ఫ్లిప్ కార్ట్ ఫ్యూచర్‌ లో ఏం చేయబోతుందో తెలుసా?!

ఫ్లిప్ కార్ట్ ఫ్యూచర్‌ లో ఏం చేయబోతుందో తెలుసా?!

Tuesday December 29, 2015,

6 min Read

కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు! దమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు! ఓ సినిమాలో డైలాగ్- అచ్చుగుద్దినట్టు ఫ్లిప్ కార్ట్‌ కి సరిపోతుంది. ఇండియన్ అమెజాన్‌ గా దూసుకుపోతున్న ఫ్లిప్ కార్ట్- ఆ పేరును ఏ మాత్రం స్లిప్ కాకుండా చూసుకుంటోంది. ఇవాళ 5 కోట్ల మంది వినియోగదారులున్నారంటే- ఎప్పటికప్పుడు ఆ సంస్థ తీసుకున్న తెలివైన నిర్ణయాలే అని చెప్పొచ్చు. కస్టమర్ల నాడీ ఏంటో, వాళ్ల టేస్ట్ ఏంటో ఫ్లిప్ కార్ట్ తెలుసుకోగలిగిది. జనాల ప్రాధాన్యత ఏంటో అర్ధం చేసుకుంది. అందుకే సక్సెస్ ఫుల్‌ గా మార్కెట్ ని డామినేట్ చేయగలుగుతోంది. ఇంకా ఆ సంస్థ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏ మేరకు మార్కెట్‌ ని దున్నేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇలాంటి వివరాలతో ఒక రిపోర్టు విడుదల చేసింది ఫ్లిప్ కార్ట్. ఆలస్యమెందుకు.. అవేంటో చదివేయండి!

image


ఇది చాలా స్మార్ట్ గురూ!

ఫ్లిప్ కార్ట్ ను ఈరోజు ఈ స్థాయిలో నిలిపింది నిస్సందేహంగా స్మార్ట్ ఫోన్సే. గత 12 నుంచి 24 నెలల కాలంలో ఆ సంస్థ విక్రయించినన్ని మొబైల్ ఫోన్లు మరెవరూ అమ్మలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి ఐదు మొబైల్ ఫోన్లలో ఒకటి ఫ్లిప్ కార్ట్ ద్వారానే అని చెప్పడానికి ఆ సంస్థ గర్వంగా ఫీలవుతోంది. రోజుకో కొత్త ప్రోడక్ట్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం 70 కేటగిరీల్లో వస్తువులను విక్రయిస్తోంది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్.. అందులోనూ మొబైల్ ఫోన్సే సింహభాగం. లెనోవో, మోటొరోలా, సామ్ సంగ్, జియోమీలాంటి టాప్ బ్రాండ్స్ ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ బ్రాండ్స్ సగటు ధర రూ.7000 నుంచి రూ.12000 వరకు ఉంటున్నాయి. లో మార్జిన్ ప్రోడక్ట్స్ లో మొబైల్ ఫోన్ కూడా ఒకటి. దీంతో మోటొరోలా, జియోమీలాంటి వాటితో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఫ్లిప్ కార్ట్ వ్యూహం వంద శాతం ఫలితాన్నిచ్చింది. దీనివల్ల కంపెనీ లాభాలు భారీగా పెరిగాయి. వచ్చే ఏడాది దీన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఈ-కామర్స్ సంస్థ. వంద డాలర్లలోపు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. 2016లో చాలా మంది వినియోగదారులు వంద డాలర్లలోపు స్మార్ట్ ఫోన్లకు మారనున్నారని, ఇదో గొప్ప రెవెల్యూషన్ కాబోతోందని ఫ్లిప్ కార్ట్ ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరీ అంటున్నారు. వంద డాలర్లలోపు స్మార్ట్ ఫోన్ల అమ్మకాల కోసం ఏవైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారా అని యువర్ స్టోరీ ప్రశ్నించగా.. ఇప్పుడే ఆ వివరాలన్నీ వెల్లడించలేమని అన్నారు. కానీ ఈ కేటగిరీలో మాత్రం తాము ప్రముఖ పాత్ర పోషించబోతున్నామని మాత్రం చెప్పారు.

