మీ ఇంటి అద్దె సంగతి మాకు వదిలేయండంటున్న పే మాట్రిక్స్
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు రెంట్ కి ఇళ్లను తీసుకోవడం ఒక సమస్యయితే.. అడ్వాన్స్ రెంట్ లను ఇవ్వడం మరో సమస్య. నెల నెల జీతాలతో ఇంటి ఖర్చుల్ని నెట్టుకొచ్చే సగటు ఉద్యోగికైతే అడ్వాన్స్ అనేది తలకు మించిన భారం. అలాంటి వారి కోసం మొదలైందే పే మ్యాట్రిక్స్. ఇంటికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని అంటోందీ హైదరాబాదీ స్టార్టప్.
ఎలా మొదలైందీ అంటే..
ముఖేష్ చంద్రకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యాడు మొదట. హాస్టల్లో చేరాడు. తర్వాత ఇళ్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు. అది కాస్తా ఆన్ లైన్ పుణ్యమా అని తొందరలోనే అయిపోయింది. ఇంత వరకు బాగానే ఉంది. అసలు చిక్కు అడ్వాన్స్ దగ్గర ఆగిపోయింది. ఒకటో రెండో నెలలు అంటే ఎట్టాగోట్ట సర్దేవాడు. కానీ వాళ్లు ఏకంగా 6 నెలల అడ్వాన్స్ అడిగారు. ఒక్కసారిగా గుండె కడుపులోకి జారింది. అయినా తప్పలేదు. నానా పాట్లు పడి ఆరు నెలల అద్దె అడ్వాన్సు రూపేణా ఇచ్చాడు. తర్వాత మరో రెండు కంపెనీలు మారాడు. ఆటోమేటిగ్గా ఇల్లూ మారాల్సి వచ్చింది. ఆరు నెలల అడ్వాన్స్ అనే మాట ఆగర్భ శత్రువులా మారింది. చిరాకెత్తి చివరకి హైదరాబాద్ చేరుకున్నాడు. అలా వచ్చీ రావడంతోనే తనలాంటి అద్దె జీవుల సమస్యలు తీర్చే పనిలో పడ్డాడు. ఆ ఆలోచనే పే మ్యాట్రిక్స్ అనే స్టార్టప్ కు ప్రాణం పోసింది.
పే మాట్రిక్స్ కి 12వందల దాకా టెనెంట్స్ ఉన్నారు. అదే సంఖ్యలో ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. ఇప్పటి వరకూ 11 పేమెంట్ గేట్ వే లతో టై అప్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో వ్యాపారం సాఫీగానే సాగుతోంది. 6 నెలల్లో టర్నోవర్ కోటి రూపాయలు దాటింది. అయితే ఇది ఇనిషియల్ మాత్రమే. వచ్చే ఆరు నెలల్లో 5కోట్లు దాటుతామని ముఖేష్ దీమా వ్యక్తం చేశారు. సాధారణంగా రెంటల్ అగ్రిమెంట్స్ లాంటివి వ్యవస్థీకరించడం దీని ప్రత్యేకత. ప్రతి సారి పే చేసిన రెంట్ లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ట్రయల్ ద్వారా ల్యాండ్ లార్డ్ లకు రిసీప్టలను జనరేట్ చేస్తుంది. ప్రతి నెలా నూరుశాతం పెరుగుదల కనపరుస్తూ దూసుకు పోతోంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థకి యూజర్లున్నారు. ముంబై బెంగళూరుదని నగరాలనుంచే 50శాతం రెవెన్యూ వస్తోందని అనూష అంటున్నారు. వచ్చే ఆరు నెలల్లో ముంబై, బెంగళూరుల్లో టీం ఎక్స్ పేన్షన్ చేసే యోచనలో ఉన్నారు. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ డొమైన్ లో ఇలాంటి స్టార్టప్ బహుశా ఇదే మొదటిదని ముఖేష్ అన్నారు. రెంటల్ స్టార్టప్ లతో టై అప్స్ తో పాటు మరిన్ని నగరాలకు విస్తరణ చేయనున్నట్లు ప్రకటించారు.
పే మాట్రిక్స్ టీం
ఇక టీం విషయానికొస్తే ముఖేష్ చంద్ర కరీంనగర్ వాసి. అక్కడే స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి హైదరాబాద్ లో ఇంటర్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఐఓసిలో పనిచేశారు. ఆ తర్వాత ఎస్ బిజైన్ కాలేజీ నుంచి ఎంబీయే కంప్లీట్ చేశారు. తర్వత ఇన్ఫినిటీ రీసెర్చి కంపెనీలో దాదాపు 7నెలలు పనిచేసి, దీన్ని ప్రారంభించారు. అనూష ఈ సంస్థకు సిఈఓగా వ్యవహరిస్తున్నారు. ఐఐటి చెన్నై నుంచి బిటెక్ పూర్తి చేసిన ఆమె, ఐఓసిలో ముఖేష్ తో కలసి పనిచేశారు. అనంతరం ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీయే పూర్తి చేశారు. అనంతరం రిలయన్స్ ఇండియాలో పనిచేసి ఈ స్టార్టప్ ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ లో టెక్నికల్ లీడ్ గా పని చేసిన మురళీధర్ నాయక్ ఈ కంపెనీలో టెక్నికల్ లీడ్ గా జాయిన్ అయ్యారు. ముఖేష్ క్లాస్ మేట్ అయిన మురళీకి మూడున్నరేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. వీరితో పాటు 14మంది ఈ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు.
సవాళ్లు, ఇతర పోటీదారులు
రెంటల్ సెగ్మెంట్ లో ప్రస్తుతానికి పోటీ దారులు లేకపోయినా సమీప భవిష్యత్ లో ప్రవేశించే అవకాశం ఉంది. బిలియన్ డాలర్ మార్కెట్ లో ఇది ఒక సర్వీసుగానే ఉంది. మరిన్ని సర్వీసులను అందించగలిగితే భవిష్యత్ లో వచ్చే పోటీని తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంది. ఇక ఏడాదికి 18 నుంచి 20లక్షలు సంపాదించే ఉద్యోగాలను వదిలి పెట్టి స్టార్టప్ కోసం పనిచేస్తున్న వీళ్లకి ప్రతీదీ సవాలుగానే మారింది. ఇంటి దగ్గర నుంచి ఒత్తిడి కూడా ఎక్కువ గానే ఉంది. దాన్ని అధిగమించాల్సి ఉంది. బిజినెస్ సస్టేయినబుల్ మోడ్ లలో ఉంది. ఫండింగ్ లాంటి సమస్యలను అధిగమించాలి. అయితే టీ హబ్ తో అసోసియేషన్ అయ్యాం కనుక దీన్ని అధిగమించడం పెద్ద కష్టం కాదని అనూష అంటున్నారు.
భవిష్యత్ ప్రణాళిక
బిలియన్ డాలర్ రెంట్ మార్కెట్ లోని ఒక కొత్త స్పేస్ ని వెతికి ప్రవేశించిన ఈ స్టార్టప్ భవిష్యత్ లో మరికొన్ని స్టార్టప్స్ కి దారి చూపించింది. వచ్చే ఏడాది కల్లా చెన్నై, బెంగళూరు, ముంబైల్లో వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. దీంతో పాటు ఇతర మెట్రో, టియర్ వన్ నగరాల్లో టీం ను పెంచుకోవాలని చూస్తున్నారు. దీని తర్వాత కమర్షియల్ స్పేస్ మేనేజ్మెంట్, టెన్నెంట్ స్క్రీనింగ్ సర్వీసు లాంటి వాటిని ప్రారంభించనున్నారు.పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన పే మాట్రిక్స్ తమతో కలసి వచ్చే వారి దగ్గరి నుంచి ఫండింగ్ ఆశిస్తున్నట్లు ప్రకటించింది. రెంటల్ స్పెస్ లో ఉన్న ఏ కంపెనీ అయితే తమ స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖేష్ కోరారు.