ని పెంచితే తప్పేం లేదు..
ఆడపిల్లవు కుదురుగా ఉండు..!!
ఆడదానిలా ఏంటా ఏడుపు..??
మగరాయుడిలా ఏంటా వేషం..!!
ఇలాంటి మాటలు కాస్త అటూ ఇటూగా వినని వాళ్లు మన సమాజంలో అరుదుగా ఉంటారు. ఆడపిల్లంటే ఇలాగే ఉండాలి. మగపిల్లాడంటే ఇంతే ప్రవర్తించాలి... అనే ఆలోచనలు చాలా బలంగా నాటుకుపోయి ఉన్నాయి. ఈ వివక్ష అనాది కాలం నుండి నేటివరకు అంతులేకుండా సాగుతూనే ఉంది. ఎంత 2016వరకు వచ్చినా, సమాజంలో కొద్దిమంది మహిళలు అనేక సమస్యలు దాటుకుని పురుషులకు అన్ని విధాలా సమానం అని రుజువు చేస్తున్నప్పటికీ... ఇంకా అనేక రూపాల్లో ఈ తేడా కనిపిస్తూనే ఉంది. ఆడమగా ఇద్దరూ సమానమే అని ఎవరైనా కష్టంగా ఒప్పుకున్నా... మగవాడు కాస్త ఎక్కువ సమానం తేల్చేస్తారు. ఇదీ మన సమాజ పరిస్థితి. నిత్యజీవితంలోని అనేక సందర్భాల్లో అంటే ఆఫీసుల్లో, వ్యక్తిగత జీవితాల్లో, ఇళ్లలో ప్రతి చోటా దీన్ని గమనిస్తూనే ఉంటాం.
మన ప్రవర్తనకు చిన్నతనం నుంచి బలంగా నాటుకుపోయిన అనేక భావాలు కారణమవుతాయి. మనలో జీర్ణించుకున్న ఈ అసమానత్వం అనేక రకాలుగా బయటపడుతూ ఉంటుంది. సమాజం, ఇంటి వాతావవరణం, కులం, మతం, ఇలాంటి ఎలిమెంట్స్ అనేకం కలిసి ఈ అంశాన్ని మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ వివక్ష మూలాలు ప్రతి ఇంట్లో.. ప్రతి బిడ్డా పురిటికందు గా ఉన్నప్పటి నుంచే మొదలవుతుంటాయి. ఇక మంచి చెడులను విడదీసి అర్ధం చేసుకునే అవకాశం ఎక్కడ? కానీ, ఈ నమ్మకాలు, విలువలను బద్ధలు కొట్టడానికి మనకు రోజువారీ జీవితంలో ఎన్నో సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే లైంగిక సమానత్వం అంటే అదేదో స్త్రీలకు మాత్రమే సంబంధించిందే కాదు. ఆడమగ ఇద్దరినీ సమానంగా పక్క పక్కన నిలబెట్టాలనే ఆలోచన అని గుర్తించాలి.
జో బి పావొలెట్టి అనే రచయిత అమెరికా సమాజంలో ఈ వివక్షను తవ్వుకుంటూ పింక్ అండ్ బ్లూ టెల్లింగ్ ద బాయ్స్ ఫ్రమ్ ద గాళ్స్ ఇన్ అమెరికా అనే సంచలనాత్మక పుస్తకం రాసింది. అమెరికా సమాజంలో చిన్ననాటి నుంచే అబ్బాయిలకు బ్లూ కలర్ డ్రస్, అమ్మాయిలకు పింక్ కలర్ ప్రత్యేకమనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. కానీ, అసలీ రంగులకు జెండర్ కు సంబంధం ఏమిటి? ఏ కలర్ అయినా, ముద్దులొలికే చిన్నారులకు నప్పుతుంది. కానీ, మనం ఇది ఆడ పిల్లలకు, ఇది మగ పిల్లలకు అని గీత గీసేస్తుంటాం. ఇలాంటి అపసవ్య నమ్మకాలను తీసిపారేయాల్సిన సమయం ఇంకా రాలేదంటారా..??
ఓ సారి టాయ్స్ షాప్ లోకి వెళ్లి చూడండి..
