ప్రపంచంలోనే తొలి డిజిటల్ టీ షర్టు తయారు చేసిన హైదరాబాద్ కుర్రాడు..!
ప్రింటెడ్ టీ షర్టు..!
కొన్న తర్వాత ఒకసారి నచ్చుద్ది...!!
రెండోసారి పెద్దగా ఎగ్జయిట్మెంట్ ఉండదు...!!
మూడోసారి బోర్ కొడుతుంది...!
నాలుగోసారి వాడ్రోబ్ లో అట్టడుగుక్కి చేరిపోతుంది...!!!
టీ షర్టు మీద ఇమేజ్ అయినా సరే, కామెంట్ అయినా సరే-
ఒకటీ రెండు సార్లు మాత్రమే మోజు. ఆ తర్వాత దానివంక చూడనుకూడా చూడం..
మరి అలా కాకుండా మన మూడ్‌ని బట్టి- మనం మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బట్టి- టీ షర్టు మీద కామెంట్లు, ఇమేజెస్ ప్రింటయితే ఎలా వుంటుంది.. ? పార్టీలో ఉంటే పార్టీలో ఉన్నానని, పబ్బులో ఉంటే పబ్బులో ఉన్నానని చెప్పే టీ షర్టులు సృష్టిస్తే ఎలా వుంటుంది..?
వినడానికి కొత్తగా ఉంది కదా! మరి చూస్తే ఇంకెంత ఖుషీ అవుతారు? మరి లేటెందుకు చదవండి...!!
మగవారి టాప్ వేర్ విషయానికొస్తే- బేసిగ్గా రెండే రెండు ఆప్షన్స్. ఒకటి షర్టు. ఇంకొకటి టీ షర్టు. ఎప్పుడో ఓసారి అతికష్టం మీద సూటు వేస్తాం. పండగలప్పుడుగానీ షేర్వానీ వేయం. ఇవి పక్కన పెడితే షర్టు, టీ షర్టు మాత్రమే రెగ్యులర్ వేర్. బ్రాండ్ మీద, ప్రైస్ మీద డిస్కషన్ తప్ప- షర్టుల్లో పెద్దగా చర్చకు దారితీసే ఎలిమెంటే ఉండదు. ఆల్మోస్ట్ టీ షర్టులూ అంతే. ఈ మొనాటనీని మార్చాలని డిసైడయ్యాడు హైదరాబాద్ కుర్రాడు అయ్యప్ప నాగుబంది.
మనసులో ఉన్న భావాన్ని టీ షర్టు మీద సాక్షాత్కరింపజేయలేమా..? మూడ్ కి తగ్గట్టు కొటేషన్ డిస్ ప్లే చేయలేమా..? ఈ యాంగిల్లో ఏదైనా ఇన్నోవేషన్ చేయలేమా..?
సరిగ్గా ఇదే పాయింట్ మీద- ఇదే టాపిక్ మీద నడిచిన డిస్కషన్ నుంచి- పుట్టిందొక ఐడియా. ప్రశ్ననే ముడిసరుకుగా ఎంచుకున్నాడు. ఆ దిశగా చర్చోపచర్చలు నడిచాయి. వాదోపవాదాలు జరిగాయి. కొన్ని ప్రయోగాలు సఫలం. మరికొన్ని యత్నాలు విఫలం. కాసేపు నిరాశ. కాసేపు ఆశ. మొత్తానికి సాధించాడు...
యాహూ.. ఐయామ్ హాపీ!!.
వైట్ కలర్ టీ షర్టు మీద ఎల్ఈడీ అక్షరాలు దేదీప్యమానంగా వెలిగాయి!!
ఎలా సాధ్యమైంది..?
ఏం చేశాడు..?
ఫ్యాబ్రిక్ మీద టచ్ ఫీచర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా రీసెర్చ్ జరుగుతోంది. సీరియస్ గా ప్రయోగాలూ జరుగుతున్నాయి. కానీ ఎక్కడా, ఏదీ, కొలిక్కి రాలేదు. కానీ అయ్యప్ప మాత్రం దాన్ని సాధించిన తొలివాడయ్యాడు.
డిజిటల్ టీ షర్టు..! ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ప్రోగ్రామబుల్ వేరబుల్ టీ షర్టు !! ఎన్నో ట్రయల్స్ తర్వాత, మరెన్నో ఫెయిల్యూర్స్ తర్వాత- ఒక రూపానికొచ్చింది. టీ షర్టుకి ఎల్ఈడీ పానెల్ కనెక్ట్ చేస్తారు. దాన్ని బ్లూ టూత్ చిప్ కి అటాచ్ చేస్తారు. అది ఫోన్ కి కనెక్ట్ అయి వుంటుంది. దాంతో పాటు స్పెషల్ గా తయారు చేసిన యాప్ కూడా ఉంటుంది. యాప్ లో మెసేజ్ టెంప్లేట్స్ ఉంటాయి. ఇమేజెస్, ఎమోజెస్- దానికి సూటయ్యే కామెంట్లన్నీ ఉంటాయి.
ఉదాహరణకు పార్టీకి వెళ్తుంటే ఆ మూడ్ కు తగ్గట్టు ఇమేజ్ పెట్టి కామెంట్ టైప్ చేసుకోవచ్చు. ఫోన్లో టైప్ చేసిన మెసేజ్ బ్లూ టూత్ ద్వారా ఎల్ ఈడీ ప్యానెల్ ను ఆపరేట్ చేస్తుంది. అది టీ షర్టు మీద డిస్ ప్లే అవుతుంది. ఐయామ్ హాపీ అని- గెట్టింగ్ బోర్ అని- నిమిషానికోసారైనా- గంటకోసారైనా మార్చొచ్చు. టీ షర్టు వానలో తడిసినా ఏం కాదు. ప్రతీసారి ఫోన్ తో ఆపరేట్ చేయకుండా టీ షర్టుకు ప్రత్యేకంగా ఒక లోగోని డిజైన్ చేశారు. దాన్ని టచ్ చేస్తే మెసెజ్ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. లోగోని స్వైప్ చేస్తే ఆర్కైవ్స్ నుంచి వేరే ఇమేజ్ వచ్చి షర్టు మీద డిస్ప్లే అవుతుంది. ప్రపంచంలో ఇలాంటి టీ షర్టు మరెక్కడా లేదంటాడు అయ్యప్ప.
మొదట వైట్ టీ షర్టు మీద ప్రయోగాలు చేశారు. ఎల్ఈడీ సర్క్యూట్ అమర్చడం తలకు మించిన భారమైంది. ప్రతీసారీ క్లాత్ కాలిపోయేది. ఎల్ఈడీలను సిరీస్ లో సోల్డరింగ్ చేసే ప్రక్రియలో ఫ్యాబ్రిక్ బర్న్ అయ్యేది. అంతపెద్ద సర్క్యూట్ ను టీ షర్టు లోపల అమర్చడం కూడా కుదరలేదు. తర్వాత్తర్వాత ఒక్కో సమస్యకు చెక్ పెట్టుకుంటూ వచ్చారు. వైట్ టీ షర్టు నుంచి కలర్ టీ షర్టుకు వచ్చారు. కాలర్ టీ షర్టు నుంచి నెక్ టీషర్టుకు- అలా ప్రయోగాల మీద ప్రయోగాలు చేశారు. మొదట షర్టు ముందు భాగంలో మాత్రమే ఎల్ఈడీ గ్రిడ్ సెట్ చేశారు. తర్వాత వెనకాల కూడా అమర్చారు.
ఐదు నెలలుగా దీనిమీద రీసెర్చ్ చేస్తున్నారు. మొదట్లో ఒకటీ రెండు ఫీచర్స్ ఉండేవి. ఇప్పుడు చాలా యాడ్ అయ్యాయి. ట్విటర్ ఇండికేట్ కూడా అవుతుంది. ఏవైనా ట్వీట్స్ వస్తే ఆటోమేటిగ్గా టీ షర్టుమీద నోటిఫికేషన్ వస్తుంది. అడ్వర్టయిజింగ్ లా కూడా వాడుకోవచ్చంటున్నారు అయ్యప్ప. అయితే ఇది కేవలం మగవారికే కాదు.. అమ్మాయిలు కూడా వేసుకోవచ్చని ముసిముసి నవ్వులు నవ్వాడు.
అయ్యప్ప పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే. నాన్న రిటైర్ ఆర్మీ. టెన్త్ వరకు ఆర్మీ స్కూల్లో చదివాడు. ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మొదట సత్యంలో రిసెప్షనిస్టుగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ప్రమోషన్. వెబ్ డిజైనర్ గా కొన్నాళ్లు. వెబ్ డెవలపర్ గా మరికొన్నాళ్లు. తర్వాత టీం లీడర్ అయ్యాడు. సింగపూర్ యూకే యుఎస్ఏలో కూడా వర్క్ చేశాడు. వరల్డ్ బ్యాంకులో ఏడాదిన్నర పనిచేశాడు. అక్కడే డిజిటల్ టీ షర్టు ఐడియాను చాలామందికి చెప్పాడు. అందరికీ నచ్చింది. అమెరికా నుంచి కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. దాంతో జాబ్ కి రిజైన్ చేసి ఇండియాకి వచ్చాడు. డిజిటల్ టీ షర్టు మీద వర్కవుట్ చేయడం మొదలుపెట్టాడు. ఐదు నెలల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత- టీ షర్ట్ ఒక రూపుకొచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ ఈ మధ్యనే ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తే.. బెస్ట్ గాడ్జెట్ అవార్డు దక్కింది. దాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల అందుకోవడం మెమరబుల్ ఫీలింగ్ అంటాడు అయ్యప్ప.
ప్రపంచంలోనే తొలి డిజిటల్ టీ షర్టు తయారు చేసిన ఈ కుర్రాడి టీంలో 8 మంది ఉన్నారు. వాళ్లలో మాగ్జిమం హార్డ్ వేర్ ఇంజినీర్సే. వాళ్లంతా పానెల్, సర్క్యూట్ తయారీలో ఉంటారు. మొబైల్ యాప్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్ కూడా ఉన్నాడు. త్వరలోనే ఇండిగోగో ద్వారా ప్రి-ఆర్డర్ చేయాలనుకుంటున్నారు.