image


ఇతర ఉత్పత్తులపైనా దృష్టి

మొబైల్ ఫోన్స్ అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ కు తిరుగులేదు. అలాగని దానిపైనే ఎక్కువగా ఆధారపడాలని కూడా ఆ సంస్థ భావించడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. కార్ యాక్సెసరీస్, ఫర్నిచర్ కేటగిరీలు కొత్తగా లాంచ్ చేసింది. 2014లో మింత్రాను సొంతం చేసుకున్న తర్వాత ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్లాన్ బాగానే వర్కవుటైంది. ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, మొబైల్ ఫోన్ల తర్వాత లైఫ్ స్టయిల్ యాక్సెసరీస్, మెన్స్ క్లోథింగ్, విమెన్‌ క్లోథింగ్ లోనే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. గతేడాది విమెన్స్ క్లోథింగ్ కన్నా ఎక్కువగా మగవారి బట్టల కేటగిరీలోనే ఎక్కువ సేల్ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ యూజర్లలో 70 శాతం మంది పురుషులే కావడం విశేషం. నెమ్మదిగా లేడీస్ గార్మెంట్స్ విక్రయాలు కూడా పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది 40 శాతం అమ్మకాలు మహిళలకు సంబంధించనవే. ప్రతి నెలా 20 శాతం గ్రోథ్ తో చీరల అమ్మకాలు ముందు వరుసలో ఉన్నాయి. సూరత్ లో ఉన్న విక్రేతలు రోజుకు 20 వేల ఆర్డర్లు అందుకుంటున్నారని అంకిత్ తెలిపారు. వచ్చే ఏడాది విమెన్స్ క్లోథింగ్, ఫర్నిచర్, లార్జ్ అప్లియెన్సెస్ తమ అమ్మకాల్లో ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫర్నిచర్ కేటగిరీపై ఎక్కువ దృష్టి సారించినట్లు చెప్పారు. రిపేర్లు, మెయింటెనెన్స్ కంపెనీ అయిన జీవ్స్ ను గత అక్టోబర్లో కొనుగోలు చేయడం కూడా తమకు కలిసి వస్తుందని ఫ్లిప్ కార్ట్ బలంగా నమ్ముతోంది.

image


వెబ్ కంటిన్యూ అవుతుంది

అనుబంధ సంస్థ మింత్రాలాగే ఫ్లిప్ కార్ట్ కూడా యాప్ కే పరిమితమవుతుందా అన్న చర్చ ఈ-కామర్స్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. కానీ ఆ ఊహాగానాలకు ఫ్లిప్ కార్ట్ చెక్ పెట్టేసింది. గత నవంబర్లో ఫ్లిప్ కార్ట్ లైట్ పేరుతో ఓ మొబైల్ వెబ్ బ్రౌజర్ ను లాంచ్ చేసి వినియోగదారులకు యాప్ లాంటి అనుభూతినే కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ అమ్మకాల్లో 75 శాతం మొబైల్స్ ద్వారానే జరుగుతుండగా, కొత్త కస్టమర్లు కూడా భారీగా వస్తున్నారు. అంతమాత్రాన వెబ్ కు గుడ్ బై చెప్పబోమని సంస్థ స్మార్ట్ ఫోన్స్ బిజినెస్ హెడ్ విఘ్నేష్ రామకృష్ణన్ స్పష్టం చేశారు. దాన్ని సమర్థిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా అమ్మకాలు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటున్నాయని, పగటి సమయాల్లో వెబ్ కే ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ లో ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ ను విజిట్ చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వెబ్ సైట్ ను పూర్తిగా మూసేయడం తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు విఘ్నేష్. అయితే యాప్ మీదే ఎక్కువగా దృష్టిసారిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం డెస్క్ టాప్ కంటే యాప్స్ వాడుతున్నవారు మూడు రెట్లు ఎక్కువ ఉన్నారని, తమ లాభాల్లో సింహభాగం అక్కడి నుంచే వస్తోందని అంకిత్ తెలిపారు. యూనిక్ యూజర్ల విషయంలో ఫ్లిప్ కార్ట్ కంటే తామే ముందున్నట్లు కామ్ స్కోర్ విడుదల చేసిన డాటా చెబుతోందని ఈమధ్యే అమెజాన్ ప్రకటించింది. ఇదే విషయమై అంకిత్ ను ప్రశ్నించగా - ‘ప్రస్తుతం దేశంలో డెస్క్ టాప్, యాప్ రేషియో 20:80 ఉంది. అసలు బిజినెస్ అంతా అక్కడే ఉంది. అందులో మేమే లీడర్స్. కొత్త యూజర్లు చాలామంది యాప్ ద్వారానే వస్తున్నారు. చాలా మంది డెస్క్ టాప్ నుంచి యాప్ కి షిప్ట్ అవుతున్నారు’ అని అంకిత్ చెప్పారు. ఇమేజ్ సెర్చ్, జీపీఎస్ లాంటి ఫీచర్లు మొబైల్ లోనే సాధ్యమవుతాయని ఆయన గుర్తుచేశారు.

image


మెట్రో నగరాలే టార్గెట్

ప్లిప్ కార్ట్ కు సౌత్ ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక చిన్నచిన్న నగరాల నుంచి క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి వెస్ట్ బెంగాల్ లోని మేదినిపూర్ వరకు చిన్న నగరాల్లో ఫ్లిప్ కార్ట్ కు ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ సంస్థ లక్ష్యం మాత్రం ఇప్పటికీ మెట్రో నగరాలే. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, గాడ్జెట్స్, కారు యాక్సెసరీస్ అమ్మకాల్లో సింహభాగం మెట్రో నగరాల నుంచే కావడం అందుకు ఓ కారణం కావచ్చు. మెట్రోల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ మొదటి స్థానం ఆక్రమించింది.

image


స్థానిక భాషలకు ఇంకా టైముంది

స్నాప్ డీల్ లాగా స్థానిక భాషల్లోనూ ఫ్లిప్ కార్ట్ యాప్స్ ను లాంచ్ చేస్తుందా అని యువర్ స్టోరీ ప్రశ్నించగా.. దానికి ఇంకా సమయం ఉందని అంకిత్ చెప్పారు. ‘ఇంటర్నెట్ భాష ఇంగ్లీష్. అయినా, భవిష్యత్ లో స్థానిక భాషల అవసరం రావచ్చు. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. ప్రధాన నగరాల్లో ఇంగ్లీషే ప్రధాన ఇంటర్నెట్ భాషగా ఉంది’ అని అంకిత్ అన్నారు. అర్బన్ ఏరియాలపైనే ఫ్లిప్ కార్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని చెప్పడానికి ఇది కూడా ఓ నిదర్శనంగా చెప్పవచ్చు.

image


లోకల్ బ్రాండ్స్ కు ప్రాధాన్యం

లోకల్ బ్రాండ్స్ కు ప్రాధాన్యమివ్వడం ఫ్లిప్ కార్ట్ అనుసరిస్తున్న మరో ముఖ్యమైన వ్యూహం. మొబైల్ ఫోన్స్ కాకుండా ఎక్కువ అమ్ముడవుతున్న మిగిలిన ఐదు నుంచి ఏడు కేటగిరీలు ఇండియన్ బ్రాండ్సే కావడం విశేషం. అంతేకాదు ఇంతవరకూ మార్కెట్ లో పెద్దగా పేరు లేని బ్రాండ్స్ కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ‘క్లోథింగ్ కేటగిరీలో టాప్ ఇండియన్ బ్రాండ్సే కాదు చిన్నచిన్న బ్రాండ్లు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అందులో చాలామంది గతంలో ఉత్పత్తులను ఎగుమతి చేసేవారే. ప్రస్తుతం ఇక్కడివారికి అనుగుణంగా బ్రాండ్స్ ను తయారుచేసి లాభాలు ఆర్జిస్తున్నారు’ అని అంకిత్ చెప్పారు. మొబైల్ యాక్సెసరీస్, కార్ యాక్సెసరీస్, పర్సనల్ కేర్ లలోనూ ఇండియన్ బ్రాండ్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కార్ యాక్సెసరీస్ లో హిసార్ కు చెందిన రెటినా అగ్రస్థానంలో ఉండగా.. టీవీల్లో ముంబైకి చెందిన Vu Technologies, Micromax ముందువరుసలో ఉన్నట్లు అంకిత్ తెలిపారు. పెద్దగా పేరు తెలియని భారత బ్రాండ్స్ అందుబాటులో లేని సెగ్మెంట్లలో అంతర్జాతీయ బ్రాండ్స్ ప్రవేశ పెడతారా అన్న ప్రశ్నకు అలాంటి అవకాశమే లేదని చెప్పారు అంకిత్. ‘దానికన్నా మంచి క్వాలిటీ ఉన్న అంతగా పేరు లేని భారత బ్రాండ్స్ ను మేము ప్రోత్సహిస్తాం. భారత బ్రాండ్స్ కు సరైన మార్కెట్ కల్పిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది’ అంటారు అంకిత్

image


కస్టమర్లే దేవుళ్లు

ఫ్లిప్ కార్ట్ యూజర్లలో 70 శాతం మంది -15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. అందులో 50 శాతం బ్యాచిలర్లు కాగా, మరో 50 శాతం మంది ఉద్యోగాలు చేసేవాళ్లు. ఇక ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేసేవాళ్లలో 70 శాతం మంది పురుషులే కావడం మరో విశేషం. అందుకే గాడ్జెట్స్, యాక్సెసరీస్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మహిళా కస్టమర్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఫ్యాషన్ జువెలరీ లాంటి కేటగిరీలు దూసుకెళ్తున్నాయి. భవిష్యత్తులోనూ కస్టమర్లను నిలుపుకోవడానికి ఫ్లిప్ కార్ట్ పెద్ద ప్రణాళికలే రచిస్తోంది. ప్రస్తుతం బ్యాచిలర్లుగా ఉన్న వారు రేపు ఓ ఇంటివారై, వారికి పాపో బాబో పుడితే -అప్పుడు వారి అవసరాలు వేరేలా ఉంటాయి. ఇప్పటికే అలాంటి కస్టమర్లు 37 శాతం మంది ఫ్లిప్ కార్ట్ కు ఉన్నారు. వారి కోసమే ఈ మధ్యే చిల్డ్రన్ సెగ్మెంట్ ను లాంచ్ చేసింది. ఫర్నిచర్, లార్జ్ అప్లయెన్సెస్ పైనా దృష్టి సారిస్తోంది. ఎంతో నమ్మకమైన కస్టమర్లను చేజారిపోకుండా చూసుకోవాలన్నదే ఫ్లిప్ కార్ట్ ఉద్దేశం. బీభత్సమైన పోటీ ఉన్న ఈ-కామర్స్ రంగంలో సుదీర్ఘకాలం ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ఆమాత్రం ముందుచూపు, కమిట్ మెంట్ ఉండాల్సిందే. అలాంటి క్వాలిటీస్ ఫ్లిప్ కార్ట్ కి పుష్కలంగా ఉన్నాయి.