ఉరుకుల పరుగుల జీవితంలో మనం సొంత మనుషుల్నే మరిచిపోతున్నాం. వయసుడిగిన అమ్మానాన్నలో, బామ్మా తాతయ్యలో! ఎవరైతేనేం?! పండుటాకులను ఓ మూలన విసిరేసి మనం బతుకు బాటలో పరుగులు పెడుతున్నాం! మలిసంధ్యలో వారి అవసరాలను- ప్రాధాన్యతా క్రమంలో పేరుస్తున్నాం! మెడిసిన్స్ లాంటి అర్జెన్సీ ఉన్నవి మాత్రమే తెచ్చిచ్చి, మిగిలిన అవసరాలను తర్వాత చూద్దాంలే పక్కన పెడుతున్నాం. ఎంతసేపూ మాత్రలు, టీవీ రిమోట్, పక్కనే ఒక లాండ్ లైన్. అవే వారి జీవితాలా? ప్రతీదానికీ పక్కవారిపైనే ఆధారపడాలా?
దేశంలో 12 కోట్ల మంది వృద్ధులున్నారు. యూకే కెనడా కంటే మనదగ్గరే ఆ సంఖ్య ఎక్కువ. మనదేశ జనాభా పెరుగుదలతో పోల్చుకుంటే సీనియర్ సిటిజన్ జనాభా రెట్టింపవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే 2026 కల్లా ఆ నంబర్ 17 కోట్ల పైచిలుకు చేరే అవకాశం. ఈ నేపథ్యంలో వారి ఆలనాపాలనా చూసుకునే తీరు, వెసులుబాటు ఎవరికుంది? ఎవరి సాయం అడగాలి?
వృద్ధాప్యం కావొద్దు శాపం అంటారు. నిజమే కానీ, ఈ నవీన యుగంలో ఎంతమంది వృద్ధులు తమ పనులు తామే సొంతంగా చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వేళ్లమీద లెక్కపెట్టి చెప్పొచ్చు. యాభయ్యో వడిలో పడ్డ తర్వాత రాహుల్ గుప్తాకు వృద్ధాప్యపు బాధలేంటో ఒక్కొక్కటీ తెలిసొచ్చాయి. పైగా ఫ్యామిలీ సర్కిల్లో సీనియర్ సిటిజన్లు పడే కష్టాలను కళ్లారా చూశాడు. చిన్నచిన్న పనులు కూడా చేసుకోలేని వృద్ధుల బాధలు చూసి మనసు చివుక్కుమనిపించింది. అయ్యోపాపం అనడం తప్ప వారికోసం ఏమీ చేయలేమా అనే సంఘర్షణ మొదలైంది. ప్రతీదానికీ ఇంట్లో వాళ్ల మీద ఆధరాపడటం.. యధాలాపంగా వాళ్లు విసుక్కోవడం- ముసలి గుండెకు ఎంత కష్టంగా ఉంటుంది.
వృద్ధుల కోసం మరో ప్రపంచం
రాహుల్ అంతకుముందు ఒక ప్రైవేటు టెలికాం కంపెనీలో పనిచేశాడు. ఆ అనుభవమే సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. వేరే ఆలోచనే చేయకుండా చేస్తే ఉద్యోగానికి గుడ్ బై కొట్టాడు. సీనియర్ సిటిజన్ల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు.
నిజానికి మలిసంధ్యలో ఉన్నవారి బాగోగులు, వారి అవసరాలు తీర్చడానికి మార్కెట్లో కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి. అయితే, ఇది అందరిలా కాకుండా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. మునివేళ్ల మీద అవసరాలు తీరాలి. సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండాలి. అలాంటి స్టార్టప్ కోసం ఫ్రెండ్ దీపుతో కలిసి రాహుల్ అడుగులు ముందుకు వేశాడు.
మొత్తానికి లాస్ట్ అక్టోబర్‌లో ఐడియాను ఆవిష్కరించారు. వృద్ధులకోసం సీనియర్ వరల్డ్ డాట్ కామ్ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. అందులో ఒకటే ఈజీ ఫోన్.
ఈజీ ఫోన్ ఎలా పనిచేస్తుంది?
చదవడం ఈజీ. వినడం ఈజీ. ఉపయోగించడమూ ఈజీ. ఎమర్జెన్సీ కోసం ప్రత్యేకమైన ఎస్ఓఎస్ బటన్ సిస్టమ్. సింగిల్ కీ ప్రెస్ చేస్తే చాలు.. ఫోటో డయలింగ్. క్రెడిల్ చార్జింగ్ మరో ప్రత్యేకత. చార్జర్లు మరిచిపోయినా టెన్షన్ లేదు. వైర్లు, పగ్గులు, స్విచ్చుల జంజాటం లేదు. అప్పట్లో కార్డ్ లెస్ ఫోన్లు వాడినట్టే. ఇక ఆడియో విషయానికొస్తే, మాట స్పష్టంగా వినిపిస్తుంది. పీస్ వన్ ఇయర్ వారంటీ. పాడైతే ఇంటికొచ్చి తీసుకెళ్లి, రిపేర్ చేసి ఇస్తారు. కొన్న తర్వాత మూడు వారాలలోపు ఎలాంటి రిపేర్ వచ్చినా, ఐటెం పాడైనా డబ్బులు తిరిగిస్తారు. లార్జ్ స్క్రీన్. బ్యాక్ లైటింగ్ కీస్. టాకింగ్ కీ ప్యాడ్. ఏ నంబర్ ప్రెస్ చేశామో తెలిసేటట్టు ఆడియో. నంబర్ ప్రెస్ అయిందా లేదా అన్న సందేహం అక్కర్లేదు. కీస్ మధ్య కావాల్సినంత ఎడం. ఒకదాని బదులు ఒకటి నొక్కే ఆస్కారం లేదు. నంబర్లు వెతుక్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతీ నెంబర్ వెనకాల లైట్ బ్లింక్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపించే ఫాంట్ సైజ్ కూడా పెద్దదే.
