లాయర్, సిఏ, సెక్రటరీలను వెతికిపెట్టే వేదిక 'మీట్ యువర్ ప్రో'
చిన్న చిన్న లీగల్ విషయాలే అయినా వాటిపై స్పష్టత ఉండదు ? వివిధ రకాల పన్నుల లెక్కలంటే బుర్రతిరిగే పని ! కొత్తగా వ్యాపారం మొదలెట్టాలనుకునే చాలామందికి ఎదురయ్యే సమస్యలే ఇవి. ఒక్కోసారి స్టార్టప్ కోసం ఖర్చు పెట్టిన దానికంటే, ఇవన్నీ అర్థం చేసుకుని వ్యవహరించేందుకు వెచ్చించిన సమయం, వృధా అయ్యే డబ్బే ఎక్కువ కావొచ్చు. ఇది నిజంగా ఆంట్రప్రెన్యూర్లను వెనక్కి లాగే విషయమే. అటువంటి టైమ్‌లో, ఈ ప్లాట్‌ఫాంపై అవగాహన ఉండడం తప్పనిసరి. కొత్తగా వ్యాపారంలో దిగుతున్న వారికి ఎదురయ్యే న్యాయ, న్యాయేతర ఇబ్బందులు, వాటి నుంచి బయటపడే విధివిధానాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.
చెన్నై కేంద్రంగా జులై 2014లో 'మీట్ యువర్ ప్రో' ప్రారంభమైంది. ట్యాక్స్, లీగల్ వ్యవహారాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చే వేదిక ఇది. ఈ స్టార్టప్‌ను దివాకర్ విజయసారథి, రాజేష్ ఇన్బసేకరన్‌లు స్థాపించారు.
మీట్ యువర్ ప్రొలో అంకితభావంగల ప్రొఫెషనల్ టీమ్ ఉంది. పర్సనల్, బిజినెస్ ట్యాక్సేషన్, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన సమాచారాన్ని మొత్తం అందిస్తుంది.
“ మీట్ యువర్ ప్రొ డాట్ కామ్ ఓ ట్రస్టెడ్ ప్లాట్‌ఫాం. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే ప్రొఫెషనల్స్‌కు ఇదో ఆల్ ఇన్ వన్ సైట్ '' అంటారు దివాకర్.
స్టార్టప్స్ బిజినెస్ అవసరాలు తెలుసుకోవడం
మీట్ యువర్ ప్రొ డాట్ కామ్ … ప్రొఫెషనల్ సర్వీసెస్‌కు ఒక కంట్రోల్డ్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్, డెలివరీ ప్లాట్‌ఫాం కూడా. స్టార్టప్స్‌కు సంబంధించిన పర్సనల్, బిజినెస్ అవసరాలు ఏంటో గుర్తించి, వాటిని తెలుసుకుని మరీ తీరుస్తుంది.
ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చూసుకోవడం వంటి ఎన్నో ప్రొఫెషనల్ సర్వీసెస్‌ను ఇది అందిస్తుంది.
“ మీట్ యువర్ ప్రొలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాక్ అవుతుంది. డెడ్ లైన్స్ ఉంటాయి. సెక్యూర్ వర్క్ ఫ్లో మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ (TIMI) సాయంతో హై క్వాలిటి సర్వీస్ అందిస్తున్నాం, తద్వారా ఒక నమ్మకమైన వాతావరణంలో పని జరిగేలా చూసుకుంటున్నాం ” అంటారు కో ఫౌండర్ రాజేష్.
ఒకే ధరను నిర్దేశించకుండా, కస్టమర్లు ప్రైజ్ ఫిక్స్ చేసుకునేందుకు వీలుగా మల్టిపుల్ ప్రైజింగ్ ఆప్షన్‌ను అందిస్తోంది. వీరి డెలివరీ ప్లాట్ ఫారం, TIMI, ఎంగేజ్‌మెంట్ టైమ్, ప్రతి డెలివరీ స్టేజ్‌ను డేగకన్నుతో పరిశీలించే ఆపరేషన్స్ టీమ్ సర్వీసులు ప్రశంసనీయం.
విజయసారథి ప్రకారం, మీట్ యువర్ ప్రొ అందించే సర్వీసుల ఛార్జీలు మిగతా వారితో పోలిస్తే 50-60% తక్కువ. ఈ కంపెనీ పనితీరు, అందించే సర్వీసులు, ప్రొడక్ట్స్‌ను పరిశీలిస్తే .. ప్రస్తుత మార్కెట్ ప్లేస్‌లో లేని ఆప్షన్స్, ధరలు, డెలివరీ అందిస్తోందనే చెప్పాలి. మీట్ యువర్ ప్రొతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ సంఖ్య వెయ్యి మంది అంటే అతిశయోక్తి కాదు.
ఆ రోజుల్లోనే బిజినెస్ మ్యాన్
2008-09లో, విజయసారథి, రాజేష్ ఈ-రిటర్న్ తయారీ, ఆఫ్ లైన్‌లో ఫైల్ చేయడానికి సంబంధించి taxqbe.com అనే ఒక పోర్టల్ లాంఛ్ చేశారు. మార్చి 2014లో, ఆన్ లైన్ ట్యాక్స్ కన్సల్టేషన్, ఫైలింగ్ చేసే mytaxmanager.in ను లాంఛ్ చేశారు. రకరకాల కన్సల్టేషన్స్ కోసం డెలివరీ టీంను పంపిస్తున్నప్పుడు … వారికో ఐడియా వచ్చింది. మార్కెట్ ప్లేస్‌లా తామే ఆయా ప్రొఫెషనల్స్‌ను పార్టనర్స్‌గా మార్చుకుంటే ఎలా ఉంటుందని. అలా పుట్టిందే మీట్ యువర్ ప్రొ.
స్టార్టప్ క్లినిక్
స్టార్టప్ కమ్యూనిటి ప్రతీ అవసరాన్ని తీర్చేందుకు మీట్ యువర్ ప్రొ ఒక స్టార్టప్ క్లినిక్‌కు శ్రీకారం చుట్టింది. బిజినెస్ బరిలోకి దిగుతున్న వారికి న్యాయపరమైన, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీస్ అందించేందుకు, తద్వారా వ్యాపారంలో వేగంగా ఎదిగేందుకు వీలును కల్పించింది.
బిజినెస్‌కు బీజం పడినప్పటి నుంచి వ్యాపారంలో రాణించేంతవరకూ అవసరమైన అన్ని సేవలనూ అందిస్తోంది ఈ స్టార్టప్ ప్యాకేజ్. ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్, PAN అలాట్‌మెంట్ లెటర్, TAN, DIN, బ్యాంకులో ఖాతాలను తెరిచే వెసులుబాటు, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కన్సల్టెన్సీ, ఇన్‌బౌండ్ ఇన్వెస్ట్ మెంట్స్‌కు సంబంధించిన అన్ని పనులూ, సేవలను దగ్గరుండి మరీ చూసుకుంటుంది.
లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ తదితర ప్రొఫెషనల్స్‌తో ఆన్‌లైన్లో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటుచేయడం ఒక వరమనే చెప్పాలి. అంతేకాదు కొత్త కొత్త క్లైంట్స్‌ను దక్కించుకునేందుకు ఒక మార్గం కూడా. డైరెక్ట్‌గా ఒకరినొకరం కల్సుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు, కానీ ఈ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ద్వారా పని చకచకా అయిపోతుంది. సమయం అంతగా వృధా అవ్వదు.
“ భారత్ లో మాలాంటి సంస్థలతో ప్రొఫెషనల్స్ ఫీజు షేర్ చేసుకోవడం నిషిద్ధం. అందుకే మీట్ యువర్ ప్రొ వారి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. ప్రొఫెషనల్స్ ఛార్జ్ చేసే ఫీజులో కొంత మార్క్ అప్ అమౌంట్‌ని మేము క్లైంట్స్ నుంచి తీసుకుంటాం,” అని వివరించారు విజయసారథి.
బంగారు భవిత
చెన్నైలో స్టార్టప్ క్లినిక్‌ను మీట్ యువర్ ప్రొ ఒక రెగ్యులర్ యాక్టివిటిగా మార్చాలనుకుంటోంది. త్వరలోనే బెంగళూరుకు విస్తరించే పనిలో ఉంది.
“ స్టార్టప్ అనగానే మొట్టమొదట మా స్టార్టప్ క్లినికే అందరికీ గుర్తురావాలి, అదే మా టార్గెట్ ” అంటారు విజయసారథి.
చివరగా, సరైన రెవెన్యూ లేకపోతే ఒక వ్యక్తి బిజినెస్ జర్నీ ముందుకు సాగదు. అందుకే, స్టార్టప్స్, ప్రొఫెషనల్స్‌కు ఒక డీల్ కుదిరించగలిగితే .. వారి నుంచి మీట్ యువర్ ప్రొ 6-10% మార్జిన్ లెక్కన వసూలు చేస్తుంది. వచ్చే ఏడాది మార్చికల్లా మిలియన్ డాలర్లను సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకుంది.