ఎంబీబీఎస్ వదిలేసి పర్యావరణ డాక్టర్ అయిన పురుషోత్తం రెడ్డి !
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఐదు దశాబ్దాల పోరాటంప్రజా ఉద్యమాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన పురుషోత్తం రెడ్డి
అది 1996వ సంవత్సరం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లాలోని ఒక గ్రామంలో రైతుల సమావేశమయ్యారు. నల్గొండ ప్రజల్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ఎలా విముక్తిపొందాలన్న దానిపై చర్చ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఫ్లోరోసిస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి నీరు ఎందుకు పనికొచ్చేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే జలం కాదది గరళం. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనం ఆ నీళ్లే తాగాల్సిన పరిస్థితి. ఫలితంగా నల్గొండ జిల్లాలో కొన్ని వందల మంది ఫ్లోరోసిస్ బారినపడ్డారు. పిల్లా పెద్ద, ముసలి ముతకా తేడా లేకుండా అందరూ ఫ్లోరోసిస్ శాపగ్రస్థులే. నీళ్లలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండటంతో పళ్లపై పచ్చని గార ఏర్పడేది. చాలా మంది చేతులు, కాళ్ల ఎముకలు వంకర్లు తిరిగాయి. విపరీతమైన కీళ్ల నొప్పులతో కనీసం చిన్న వస్తువును కూడా ఎత్తలేని దుస్థితి. ఫ్లోరోసిస్ నీటిని తాగడంతో వేలాది మందిని ఎముకలు, కండరాలు, కాలేయం, ఉదర సంబంధిత వ్యాధులు చుట్టుముట్టాయి. గర్భవతులపైనా ఫ్లోరోసిస్ తీవ్ర ప్రభావమే చూపింది. కలుషిత నీరు తాగడంతో మహిళల గర్భస్రావాలు పెరిగిపోయాయి. పంట సాగుకు ఫ్లోరోసిస్ నీరు మినహా ప్రత్యామ్నాయం లేకపోవడంతో లక్షల ఎకరాల భూమి బీడువారింది.
ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో రోజురోజుకూ ఫ్లోరోసిస్ పీడితుల సంఖ్య పెరిగింది. ఏం చేయాలో జనానికి అర్థం కాలేదు. సమస్యకు పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. సురక్షిత మంచినీటిని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా నల్గొండ జిల్లావ్యాప్తంగా చాలా మంది దివ్యాంగులుగా, నపుంసకులుగా మారారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు సమస్య గురించి తెలుసు. దాని తీవ్రత గురించి ఇంకా బాగా తెలుసు. అయినా పరిష్కారం చూపడంలో మీనమేషాలు లెక్కించారు. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తే సమస్య తీరిపోతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. దున్నపోతుపై వానపడ్డట్లు ఆ నిరసనల ప్రభావం ప్రభుత్వంపై ఏ మాత్రం కనిపించలేదు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు, గ్రామస్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ పద్దతిలో నిరసన తెలపాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ కు పొలిటికల్ సైన్స్ స్కాలర్ అయిన ఒక వ్యక్తి కూడా హాజరయ్యాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ తోచిన సలహా ఇచ్చారు. వాళ్లలో చాలా మంది ఫ్లోరోసిస్ పీడితులందరినీ ఒకచోట చేర్చి ధర్నా నిర్వహించాలన్న సూచన చేశారు.
పొలిటికల్ సైన్స్ స్కాలర్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. సమస్యను మరో దృక్కోణంలో చూసిన ఆయన చెప్పిన సలహా విని అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసిన జనం ఆయన చెప్పిన నిరసన పద్దతి గురించి ఇంత వరకు వినలేదు. చూడలేదు.
అప్పటికి లోక్ సభ రద్దైంది. ఎన్నికల నగారా మోగింది. ఇదే అదునుగా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ దేశం దృష్టిని నల్గొండ జిల్లా ఎదుర్కొంటున్న సమస్య వైపు ఆకర్షించే ఉపాయం చెప్పారాయన. నల్గొండ లోక్ సభ సీటు నుంచి వీలైనంత ఎక్కువ మంది ఫ్లోరోసిస్ బాధితులంతా పోటీ చేయాలన్నది ఆయన సూచన. అలా చేయడం వల్ల అందరి దృష్టి నల్గొండ వైపు మళ్లుతుందన్నది ఆయన అభిప్రాయం.
ఆయన చేసిన సూచన రైతులందరికీ నచ్చింది. వందల మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ తర్వాత 540మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం రికార్డ్. గతంలో ఏ లోక్ సభ సీటు కోసం ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు వేసిన దాఖలాలు కాలేదు. దీంతో సహజంగానే దేశం మొత్తం నల్గొండ వైపు ఆసక్తిగా చూసింది. నల్గొండలో ఫ్లోరోసిస్ రక్కసి గురించి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాల వైఫల్యం గురించి జాతియావత్తు తెలుసుకుంది. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో వారందరికీ కేటాయించేందుకు ఎన్నికల సంఘం వద్ద గుర్తులు లేవు. దీంతో నల్గొండ ఎంపీ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. నల్గొండలో ఎన్నికలు వాయిదా పడటానికి కారణమేంటన్న విషయం దేశ ప్రజలందరి దృష్టికి వెళ్లింది. ఫ్లోరోసిస్ కారణంగా నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి జనం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పరువు బజారున పడటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 3లక్షల ఎకరాకు సాగునీరు, 500 గ్రామాలకు సురక్షిత మంచినీటి సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది. రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పరిష్కారం దొరకని సమస్యకు ఒక వ్యక్తి ఇచ్చిన వినూత్నమైన సలహాతో పరిష్కారం దొరికింది. రైతులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపిన ఆ వ్యక్తి మరొవరో కాదు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, సామాజికవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఎన్నో ప్రజా ఆందోళనలకు నేతృత్వం వహించి విజయం సాధించిన పోరాటయోధుడు. పలు పోరాటాలకు నేతృత్వం వహించి విజయవంతం చేసిన వ్యక్తి. ప్రయోగాత్మకమే అయినా ఫలితాలిచ్చే సలహాలు సూచనలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన మేథావి. ఓర్పూనేర్పూ, రాజనీతిజ్ఞత, ఆలోచన, అనుభవాలను రంగరించి పలు ఉద్యమాలు నడిపారు పురుషోత్తం రెడ్డి.
“అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ఎన్నికల అధికారి టిఎన్ శేషన్ తమను మించిన వాళ్లెవరూ లేరని విర్రవీగేవారు. తమ ముందు ఇంకెవరూ కొరగారన్నది వాళ్ల భావన. అయితే ప్రజలు, ప్రజాస్వామ్య శక్తి ముందు వాళ్లు తలవంచక తప్పలేదు. శేషన్ ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకుని నల్గొండ ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి నల్గొండ ప్రజలకు ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోని రాజకీయ పార్టీలు, నాయకులపై నమ్మకం పోయింది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది నామినేషన్లు వేయండని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సలహా వారికి వింతగా తోచింది. అయితే అప్పటికే రకరకాల ఆందోళనలు, నిరసలు చేసి విసిగిపోయిన రైతన్నట్లు నామినేషన్ల రూపంలో ప్రభుత్వ వ్యతిరేకత చాటేందుకు అంగీకరించారు. కానీ రైతులు 500 రూపాయలు ఖర్చుచేసి నామినేషన్లు వేస్తారా అనే సందేహం కలిగింది. ఎన్నికల్లో గెలవమని, డిపాజిట్ గల్లంతవుతుందని అందరికీ తెలుసు. అయినా వారంతా 500 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఎన్నోసార్లు ఎరువులు వాడినా పంట చేతికి రాలేదు. ఫ్లోరోసిస్ పీడ వదిలించుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కాకపోతే మరోసారి ఎరువుల డబ్బు వృథా అయిందనుకుంటామన్న రైతుల మాట విని నోట మాట రాలేదు.”
నల్గొండ ప్రజల పోరాటం - విజయం ఎంతో సంతోషం కలిగించినా తన జీవితంలో ఇదే అతి పెద్ద విజయమని భావించనంటారు పురుషోత్తం రెడ్డి. రాజీవ్ గాంధీ హయాంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమం లేవనెత్తి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడమే తాను సాధించిన గొప్ప విజయమంటారు పురుషోత్తం రెడ్డి.
