చిన్న రిటైలర్లకూ ఆన్‌లైన్ సౌకర్యం కల్పించే 'ట్విక్‌స్టర్'
ఈ-కామర్స్ రాకతో భారత్ లోని వినియోగదారులకు అనేక ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఆన్ లైన్లో షాపింగ్ చేసే ఛాన్స్ వచ్చేసింది. షాపింగ్ లో వినియోగదారుల జోరు చిన్న-మధ్యతరహా రిటైలర్స్‌కు బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. కొంతకాలం వరకూ పలు సమస్యలు ఎదుర్కొన్న రిటైలర్స్ అంతా, ఈ కామర్స్‌తో భౌగోళిక సరిహద్దులు అధిగమించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. భారత్‌లో ఈ-కామర్స్ వృద్ధిలో నమ్రతా సోని కీలక పాత్ర పోషించారు. 31 ఏళ్ల వయసప్పుడు నమ్రత అమెరికాలోని వెల్స్ ఫార్గొలో పనిచేస్తుండేవారు. అగ్రరాజ్యంలో ఈ-కామర్స్ ట్రెండ్‌ను స్నేహితురాలు-సహోద్యోగి ప్రియా రామకృష్ణన్‌తో కలిసి పరిశీలించిన నమ్రత, భారత్ వచ్చిన తర్వాత ఇక్కడి రిటైలర్స్ కోసం ట్విక్‌స్టర్ పేరిట ఓ వేదిక స్థాపించారు.
ఏంటీ ట్విక్‌స్టర్
ఆధునిక రిటైల్ యుగంలో వెనకబడ్డ చిన్న-మధ్యతరహా రిటైలర్స్‌ను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు నమ్రత ట్విక్‌స్టర్ వెంచర్‌ను ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా సేల్స్‌ను సులభతరం చేయడంతో పాటూ ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచుతున్నారు.
విస్తృత ప్రయోజనాలు (360 degree approach)
రిటైలర్స్‌కు ట్విక్‌స్టర్ తో అనేక ప్రయోజనాలు. ఈ కామర్స్‌లో అడుగిడడంతో పాటూ వ్యాపారాభివృద్ధికి - విస్తృతికి సహకారమందిస్తుంది. ఆన్ లైన్ స్టోర్ స్థాపన, చెల్లింపులు, లాజిస్టిక్ సర్వీసులు, ఎండ్ టు ఎండ్ ఆన్ లైన్ సేల్స్‌లో స్టోర్ ఓనర్లకు చేయూతనిస్తుంది. ఆన్ లైన్ మార్కెట్లో రిటైలర్ల ఉనికిని మేనేజ్ చేయడంతో పాటూ వ్యాపార సేవలందిస్తుంది. మార్కెట్లో మజెంటో, షాపిఫై, ప్రెస్టాషాప్ లాంటి పాపులర్ ఈ కామర్స్ సైట్స్ ఉన్నా ట్విక్‌స్టర్ కు ప్రత్యేకత వేరని నమ్రత అంటారు. ట్విక్‌స్టర్ పాకెట్ ఫ్రెండ్లీ అని.. తక్కువ ఖర్చులోనే తాము వినియోగదారులకు సేవలందిస్తున్నామని చెప్తారు. మిగతా సైట్స్‌లోని ప్రైజింగ్ మోడల్ చిన్న రిటైలర్స్‌కు అనుకూలంగా ఉండడం లేదు. ఈ సైట్స్‌లో షాప్ ప్రారంభించాలనుకునేవారు తప్పనిసరిగా భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి 60 నుంచి 84వేలు ముట్టజెప్పాల్సి వస్తోంది . ఓ చిరు వ్యాపారి ఇంత భారీగా చెల్లిస్తే పెద్ద రిటైలర్స్‌కు వీళ్లకూ తేడా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
తమ వినియోగదారులకు ట్విక్‌స్టర్ మూడు ప్రైసింగ్ మోడల్స్ అందుబాటులో ఉంచింది. నెలవారీ రుసుము చెల్లించకుండానే "ట్విక్‌స్టర్ గో" బేసిక్ ప్లాన్‌లో చేరవచ్చు. ఎవరైనా ఫొరెవర్-ఫ్రీ, ఫీచర్-పాక్డ్, మొబైల్-ఫ్రెండ్లీ ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత డిమాండ్‌ను బట్టి ఆశించిన సేవలకు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది.
కస్టమర్స్ పై బలవంతంగా అనవసర ఆప్షన్స్ రుద్దకుండా వారు కోరుకున్న సర్వీసులకు మాత్రమే వసూలు చేస్తామని నమ్రత చెప్తున్నారు."ప్రిఫర్డ్, ప్రొ" పేరిట ట్విక్‌స్టర్ యూజర్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. రోజువారీ కార్యకలాపాల్లో వినియోగదారులకు అత్యున్నత సేవలందించేందుకే ఈ ప్లాన్స్ ఆచరణలో పెట్టింది.
మూడేళ్ల కిందటే..
2013 డిసెంబర్ నుంచి ట్విక్‌స్టర్ అభివృద్ధిలో నమ్రత నిమగ్నమయ్యారు. 2014 మేలో ఈ కామర్స్ వేదిక ప్రారంభించారు. ఈ కామర్స్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు 2015 మే నెలలో ప్రైసింగ్ ప్లాన్ ఆవిష్కరించారు. కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు ఆన్ లైన్ స్టోర్‌కు అవసరమైన అన్ని హంగులూ సమకూర్చారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు నమ్రత అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నారు. ఇన్‌స్టామోజో, మల్టీ ఛానల్, యూని కామర్స్ లాంటి సంస్థల భాగస్వామ్యం తీసుకున్నారు. పొదుపు చేసుకున్న మొత్తంతో నమ్రత ట్విక్‌స్టర్ ప్రారంభించారు. ఆమె స్నేహితురాలు ప్రియ తొలి పెట్టుబడి పెట్టారు. ఈ కామర్స్‌లో అడుగిడిన ప్రారంభంలో నమ్రతకు ఆర్ధిక సమస్యలు లేవు. అయినప్పటికీ తగిన సీటీఓను గుర్తించడం అతిపెద్ద అడ్డంకిగా మారిందని ఆమె చెప్తారు. సుదీర్ఘ అన్వేషణ తర్వాత సీటీఓగా వినయ్ సైనీ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయనే ట్విక్‌స్టర్ సహ వ్యవస్థాపకుడు కూడా.
బెంగళూరులో ఉన్న ట్విక్‌స్టర్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ఆరునెలల్లో నిధులు సమీకరించి టీమ్‌ను విస్తృతం చేసేందుకు నమ్రత కృషిచేస్తున్నారు. ఢిల్లీ, జైపూర్, హరిద్వార్, బెంగళూరు, మైసూరులపైనే ఫోకస్ పెట్టిన ఈ కంపెనీ ఇతర పట్టణాలకూ విస్తరించనుంది. ట్విక్‌స్టర్ పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా కళాకృతులు, దుస్తులతో పాటూ హస్తకళల రిటైలర్సే ఉన్నారు. కళాకారుల కోసం కొత్తగా ట్విక్‌స్టర్ లో మార్కెట్ ప్లేస్‌ను లాంచ్ చేశారు.
ఈ-కామ్ బూమ్
భారత్‌లో ఈ కామ్ దూసుకుపోతోందని...పీడబ్ల్యూసీ తాజా నివేదిక తేల్చి చెప్పింది. 2009 నుంచి ఇండియాలో ఈ కామర్స్ 34% వార్షిక అభివృద్ధి రేటు నమోదు చేసింది. 2014లో ఈ మొత్తం 16.4బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. ట్విక్‌స్టర్ లాంటి వేదికలు చిన్నపాటి రిటైలర్స్ పోటీ ప్రపంచంలోకి రావడానికి దోహదం చేస్తున్నాయి. చెల్లింపుల్లోని వ్యత్యాసాలు రిటైలర్స్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఈ సంస్థే గుర్తించాల్సి ఉంది. ఏదేమైనా ట్విక్‌స్టర్‌లో ఆర్ట్ బీట్ పెయింటింగ్స్, కిలి షాప్, క్యాండీ షెల్వ్స్ లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్రాండ్స్ షాప్స్ ప్రారంభించాయి. ఈ-కామ్‌లోని ప్రయోజనాలను ఒడిసిపట్టేందుకు కంపెనీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ -కామర్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఆన్‌లైన్ స్టోర్స్ నిర్వహణలో సపోర్ట్ సర్వీసులదే ప్రధాన పాత్ర. కస్టమర్‌కు అవసరమైన సేవలను బలోపేతం చేస్తే భారత్‌లో ఈ-కామ్‌కు తిరుగులేదు.