ఇవేగాక పవర్ ఫుల్ ఎస్ఓఎస్ ఫీచర్స్. ఎమర్జెన్సీ అలర్ట్ కోసం ప్రత్యేకంగా అమర్చిన ఎస్ఓఎస్ బటన్స్. ట్రిగర్ ఆఫ్‌లో ఉన్నా ఐదుగురికి ఫోన్ చేసుకునే వెసులుబాటు. ప్రస్తుతం ఎక్కడున్నాం? ఫోన్లో బ్యాటరీ పరిస్థితి ఏంటి? దగ్గర్లో ఉన్న మెడికల్ సర్వీసులేంటి.. తదితర వివరాలు ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంటాయి. ఒకవేళ ఫోన్ మోగినా లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే- ఆటోమేటిగ్గా దానంతట అదే కాల్ లిఫ్ట్ అవుతుంది. లౌడ్ స్పీకర్ ఆన్ అవుతుంది. అవతలి వ్యక్తి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న పేర్లను వెతుక్కోవాల్సిన పనిలేదు. సింగిల్ ప్రెస్తోనే ఫోటో కాంటాక్ట్ సిస్టం ద్వారా కాల్ వెళ్తుంది. 8 మంది ఇంపార్టెంట్ వ్యక్తుల ఫోటోలతో కూడిన కాల్ సెండింగ్ ఆప్షన్ సీనియర్ సిటిజన్లకు ఎంతో యూజుఫుల్.
ఇన్ని మంచి ఫీచర్లున్న ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. కొందరు సీనియర్ సిటిజన్లు స్మార్ట్ ఫోన్లను అడాప్ట్ చేసుకున్నప్పటికీ- పెద్దసంఖ్యలో వాడుతున్నది మాత్రం ఈజీ ఫోన్‌నే. ఎస్పెషల్లీ 70 పైబడిన వాళ్లు, బేసిక్ మొబైల్ కూడా ఆపరేట్ చేయలేనివాళ్లు, అంతకుముందు మొబైల్ ఫోనే తెలియని వాళ్లంతా ఈజీ ఫోన్‌కు కనెక్టయ్యారు.
మొదటి నాలుగు నెలల్లోనే బీభత్సమైన రెస్పాండ్ వచ్చిందంటున్నారు రాహుల్. నెలవారీ సేల్స్ 35 శాతానికి పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికైతే సొంత నిధులతోనే కంపెనీ నడుస్తోంది. టీమ్ బిల్డప్ కోసమని, ప్రాడక్ట్ డెవలపింగ్ కోసమని, ఇన్వెస్ట్ మెంట్ కోటిన్నర దాకా అయింది. యూజర్లు పెరిగేకొద్దీ మరింత ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే మూడు నెలల్లో మరిన్ని పీసులు తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. డిసెంబర్ కల్లా 1మిలియన్ డాలర్లకు చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం.
ఇంకా ఏమేం ఉన్నాయి?
ఫోన్ ఒక్కటే కాదు. ఇంకా చాలా ప్రాడక్ట్స్ ఉన్నాయి సీనియర్ వరల్డ్ లో. క్లోథ్స్, బాత్రూం మ్యాట్స్, వృద్ధులకు పనికొచ్చే ప్రతీదీ దొరికేలా కంపెనీని డిజైన్ చేశారు. వీటితో పాటు పండుటాకుల మానసికోల్లాసం కోసం రకరకాల ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. రాసే హబీ ఉన్నవారికోసం బ్లాగింగ్ వ్యవస్థ ఉంది. పెయిటింగ్, మ్యూజిక్, యోగాలాంటి అభిరుచి ఉన్న వారి కోసం హాబీస్ పేరుతో పేజీ ఉంది. అందులో విభిన్న వ్యక్తుల అభిరుచులు, వారి క్రియేటివ్ వరల్డ్ గురించి అన్ని వివరాలు పొందుపరిచి ఉంటాయి.
ఎవరిమీదా ఆధారపడకుండా వృద్ధులంతా ఆత్మగౌరవంతో బతికేలా చేస్తూ.. వారి కనీస అవసరాలను తీర్చడమే కాకుండా, వారి ఇష్టాయిష్టాలను పంచుకునే సరికొత్త వేదికగా తయారైంది సీనియర్ వరల్డ్. ఫేస్ బుక్‌లో ఈ కమ్యూనిటీ 33వేల పైచిలుకు ఫాలోయింగ్ కూడా ఉంది.
మార్కెట్ పరిస్థితి ఏంటి?
రఫ్ అంచనా ప్రకారం, ఈ సెగ్మెంట్లో 35వేల కోట్ల మార్కెట్ ఉంది. రాబోయే రోజుల్లో అది 96 వేల కోట్లకు చేరుతుందనేది సీఏజీ అంచనా. ఇప్పటికే ఎన్నో కంపెనీలు, స్టార్టప్స్ మార్కెట్లో పాగావేశాయి. గుడ్ హాండ్స్, సీనియర్ షెల్ఫ్, ప్రమతి కేర్ లాంటి సంస్థలు వృద్ధుల అవసమైన సేవలు, వస్తువులు అందజేస్తున్నాయి.