“కృష్టానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యాం అతిపెద్దది మాత్రమే కాదు, ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు కూడా. కేంద్ర ప్రభుత్వం ఈ డ్యాం దగ్గరలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన స్థల కేటాయింపులు పూర్తవడంతో పనులు ప్రారంభమమయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ పనులు అడ్డుకోవాలని నిర్ణయించుకున్నా. న్యూక్లియర్ ప్లాంట్ వల్ల పర్యావరణం, ప్రజా ఆరోగ్యానికి కలిగే ముప్పును ఊహించి ఆందోళనకు సిద్ధమయ్యాను. ప్లాంట్ కోసం కేటాయించిన స్థలానికి వెళ్లి పరిశీలించాను. డ్యాం పక్కనే న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే లక్షల మంది ప్రజల ప్రాణాలు గాల్లో దీపంగా మారినట్లేనన్న విషయం అర్థమైంది.”
న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రంతో పోరాటం చేయడం తన ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనికాదని పురుషోత్తం రెడ్డికి తెలుసు. అందుకు ప్రజల భాగస్వామ్యం కావాలి. అందుకోసం న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రమాదం పొంచిఉన్న గ్రామాలకు వెళ్లి ప్రజలకు పరిస్థితి వివరించి వారిలో చైతన్యం తెచ్చారు. గ్రామగ్రామాన సభలు నిర్వహించి న్యూక్లియర్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాలు జనానికి అర్థమయ్యేలా చేశారు. గ్రామస్థులు, రైతుల్లో ఆలోచన మొదలైంది.
శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. వారు రోబోయే ప్రమాదాన్ని గుర్తించారు. న్యూక్లియర్ ప్లాంట్ తమ జీవితాలను నాశనంచేస్తుందని అర్థచేసుకున్న జనం ఆందోళనలు మొదలుపెట్టారు. ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జనం ఉప్పెనలా ముందుకు కదిలారు. నిరసనలు ఊపందుకున్నాయి. ఆందోళన ఉద్యమంగా మారింది. పురుషోత్తం రెడ్డి చేపట్టిన ఈ ఆందోళనకు ప్రొఫెసర్ శివాజీ రావ్, గోవర్థన్ రెడ్డి, డా.కె. బాలగోపాల్ వంటి గొప్ప సామాజికవేత్తలు తమవంతు సాయం అందించారు. ప్రజాందోళనల ముందు కేంద్రం తలవంచక తప్పలేదు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గోవర్థన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామన్నది ఆ లేఖ సారాంశం.
“ఒకసారి ఉద్యమం మొదలుపెట్టాక వెనుదిరిగి చూడలేదు. అతి పెద్ద ఉద్యమంతో అంతకన్నా పెద్ద విజయం సాధించాం. ఇతర రాష్ట్రాల్లోనూ న్యూక్లియర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జనం ఆందోళనలు చేపట్టినా విజయం సాధించలేకపోయారు. కోటా, కైగా, కూడంకుళం తదితర ప్రాంత ప్రజలు ఆందోళనలు ఫలితం ఇవ్వలేదు.”-పురుషోత్తం రెడ్డి
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాదాపు ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ, ఇతర సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే ఉన్నారు. సమాజసేవను తన ధర్మంగా భావించే ఆయన ప్రజాసంక్షేమం, పర్యావరణ స్పృహ కల్పించే పలు కార్యక్రమాలు చేపట్టారు. బాల్యంలో తన తల్లిదండ్రులు నేర్పిన జీవిత పాఠాలే తనను ముందుకు నడిపాయంటారు పురుషోత్తం రెడ్డి.
1943 ఫిబ్రవరి 14వ తెలంగాణలోని ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు పురుషోత్తం రెడ్డి. తల్లి కౌసల్యదేవి, తండ్రి రాజా రెడ్డి. వాళ్లు తమ జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. దయానంద సరస్వతి, ఆచార్య అరవింద్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం వారిపై ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదానోద్యామానికి ప్రభావితులైన రాజా రెడ్డి వెయ్యి ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరో 3వేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారు.
“తల్లిదండ్రులు, కుటుంబ వాతావరణ ప్రభావం నాపై పడింది. నా తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు. వారి కలివిడితనం, దయా గుణం, సామాజిక సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి జీవితం సమాజానికో సందేశం. భూమి, ఆస్తుపాస్తులు గౌరవం పెంచవు. చదువే మనిషిని ప్రయోజకున్ని చేస్తాయని నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోలేదు.”
తండ్రి సూచన మేరకు పురుషోత్తం రెడ్డి చదువుపై శ్రద్ధ పెట్టారు. తెలివైన విద్యార్థి కావడంతో క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవారు. తన నడవడిక, ప్రతిభ కారణంగా ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి పట్ల ప్రత్యేక అభిమానం చూపేవారు. కష్టపడేతత్వం ఉన్న పురుషోత్తం రెడ్డికి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మెరిట్ ఆధారంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS సీటు దొరికింది. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన ఆయన మంచి మార్కులే తెచ్చుకునన్నారు. మరో రెండేళ్ల కోర్సు పూర్తైతే డాక్టర్ అవుతారు. అయితే కోర్సు థర్డ్ ఇయర్ లో ఉండగా పురుషోత్తం రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. MBBS కోర్సును వదిలి సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు పురుషోత్తం రెడ్డి. MBBS వదిలి పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరారు. పురుషోత్తం రెడ్డి నిర్ణయం గురించి తెలిసి చాలా మంది విస్తుపోయారు.
“డాక్టర్ గా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయలేననిపించింది. రాజనీతి గురించి తెలుసుకుంటే జనానికి ఎక్కువగా సాయం చేయగలననిపించింది. MBBS కోర్సు సాఫీగానే సాగుతున్న సమయంలోనే మనసు పొలిటికల్ సైన్స్ వైపు మళ్లింది. MBBS కోర్సు వదిలి BAలో జాయిన్ అయ్యాను. పొలిటికల్ సైన్స్ ను మెయిన్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నాను.
పొలిటికల్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్ గా బీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన పురుషోత్తం రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 30ఏళ్ల పాటు వేలాది మంది విద్యార్థులకు రాజనీతి పాఠాలు బోధించారు. కొన్నేళ్ల పాటు ఓయూ పొలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేసిన ఆయన బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షునిగానూ ఎన్నికయ్యారు.
ఓవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన రైతు, ప్రజా ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితుడయ్యాడు. తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి జనం ఆయన దగ్గరకు వచ్చేవారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం కోసం ఎలా ముందుకెళ్లాలన్న సూచనలు ఇచ్చేవారు పురుషోత్తం రెడ్డి. ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించిన ఆయన మరెన్నో ఆందోళనలకు ప్రేరణగా నిలిచారు. జనం బాగు కోసం ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారు.
పొలిటికల్ సైన్స్ స్కాలర్, ఏళ్ల తరబడి రాజనీతి పాఠాలు బోధించిన విద్య, సామాజికవేత్త పురుషోత్తం రెడ్డి పర్యావరణవేత్త, ప్రజా ఉద్యమకారుడిగా మారడానికి రెండు ఘటనలు కారణమంటారు పురుషోత్తం రెడ్డి. అందులో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఒకటి కాగా రెండోది తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు. ఈ రెండు ఘటనలు కూడా తనను ఎంతో బాధించాయని, అవే పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఉద్యమాన్నే జీవిత లక్ష్యంగా మార్చాయంటారు. పురుషోత్తం రెడ్డి సోదరుడు రైతు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవారు. ఆయన పొలానికి సరూర్ నగర్ చెరువు నుంచి నీళ్లు అందేవి. అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పరిశ్రమలతో చెరువు కాస్తా వేస్ట్ మెటీరియల్ డంప్ యార్డ్ గా మారిపోయింది. పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను చెరువులోకి వదలడంతో చెరువు కాలుష్యకాసారమైంది. కలుషిత నీటి కారణఁగా పరుషోత్తం రెడ్డి సోదరుని పొలంలో పంట దెబ్బతింది. బంగారు పంటలు పండే భూమి పనికిరాకుండా పోయింది. ఫలితంగా ఆదాయం తగ్గి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అవసరాలకు డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితిని చూసి కదిలిపోయిన పురుషోత్తం రెడ్డి పర్యావరణ పరిరక్షణకు జీవితం అంకితంచేయాలని డిసైడయ్యారు. సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం తెచ్చేందుకు తొలిసారి ఆందోళన బాట పట్టారు. దగ్గరి బంధువు, రేడియాలజిస్ట్ అయిన గోవర్థన్ రెడ్డి పురుషోత్తంకు అండగా నిలిచారు. ఎంతో మంది అధికారులను కలిసి పరిస్థితి వివరించారు. తొలుత అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కానీ పురుషోత్తం రెడ్డి ఆందోళనతో వారు మెట్టు దిగిరాక తప్పలేదు. ఆయన ఆందోళనతో సరూర్ నగర్ చెరువుకు మళ్లీ పునర్వైభవం వచ్చింది.
తొలి ప్రయత్నంలో సాధించిన విజయం పురుషోత్తం రెడ్డి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పర్యావరణ కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు, కార్ఖానాలపై పోరాటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆనవాళ్లు కోల్పోయేస్థితిలో ఉన్న ఎన్నో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత పురుషోత్తం రెడ్డి సొంతం.
ప్రజలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో పురుషోత్తం రెడ్డి పర్యారణానికి సంబంధిత పుస్తకాలు, రీసెర్చ్ గ్రంథాలను చదవడం మొదలుపెట్టారు. ఎంఫిల్ లో ప్రొఫెసర్ అరివింద్ ఫిలాసఫీపై రీసెర్చ్ చేశారు. ఇదే అంశంపై పీహెచ్ డీ చేయాలనుకున్నా.. సరూర్ నగర్ చెరువు కలుషితమవడం, కుటుంబంపై దాని ప్రభావాన్నిదృష్ట్యా ఎన్విరాన్ మెంటల్ పాలసీని సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. తాను సముపార్జించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడంతో పాటు జనాల్లో పర్యావరణ స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పని చేస్తున్నారు.
ప్రస్తుతం పురుషోత్తం రెడ్డి కోరుకుంటుంది ఒక్కటే. యువతకు పర్యావరణంపై అవగాహన కల్పించడం. యువత పర్యావరణ సమస్యల్ని అర్థం చేసుకుని దాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలన్నదే ఆయన ఆకాంక్ష. ఇందుకోసం 7పదుల వయసులోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణతో అతివృష్టి, అనావృష్టి, కార్చిచ్చు వంటి ప్రమాదాలను పారదోలొచ్చని చెప్పే పురుషోత్తం రెడ్డి ప్రకృతిని రక్షిస్తే దేశాన్ని కాపాడుకున్నట్లే అంటారు. పర్యావరణ పరిరక్షణకు మరో స్వాతంత్ర్య సంగ్రామం అవసరమనే ఆయన యువత మాత్రమే ఆ పోరాటాన్ని ప్రారంభించి విజయం సాధించగలరని నమ్ముతారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటికీ అభివృద్ధి అనే పదాన్ని సరిగా నిర్వచించలేదన్నది పురుషోత్తం రెడ్డి ఆరోపణ.
“ప్రభుత్వాలన్నీ పరిశ్రమలు, కార్ఖానాలు, రోడ్లు, భవనాల నిర్మాణమే అభివృద్ధి సూచికలుగా భావిస్తున్నాయి. కానీ ఇది తప్పు. పర్యావరణానికి హాని కలిగించే ఏ పనైనా ఎప్పటికీ నిజమైన అభివృద్ధి అనిపించుకోదు.” పురుషోత్తం రెడ్డి.
దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు విజయవంతం కాకపోవడానికి కారణం వాటిని నడిపే నాయకులే అంటారు పురుషోత్తం రెడ్డి.
“ప్రస్తుతం ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారు తమ పబ్లిసిటీపై తప్ప సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టడంలేదు. ఉద్యమం మొదలుపెట్టి తమకు కాస్త గుర్తింపురాగానే ఆ అంశాన్ని మర్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం మరో అంశాన్ని వెతుక్కుంటున్నారు. అందరూ ఇలాంటి వారే కాకపోయినా చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఉద్యమాలన్నీ నీరుగారిపోతున్నాయి.”
ఉద్యమకారులు తమను తాము హైలెట్ చేసుకునే బదులు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నది పురుషోత్తం రెడ్డి సూచన.