పాతపుస్తకాల ఏకైక అడ్డా- అబిడ్స్

పాతపుస్తకాల ఏకైక అడ్డా- అబిడ్స్

Saturday March 12, 2016,

3 min Read


ఆదివారం మధ్యాహ్నం పన్నెండుకల్లా నాలుగు ముద్దలు తిని, బస్సో బైకో ఆటోనో పట్టుకుని, అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ సిగ్నల్ ముందు దిగితే చాలు- అక్కడి నుంచి బ్యాంక్ స్ట్రీట్ వరకు- గల్లీగల్లీకో పరిమళం! పాత పుస్తకాల సరికొత్త వాసన! దిగీదిగగానే మనసు తుమ్మెదలా మారుతుంది. రివ్వున పుస్తకాల మీద వాలుతుంది. ఆ పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఆఘ్రానిస్తూ పోతుంటే అస్సలు టైమే తెలిదు!

పాత పుస్తకాలా? అని పెదవి విరిచేయకండి! పేరుకే పాత.. కానీ లోపలంతా కొత్త! ఎన్నడూ చూడని కావ్యాలూ, ఎన్నడూ చదవని కథలూ, సాహిత్యం ఇంకా ఎన్నెన్నో! ఇన్నాళ్లూ కనిపించనవి ఒక్కసారిగా కనిపిస్తే కొత్తవి కాక పాతవెలా అవుతాయి! గరకు రాతి ఫుట్ పాత్ పై మెత్తని పాత పుస్తకాల అలంకరణ! ఆ పాత సుమధురమేదో రారమ్మని ఆహ్వానిస్తుంది! బండలమీద పుస్తకాల అమరిక! కంటిచూపు అలా జాలువారుతునే ఉంటుంది! ఎన్నెన్ని ఇళ్ల నుంచి తరలి వచ్చాయో! ఎవరెవరి చేతులు మారి వచ్చాయో! ఇల్లు పక్కన ఇల్లు వున్నట్లు! పుస్తకం పక్కన పుస్తకం! సిల్ సిలా జారీ రహేగా! పాతవే! కానీ అన్నీ పాతబడలేదు! కొన్ని పురానా! ఇంకొన్ని నయా పురానా! మరికొన్ని ఇటీవల పాతవి! అట్టలు మాసిన ఆ పుస్తకాన్ని చూస్తుంటే - బట్టలు చిరిగిన సోక్రటీస్ లా అనిపిస్తుంది!

image


అయినా పాతది పాతది అంటాం కానీ- పాతలోనే ఉంది అసలైన ప్యార్ అంటాడో కవి! అట్ట..హాసం చూసి, బాహ్య స్వరూపాన్ని అంచనా వేసి, పుస్తకాలు కొనే సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇందుమూలంగా ఒక విన్నపం! పాత పుస్తకం అని మొహం చిట్లించకండి! ఒక్కసారి పేజీలు తిప్పేస్తే రుచి చూడండి! మురికి కమ్మల మధ్య నిక్షిప్తమైన నిగూఢ శాస్త్రాలు- భాష్యాలూ, కల్పనలూ, కావ్యాలూ, అంతరంగాలూ అన్నీ మస్తిష్కం చుట్టూ ముప్పిరిగొంటాయి! ఆ పుస్తకంలోంచి ఈ పుస్తంలోకీ- ఈ పుస్తకంలోంచి ఆ పుస్తకంలోకి తొంగితొంగి- మరలి మరలి- చూస్తుంటే.. చూస్తుంటే- ఠక్కున కనిపిస్తుందో పుస్తకం! ఎన్నాళ్లనుంచో దేవులాడేది! ఎక్కడా దొరకనిది! అప్పుడొక అలౌకికానందం! ఒక చిరునవ్వు పెదాలపై మెరిసి మాయమవుతుంది. ఇంకో పుస్తకం- మొదటి పేజీలో ఆప్యాయతతో అంటూ ఓ సంతకం కనిపిస్తుంది! కళ్లు భలేగా నవ్వుకుంటాయి. ఎవరిదో బహుమానం ఇలా బజారున పడినందుకు అంతలోనే మనసు చివుక్కుంటుంది. అలాంటివి కొన్నప్పుడల్లా అజ్ఞాత స్నేహితుడెవరో అభిమానంతో కరచాలనం చేసినట్టు పుస్తకం మార్దవంగా తడుముతుంది!

ఎవరెవరివో, ఎక్కడెక్కడినుంచో- వచ్చి ఇలా ఒకచోట చేరి పరిచయాలు చేసుకుంటుంటాయి. ఎవరి చేతికో ఒకరి చేతికి చేరాక భారంగా వీడ్కోలు చెప్పుకుంటాయి.

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పుస్తకం- ఇక దొరకదని డిసైడ్ అయిన పుస్తకం అనుకున్న పుస్తకం కనిపించినప్పుడు చిన్నపాటి ఉద్వేగం! దొరికిన పుస్తకానికి చివరి పేజీలు లేవని కొద్దిపాటి నైరాశ్యం. కొత్తగా, పాతగా, వింతగా- చూస్తూ తిరుగుతూ- తిరుగుతూ చూస్తూ- అదోరకం అనుభూతి! రణగొణ ధ్వనుల మధ్య, కొద్దిపాటి తోపులాట నడుమ, ఫుట్ పాత్ మీద పేర్చిన పుస్తకాలను ఎంచుకోడం- దేనికదే వైవిధ్యం. గాజుల సత్యనారాయణ పెద్దబాలశిక్షో, భారవి రాసిన కిరాతార్జునీయమో- షేక్ స్పియర్ జూలియస్ సీజరో – విలియం బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్నో- రిచ్ డాడ్ పూర్ డాడో- ఏదో ఒకటి. కొన్నా, కొనకపోయినా- పుస్తకాలను చూడడం డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్!

image


అప్పట్లో అబిడ్స్ దారిపొడవునా బుక్ స్టాల్స్ ఉండేవి! మడిగెల్లో పుస్తకాలు పెట్టి అమ్మేవారు. రోడ్ వైడెనింగ్ పుణ్యమాని షాపులు మాయమయ్యాయి. పుస్తకాలు ఫుట్ పాతులమీద పడ్డాయి. 30-35 ఏళ్ల నుంచి ఇదే బిజినస్ చేస్తున్న స్వామిని పలకరిస్తే ఆయన సమాధానంలో బాధ కనిపించినా, ఎంతోకొంత సంతృప్తి మాత్రం వినిపించింది. అకాడమిక్ దగ్గర్నుంచి ఆధ్యాత్మికం వరకు, అట్లాస్ నుంచి ఆంగ్ల సాహిత్యం వరకు అన్నీ దొరికే ఏకైక ప్లేస్ అంటున్నారాయన. రేటుమీద ఫార్టీ పర్సెంట్ కొంటారు. టెన్ పర్సెంట్ మార్జిన్ తో ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముతారు! కస్టమర్లను అస్సలు విసుక్కోరు. కొనేవాళ్లు కచ్చితంగా కొంటారు. కొనే ఉద్దేశం లేకుంటే కొనరు. అందుకే ఎవరు ఎంతసేపు చూసినా ఏమీ అనం అంటాడు స్వామి!

కేజీ టు పీజీ పుస్తకాలు. రీజనబుల్ రేట్స్. బార్గెయినింగ్ కెపాసిటీ ఉంటుంది. అడిగిన పుస్తకం లేకుంటే- వేరే షాప్ నుంచి తీసుకొచ్చయినా ఇస్తారు. మంచి సర్వీస్ ఉంటుంది. అందుకే ఎలాంటి పుస్తకమయినా ఆదివారం అబిడ్స్ అంగట్లోనే కొంటాం అంటాడు కూకట్ పల్లి నుంచి వచ్చిన ఓ వ్యక్తి.

image


అంతేకదా మరి! వ్యాపారులు విసుక్కోనప్పుడు, సర్వీస్ బెటర్ గా ఉన్నప్పుడు ఏ కస్టమరైనా వేరేచోటికి ఎందుకు వెళ్తాడు! అనుకున్న పుస్తకం దొరికినా, దొరక్కపోయినా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా- మధ్యమధ్యలో టీలు తాగుతూ-కచోరీలు తింటూ- గల్లీలన్నీ జల్లెడ పడుతుంటే అస్సలు టైమే తెలియదు! మినిమం 20 రూపాయలు! మాగ్జిమం 200! పుస్తకాల షెల్ఫ్ లోకి కొత్త స్నేహితులు చేరిపోతారు! ఆ రాత్రి అవేం మాట్లాడుకుంటాయో వినాలని ఒక చిలిపి కోరిక! చిరునవ్వొకటి పెదవి మీద మెరిసి మాయమైపోతుంది!

ఆదివారం నాడు రోజంతా పుస్తకాల వెలుగు వెళ్లిపోయాక- అబిడ్స్ గల్లీలు ఎప్పటిలాగే రాతి చీకట్లోకి ముడుచుకుంటాయి! మళ్లీ వచ్చే ఆదివారం కోసం, అభిమాన పాఠకులకోసం, వాళ్ల ఆత్మీయ స్పర్శ కోసం ఎదురు చూస్తుంటాయి! చలంలో మైదానంలో అమీనా కోసం ఎదురుచూసే రాజేశ్వరిలా..