కొందరుంటారు. చిన్న సమస్య కూడా తట్టుకోలేరు. లేనిపోని టెన్షన్. ఒక్కోసారి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరు. అలాంటి సంగతులు విన్న ప్రతిసారీ.. ఏమో ఏం కష్టమొచ్చిందో అని మనం గాఢంగా నిట్టూరుస్తాం. నిజమే. కష్టాలూ కన్నీళ్లూ ఒక్కసారిగా ముసిరినప్పుడు, భద్రగుండె బరువెక్కినప్పుడు, మదిలో ఎవరూ స్ఫురించరు. ఎవరి ఆత్మకథా స్ఫూర్తి రగలించదు. ఎవరి విజయగాథా మేల్కొలపదు. అదొక వీక్ మూమెంట్. అయినా సరే ఆ బరువైన క్షణాలను, ఆపలేని కన్నీళ్లను, మోయలేని కష్టాల మీద యుద్ధం ప్రకటిస్తే.. అట్టడుగుకు జారిపోయిన గుండెలోకి ధైర్యం ఎగజిమ్మదా? నవనాడుల్లో చైతన్యం ఉరకలెత్తదా? చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలుండవా? గౌరీ రమేశ్ గాథ కూడా అలాంటిదే!
గౌరీ రమేశ్. ముంబైలో ఓ సంప్రదాయ కుటుంబం. ఫ్యామిలీలో అంతా బ్యాంకర్లు, టీచర్లు. గౌరి అందరికంటే చిన్నామె. తండ్రిలాగే పక్కవారికి ఎంతోకొంత సాయం చేద్దామనే మనస్తత్వం. వ్యాపారంలో లాభాపేక్ష ఉండొచ్చుగానీ, ఉపకారం చేసే విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోవద్దని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. పాకెట్ మనీ కోసం తండ్రి ఆధారపడటం ఎందుకని ముంబైలోని ఓ చిల్డ్రన్ స్కూల్‌లో వాలంటరీ టీచర్‌గా పనిచేశారు. మహిళలు ఆత్మగౌరవంతో, తమదైన అస్తిత్వంతో బతకాలనేది ఆమె నమ్మిన సిద్ధాంతం. ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత ఓ ఎమ్మెన్సీ కంపెనీలో జర్మన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. కాలేజీ ఫెస్టివల్స్, కొన్ని ఈవెంట్లలో కర్నాటిక్ సింగర్‌గా కూడా వ్యవహరించారు.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది? ఎదురు దెబ్బలు తాకితేనే కదా నిజమైన పోరాటం మొదలయ్యేది. అలా గౌరీ జీవితం అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి తర్వాత గౌరీ మిడిల్ ఈస్ట్ కు షిఫ్టయ్యారు. తొలి కాన్పు పాప. రెండోసారి బాబు పుట్టాడు. ఆ పిల్లాడు పెరుగుతున్నా కొద్దీ ఆటిజం లక్షణాలు బయటపడ్డాయి. నలుగురిలో కలవలేకపోయాడు. ముబావవంగా ఉండేవాడు. అనాన్ సెఫాలిక్ అని డాక్టర్లన్నారు. దాని అర్ధమేంటో కూడా తెలియదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరో సలహా ఇచ్చారు.. సైక్రయాటిస్టుని కలవమని. కానీ లాభం లేదు. గుండె నిబ్బరం కోల్పోయింది. ఓదార్చేవారు లేరు. కన్నీళ్లు ఆగడానికి చాలాకాలమే పట్టింది. ఎందుకంటే పుట్టిన బిడ్డను పారేసుకోలేం. వాడిని అందరిలాగే పెంచాలి. మనం కూడా కాలంతోపాటే నడవాలి. గౌరి ఫైనల్ తీర్మానం ఇదే.
పిల్లాడి కష్టాలను తన భుజంపై వేసుకుంది. మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని కసురుకోలేదు. స్కూల్లో పిల్లాడి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వెంటనే వాడి తరపున ఆమె క్షమాపణ చెప్పేది. అబ్బాయి ప్రాబ్లం ఏంటో అందరికీ విడమరిచి చెప్పేది. అలా కొడుకు కష్టాలను సంతోషంగా మోసుకుంటూ తిరిగింది. అలా కుమారుడి ఆలనా పాలనా చూస్తూనే ఆటిజంపై పరిశోధన చేసింది. అలాంటి పిల్లలను ఎలా పెంచాలి? వారికి ఎలాంటి వాతావరణాన్ని కల్పించాలి అనే అంశాలపై దృష్టి సారించింది. ఈ లోగా విదేశాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
గౌరి గురించి ఆ నోటా ఈ నోటా నలుగురికి తెలిసింది. ఆటిజంతో బాధపడే పిల్లల తల్లిదండ్రులంతా ఆమె గురించి వాకబు చేశారు. ఎలా పెంచాలో ఆమె దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నారు. అప్పుడే గౌరి మదిలో ఒక ఆలోచన మెరిసింది. సలహాలు మాత్రమే ఇస్తే లాభం లేదు.. సాయం కూడా చేయలనుకున్నారు. అలా ముంబై టు దుబాయ్- దుబాయ్ టు ముంబై. రెక్కలు కట్టుకుని తిరిగింది. దుబాయ్‌లో భర్త, పాప. ముంబైలో కొడుకు. అలుపెరుగని ప్రయాణం. చివరికి కొడుకుని ముంబైలోని ప్రఖ్యాత సెయింట్ జేవియర్ పాఠశాలలో చేర్పించింది. అంతేకాదు తల్లిలాగే అతడు కూడా కర్నాటక సంగీతంలో మ్యాస్ట్రో అయ్యాడు.
ఆటిజం పిల్లలకు సాయం చేస్తున్నప్పటికీ ఎందుకో అసంతృప్తి వెంటాడింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనిపించింది. తనలాంటి పిల్లాడే ఉన్న రేష్మి నికిత్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మనోభావాలు కలిశాయి. అలా లిటిల్ హర్ట్స్ ఫౌండేషన్’ పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. సింపుల్ గా చెప్పాలంటే అదొక స్కూల్ లాంటిది. అందులో
స్పోర్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ ఇలా చిన్నారులు దేన్ని ఇష్టపడుతున్నారో ముందుగానే గుర్తించేవారు. అకాడమిక్‌లో అంతగా రాణించకపోతే, ఇతర అంశాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించేవారు. ‘‘తారే జమీన్ పర్ సినిమాకు ముందు తల్లిదండ్రులు ఆటిజం వున్న పిల్లలపై అంతగా దృష్టిసారించేవారు కాదు. అయితే ప్రతి పిల్లాడిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందని తల్లిదండ్రులకు వివరించే ప్రయత్నం చేశాం. అలాంటి టాలెంట్‌ను గుర్తిస్తేనే, ఆ పిల్లాడు కూడా సమాజంలో ఓ భాగమవుతాడని చెప్పాం’’ అని గౌరీ వివరించారు.
ప్రతి ఐదుగురు చిన్నారులకు ఇద్దరు టీచర్ల చొప్పున కేటాయించారు. 25 మంది పిల్లలు చేరారు. ఏడాది తిరిగేలోపు వందశాతం ఫలితాలు సాధించారు. అదే ఊపుతో రెండో సెంటర్‌ను కూడా ప్రారంభించారు. దాంట్లో చిన్నపాటి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఈ ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అలా రెండూ సక్సెస్ అయ్యాయి. ఒక మంచిపని కోసం తలపెట్టిన లక్ష్యం నెరవేరింది.
జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలి. గౌరి విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. భర్త, పాప దుబాయ్ లో. తను, బాబు మాత్రం ముంబైలో. ఇద్దరినీ మిస్సవుతున్నాన్న ఫీలింగ్. కొద్దిరోజులు అక్కడ ఉండి వద్దామని నిర్ణయించుకుంది. ఆ రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో దుబాయ్ ఫ్లయిట్. ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఏమయిందో ఏమో గానీ ఒక్కసారిగా గౌరి కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టెస్టులు చేసిన డాక్టర్లు గౌరి పెద్ద పేగుకు కేన్సర్ సోకిందని రిపోర్టిచ్చారు. కాళ్లకింద భూమి కంపించిపోయింది. ఒక్కసారిగా శూన్యం ఆవహించింది.
కష్టాలు కొత్తవి కాదు. అయితే ఈసారి కేన్సర్ రూపంలో. ఇన్నాళ్లూ ఒక సవాల్. ఇప్పుడొక సవాల్. గుండెలో ధైర్యం ఒలికిపోలేదు. మళ్లీ కూడదీసుకుని లేచి నిలబడింది. ఎస్.. నేనే ట్రీట్మెంట్ కు రెడీ అనుకుంది. ఇంటినుంచి సపోర్టు దొరికింది. ఆరు నెలలపాటు మంచానికే పరిమితమైంది. రెండేళ్ల తర్వాత యధావిధిగా లైఫ్ కంటిన్యూ అయింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలోనూ నా బాధ్యతలను మర్చిపోలేదంటారామె. సెంటర్ ఉద్యోగులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయడం.. అవసరమైన సలహాలు ఇవ్వడం .. మనసు తేలిక పడటానికి ఫ్యాషన్ మేగజైన్లు చదివడం.. ఇలా గౌరీ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
అవార్డులు.. రివార్డులు
రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు గౌరీకి పూర్తిగా నయమైంది. భయంకరమైన కేన్సర్ నుంచి బయటపడటానికి మందులొక్కటే కారణం కాదు. ఆమె మనోనిబ్బరం కూడా. హిరనందాని గ్రూప్ ఆఫ్ కంపెనీ గౌరీ గుండెధైర్యాన్ని కీర్తించింది. మహిళా దినోత్సవం రోజు ఆవిడను సన్మానించింది. రోటరీ ఇన్నర్‌వీల్ క్లబ్ వారు కూడా ది బెస్ట్ టీచర్’ అవార్డుతో గౌరీని సత్కరించారు.
ఫ్యాషన్ ఆంట్రప్రెన్యూర్..
గౌరి ఇప్పుడొక మామూలు మనిషి. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాషన్ రంగంలో సత్తా చాటేందుకు పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నారామె. ఇందుకోసం వెల్లింగ్‌కర్ కాలేజీలో జాయిన్ అయ్యారు . ఆంట్రప్రెన్యూర్షిప్ మేనేజ్‌మెంట్ కాన్వకేషన్ పూర్తయిన సమయంలోనే ఆమె యువర్‌స్టోరీతో మాట్లాడారు . తాను పడ్డ కష్టాలకు జీవితంలో ఇప్పుడు చోటు లేదని చెప్పుకొచ్చారు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, విధిని ధిక్కరించి పోరాడటంలో గౌరికి గౌరే సాటి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. అవన్నీ అనుకూలంగా మలుచుకుని, జీవితాన్ని విజయ పథాన నడిపించిన గౌరీ రమేశ్ ఎందరికో స్ఫూర్తి. ఆమెను ఆదర్శంగా తీసుకుంటారని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.