చిన్నపిల్లల డాక్టర్లను ఆన్‌లైన్‌లో కలిపే 'అడోడాక్'
ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు.. పనులన్నీ వదులుకుని.. తక్షణం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్‌ను కలవడం అంత ఈజీ కాదని అర్థమవుతుంది. చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక చిన్నపిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు ఈ ఫార్మాలిటీస్ పాటించాలంటే కష్టమే. ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు. అర్థరాత్రిళ్లు వాళ్లు ఏదైనా ఇబ్బంది పడితే చూసి తట్టుకోలేం.. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లాలో లేదో కూడా అర్థం కాని స్థితిని ప్రతీ తల్లీదండ్రీ ఎదుర్కొనే ఉంటారు. జనరల్ ఫిజీషియన్ కంటే పీడియాట్రిక్స్ దొరకడం కూడా కాస్త కష్టమే.
సాధారణంగా కొంత మందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు. అలాంటి వారైతే నేరుగా డాక్టర్‌తోనే మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ అందరు వైద్యులు ఫోన్ నెంబర్లు ఇవ్వరు. మరి ఎప్పుడైనా అవసరం పడితే ఎలా.. ? ఇలాంటి సమస్యలను చెక్ పెట్టేందుకు అడోడాక్ యాప్ ప్రారంభమైంది. ఈ యాప్ పేషంట్స్ -పీడియాట్రిక్స్ మధ్య సమాచార దూరాన్ని తగ్గించడంలో విప్లవాత్మక పాత్ర పోషిస్తోంది.
టెలిఫోన్, మెసేజీల ద్వారా పేషెంట్స్ లక్షణాలు తెలుసుకునేందుకు డాక్టర్లకు ఇది ఉపయోగపడ్తుంది. ఇక తల్లితండ్రులైతే ఈ యాప్ ద్వారా ఏ సమయంలోనైనా డాక్టర్‌ను సంప్రదించవచ్చు. తమ బిడ్డ హెల్త్ రికార్డ్‌ను కూడా నేరుగా తెలుసుకునే అవకాశమూ ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఢిల్లీలో 50 మంది డాక్టర్లు... 80వేల మంది పేషెంట్స్‌తో నిత్యం అందుబాటులో ఉంటున్నారు.
ఈ యాప్‌ను సిద్ధార్థ, సత్యదీప్, సౌరభ్‌లు రూపొందించారు. వీళ్లందరికీ అమ్డాక్స్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ యాప్‌కు రూపమివ్వడం కూడా గమ్మత్తుగానే జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ సౌరభ్‌తో కలిసి సత్యదీప్... బెంగళూరులో ఓ స్టార్టప్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలోనే వేదికపై సిద్ధార్ధ.. ఈ అడోడాక్ ఐడియాను ప్రజంట్ చేశారు. ఈ ఆలోచన నచ్చేయడంతో వీరు ముగ్గురూ కలిసి ఐడియాను ఆచరణలో పెట్టేశారు.
సత్యదీప్, సౌరభ్‌లు గువాహటి ఐఐటీ క్లాస్‌మేట్స్. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే వీళ్లు డ్రాప్ బాక్స్.. ఫోల్డర్స్ సింక్ చేయడానికి ప్లగిన్ క్రియేట్ చేశారు. ఈ క్రియేషన్ డ్రాప్ బాక్స్ సమస్యలను పరిష్కరించడంలో విజయవంతమైంది. అప్పట్లో వీళ్ల టాలెంట్ పై ది హిందూ, లైఫ్ హాకర్, మేక్ యూజ్ ఆఫ్, పీసీ వాల్డ్, ఫాస్ట్ కంపెనీలు కథనాలు ప్రచురించాయి. అప్పట్లో ఈ ప్లగిన్ 5లక్షల సార్లు డౌన్‌లోడ్ అయింది. విద్యార్థి దశలోనే పారిశ్రామిక లక్షణాలతో పేరుగడించిన సత్యదీప్, సౌరభ్‌లు అడోడాక్ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
పేషంట్స్ - పీడియాట్రిక్స్ మధ్య వారధి
" భారతదేశ వ్యాప్తంగా కేవలం 80వేల మంది చిన్న పిల్లల వైద్యులు మాత్రమే ఉన్నారు. దేశంలోని పిల్లలందరికీ వైద్యం అందించడం వీళ్లకో పెద్ద సవాల్. పెరుగుతున్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపమే కాక థైరాయిడ్, హార్మోన్ల సమస్యలున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 44% మంది ఉండాల్సిన బరువుకంటే తక్కువ ఉన్నారు. సరైన సమయంలో వైద్య సలహాలు లభిస్తే తల్లితండ్రులే పిల్లల్లోని అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించే వీలుంటుంది. అడోడాక్ ఈ అంతరాన్నే పూరించేందుకు కృషిచేస్తోంది " అంటూ సమాధానమిస్తారు సిద్ధార్థ్ .
అడోడాక్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్న రోగులకు సైతం అత్యున్నత వైద్యం అందుతుంది. ఉద్యోగస్తులైన తల్లితండ్రులకు డాక్టర్స్‌ను కలిసి సూచనలు పొందాలంటే కష్టమే. ఈ యాప్ ఇలాంటి వారికి చాలా ఉపయుక్తం. టెలిఫోన్ కన్సల్టేషన్‌తో పిల్లల సమస్యలకు తగిన వైద్య సలహాలు పొందవచ్చు. అడోడాక్‌కు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ నేరుగా వైద్యులకు కాక నిర్దేశిత ఫోన్ నెంబర్‌కు వెళ్తాయి. అనవసర కాల్స్‌ను వడపోసే వ్యవస్థ కూడా ఈ యాప్‌లో ఉంది.
ఆరుగురుతోనే అడోడాక్
అడోడాక్ పూర్తిగా మొబైల్ ఆధారిత వ్యవస్థ. రిసీవర్స్‌కు సమాచారాన్ని చేరవేసే హాస్పిటల్‌లోని రిసెప్షనిస్టులు, అసిస్టెంట్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన యాప్. వీరిలో ఎక్కుమంది కంప్యూటర్స్ టచ్ చేయాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్స్, వాట్సాప్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సౌలభ్యం ఉంది.
ప్రస్తుతం అడోడాక్ లో వ్యవస్థాపకులతో పాటూ ఆరుగురు సభ్యులున్నారు. ముగ్గురు వ్యాపార విభాగంలోనూ, మరో ముగ్గురు టెక్ రంగంలోనూ పనిచేస్తున్నారు. డాక్టర్స్- పేషెంట్స్ మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తున్న అడోడాక్ విజయాన్ని సిద్ధార్థ, సత్యదీప్, సౌరభ్‌లు హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్నారు. అంతేకాక గొప్ప బృందాన్ని తయారుచేయడంపై దృష్టిపెట్టాలని తోటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిద్ధార్థ సూచిస్తుంటారు. సేల్స్ కంటే, సత్సంబంధాలు పెంచుకోవడం వల్లే వినియోగదారులను ఆకర్షించగలుగుతామని ధీమాతో చెబుతారు సిద్ధార్ధ. అలాంటివారే మన ఉత్పత్తులకు ధర్మోపదేశకులని చెప్తారు.