"పింక్ కలర్లో తీర్చిన బొమ్మల వరుస అమ్మాయిలకు, తుపాకులతో అమర్చిన వరుసలు అబ్బాయిలకోసం అన్నట్టుగా మార్కెట్ కల్చర్ చెప్తుంది. సున్నితమైన, పింక్ కలర్ బొమ్మలు ఏ బలహీన మనస్తత్వాన్ని, తుపాకులు, పెద్దపెద్ద గన్నులు ఏ గంభీరత్వాన్ని పిల్లలకు సంకేతప్రాయంగా చెప్తాయో ఊహించలేనిది కాదు. మరి పిల్లలు ఎలాంటి స్వభావాన్ని అలవరచుకోవాలో, ఏ బొమ్మల ద్వారా ఏం నేర్చుకోవాలో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి కదా. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ జెండర్ రోల్స్ ని స్పష్టంగా చెప్తాయంటారు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సోషియాలజిస్టు లెక్చరర్ డా. ఎలిజబెత్ స్వీట్.
చిన్నారులు అలవోకగా అనుకరిస్తారు..
"అనుకరణ ద్వారా చిన్నారులు చాలా నేర్చుకుంటారు. పసివారు ముఖ్యంగా తల్లిదండ్రులనుండి ఎక్కువగా నేర్చుకుంటారు. ఇదే అంతిమంగా పెద్దవాళ్లయిన తర్వాత సమాజంలో వారి ప్రవర్తనకు మూలమవుతుంది. పుట్టిన వెంటనే ఈ పరిశీలన మొదలవుతుంది.
వారిలో బలంగా నాటుకునే అంశాలే వారి ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి- అండ్రూ ఎన్ మెల్ట్జాఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్,
అందువల్ల చిన్నారుల్లో ఈ లింగవివక్ష మూలాలు లేకుండా ఉండాలంటే దానికి తగ్గ వాతావరణం ఇంట్లో ఉండాలి. ఇంట్లోని పిల్లలందరినీ సమానంగా చూడాలి. ఇంటి పనుల్లో ఆడ, మగ భేదం చూపించకూడదు. ముఖ్యంగా మగవాళ్లు పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపాలి. అదే సమయంలో ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితం కాకుండా, పురుషులతో సమానంగా బయటి పనులు కూడా చేయాలి. అప్పుడే మహిళలు సమస్యలు భరించలేరని, పిల్లల పెంపకానికి, ఇంటి పనులకు మాత్రమే పరిమితమని, పురుషులు పోషించే శక్తి ఉన్నవారని, రిస్క్ తీసుకోగల ధైర్యం ఉన్నవాళ్లనే అర్ధం లేని నమ్మకాలను పోగొడతాయి. అందుకే, ఇంటి పట్టున ఉండి పిల్లలను పెంచే తండ్రులు, ఉద్యోగాలు చేసే తల్లులు ఉన్న కుటుంబాల్లో లింగ వివక్ష సంబంధిత నమ్మకాలు పెరిగే అవకాశాలు తక్కువ.
ఈక్యూ, ఐక్యూ నమ్మకాలు...
ఐక్యూ ఈక్యూ లెక్కల్లో కూడా మహిళలకు, పురుషులకు మధ్య అనేక అపసవ్య నమ్మకాలు చలామణీలో ఉన్నాయి. స్త్రీలు సున్నిత స్వభావులని, వారికి ఈక్యూ ఎక్కువనీ, పురుషులకు ఐక్యూ ఎక్కువ అని అంటూ ఉంటారు. ఇవన్నీ బేస్ లెస్ వాదనలు. బయోలాజికల్ గా స్త్రీ పురుషులకున్న భేదంలాంటి అతి కొద్ది అంశాల్లో తప్ప, దాదాపు అన్ని అంశాల్లో ఇరువురూ సమానమే అనే నమ్మకాలు పెంపొందాలి. దానికోసం ఆల్రెడీ ఉన్న అనేక అపభ్రంశపు విలువల్నీ, అనాలోచిత నమ్మకాల్నీ బ్రేక్ చేయాలి. దేన్నీ ధ్వంసం చేయకుండా దేన్నీ నిర్మించలేము. స్త్రీ నిండుగా నవ్వగలదు. ఇంటినే కాదు.. ఆఫీసుల్నీ ఏలగలదు. పురుషుడు గుండెబరువు దించుకునేలా నాలుగు కన్నీటిబొట్లు రాల్చనూగలడు. అప్పుడు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అంతిమంగా ఇద్దరూ మనుషులు మాత్రమే కదా. అప్పుడే ఈ ప్రపంచంలో సమానత్వం సిద్ధిస్తుంది. మీరేమంటారు..??