భాగ్యనగర కీర్తికిరీటంలో మరో కలికితురాయి
హైదరాబాద్. ఇండియన్ సిలికాన్ వ్యాలీ. ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న భాగ్యనగర కీర్తికిరీటంలో మరో మణిపూసను చేరింది. ప్రపంచంలోనే మేటి ఐటీ దిగ్గజం యాపిల్ కంపెనీ రెక్కలుగట్టుకుని వచ్చి హైదరాబాదులో వాలింది. అమెరికా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్ ను హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
హైదరాబాద్. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులేస్తున్న చారిత్రక నగరం. దేశ ఐటీ రాజధాని దిశగా ఆధునికతను అద్దుకుంటున్న సైబర్ సిటీ! ఐటీ రంగంలో పెట్టుబడులకు ప్రపంచంలోనే సెకండ్ బెస్ట్ ఆప్షన్. ఇంటర్నేషనల్ ఐటీ మార్కెట్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది మన భాగ్యనగరం. భౌగోళిక అనుకూలతలు, ప్రభుత్వ ప్రోత్సాహం వెరసి బడా బడా కంపెనీలు సైతం హైదరాబాద్ నే ఎంచుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ఐటీ సెక్టార్‌లో ఇన్వెస్ట్ మెంట్ కోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే కొలువుదీరిన కంపెనీలు.. తమ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు టెక్నాలజీ, డెవలప్ మెంట్ సెంటర్లకు భాగ్యనగరాన్నే అడ్డాగా మార్చుకుంటున్నాయి. స్కిల్డ్ మ్యాన్ పవర్, మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తవుతుండటంతో వాల్డ్ ఫేమస్ ఐటీ కంపెనీలన్నీ జై బోలో హైదరాబాద్ అంటున్నాయి.
సుస్థిర ప్రభుత్వం, పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్, సమశీతోష్ణ వాతావరణం, సునామీలకు, భూకంపాలకు తావులేని దక్కన్ పీఠభూమి.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ప్రపంచంలోని మేటి ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ భాగ్యనగర బాటపడుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత యాపిల్ కంపెనీ కూడా.. ముత్యాలనగరంలో ధగధగ మెరవడానికి సప్తసముద్రాలు దాటి తెలంగాణను వెతుక్కుంటూ వచ్చింది. యాపిల్ సంస్థకు ఇప్పటి వరకు అమెరికాలో మాత్రమే ఇన్నోవేషన్ సెంటర్ ఉండగా.. హైదరాబాద్‌లో ప్రారంభించింది రెండోది. టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్‌కు సంబంధించి అనుమతులు, ఇతర లాంఛనాలు శరవేగంగా పూర్తి కావడంతో అనుకున్న సమయానికి కన్నా ముందే ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది కల్లా దాదాపు నాలుగు-ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలన్నది యాపిల్ ఆలోచన.
వాస్తవానికి ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కోసం యూరప్‌తో పాటు భారత్‌లోని పుణె, బెంగళూరు తదితర ప్రధాన నగరాలన్నింటినీ యాపిల్ పరిశీలించింది. అయితే భౌగోళిక అనుకూలతలు, అవకాశాల దృష్ట్యా చివరకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. యాపిల్ నమ్మకాన్ని వమ్ము చేయని తెలంగాణ సర్కారు.. అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, నిర్ణీత గడువుకన్నా 15 రోజుల ముందుగానే ఇన్నోవేషన్ సెంటర్ ప్రారభించేందుకు కృషి చేసింది.
యాపిల్ సంస్థ తమ కార్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకోవడం గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ప్రభుత్వ మెరుగైన పనితీరుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్ ఎక్స్ లెంట్ టాలెంట్ కు కేంద్రమన్న సీఎం కేసీఆర్.. యాపిల్ మ్యాపింగ్ సెంటర్ ద్వారా వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత టాప్-5లో మూడు ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాదుకు తీసుకువచ్చామన్నారు మంత్రి కేటీఆర్. డిజిటలైజేషన్ లో భాగంగా యాపిల్ తో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. టీ-హబ్ తో కలిసి పనిచేయడానికి ఆపిల్ సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా బయట ఆపిల్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఎగ్జయిటింగ్ గా ఉందన్నారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. ఇక్కడి టాలెంట్ అద్భుతమని ప్రశంసించాడు. మున్ముందు హైదరాబాద్ లో తమ కార్యకాలాపాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఐ లవ్ ఇండియా అని సంబోధించారు.
దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ కు జైకొట్టడం- మామూలు విషయం కాదు. స్నేహ పూర్వక వాతావరణం, ప్రభుత్వ ముందుచూపు వెరసి మేటి కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. అదీగాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమైన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా ఇప్పటికే 1700 పై చిలుకు పరిశ్రమలకు రెండు వారాల్లోనే అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే మేటి ఐటీ సంస్థలు హైదరాబాద్ ను వెతుక్కుంటూ వస్తున్నాయంటే.. అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు.