'హంటర్ ఫ్లాట్'తో విద్యార్థుల హాస్టల్ వేటకు ఫుల్ స్టాప్
ఉన్నత విద్య కోసం సప్తసముద్రాలైనా దాటి పోయే రోజులివి. కాస్త ఖర్చు ఎక్కువైనా తల్లితండ్రులు తమ పిల్లలను ఎంత దూరమైనా పంపించడానికి వెనుకాడరు. అయితే మంచి కాలేజీ అని చెప్పి ఊరు దాటిపోయినా.. అక్కడ ఉండడానికి తగిన వసతి, హాస్టల్ సదుపాయం లేకుంటే ఏ పిల్లలకైనా ఇబ్బందే. దేశంలో చాలా ప్రాంతాల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్నప్రధాన సమస్య ఇది. అయితే విద్యార్ధులు పడుతున్న ఈ కష్టాలనే తమ వ్యాపారానికి సోపానాలుగా చేసుకున్నారు ముగ్గురు యువ ఔత్సాహిక వ్యాపారులు.
IIT-JEE, AIEEE ఈ విద్యకు స్వర్గధామంగా పేర్కొనే రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో విద్యార్ధులకు హాస్టల్ సమాచారాన్ని అందిస్తూ లక్షల వ్యాపారం చేస్తున్నారు నితిన్, ధీరజ్, అభిషేక్ అనే యువకులు. చార్టెడ్ అకౌంటింగ్ విద్యను అభ్యసించి....రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఈ ముగ్గురు యువకులు కోటా ప్రాంతంలో విద్యార్ధులు హాస్టల్ వసతి, పేయింగ్ గెస్ట్ అవకాశాల కోసం పడుతున్న కష్టాలను దగ్గర నుంచి గమనించారు. అంతే హంటర్ ఫ్లాట్ డాట్ కామ్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి విద్యార్ధులకు అవసరమైన సదుపాయాల గురించి సమాచారం అందిస్తున్నారు.
కేవలం మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ వెబ్ సైట్ కోటాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని హాస్టళ్లు, అక్కడి సదుపాయాల గురించి సమస్త సమాచారం ఉంచుతున్నారు.
కోటాలో ఇంజనీరింగ్ చదవాలని భావించే విద్యార్ధులు హంటర్ ఫ్లాట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్లోకి వెళితే అకామిడేషన్ సదుపాయం గురించి తెలుసుకోవచ్చు. అది కూడా విద్యార్ధులకు సౌకర్యంగా ఉందని భావించిన వాటికే ఈ వెబ్ సైట్లో చోటు కల్పిస్తున్నారు. ఇందుకోసం ఈ యువత్రయం ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు కోటా చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న హాస్టళ్ల గురించి ఆరా తీసి వాటి వివరాలను హంటర్ ఫ్లాట్ డాట్ కామ్ వారికి అందజేస్తుంది. దాని ఆధారంగా హాస్టల్ ధర, అక్కడ అందజేసే ఆహారం, వసతి... వంటి సమగ్ర సమాచారాన్ని వెబ్ సైట్లో పొందుపరుస్తారు. కోటా చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 4వేల హాస్టళ్లు ఉన్నాయి. వీటి ఇన్ఫర్మేషనంతా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.
ఆరు నెలల్లోనే..
ఏడు నెలల క్రితం ప్రారంభమైన ఈ వెబ్ సైట్‌ను ప్రతి రోజూ 2వందల మంది వరకూ సందర్శిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ సమయంలో ఇది మరింత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ వెబ్ సైట్ తమ ఆదాయం, విస్తరణ కోసం ఇప్పటికే ఓ ప్లాన్ రూపొందించుకుంది. కోటా ప్రాంతంలో హాస్టళ్లకు చెందిన ప్రకటనలను వెబ్ సైట్లో ఉంచి తద్వారా ఆదాయం పొందాలని వీరి ప్లాన్. అంతే కాకుండా మరింత మంది కస్టమర్లు, విద్యార్ధులకు చేరువయ్యేందుకు మొబైల్ యాప్ తీసుకురావడంతో పాటు గూగుల్, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసే యోచనలో ఉన్నారు. కోటాలో ఐఐటీ-జెఈఈ, ఆలిండియా త్రిపుల్ ఐటీ విద్యకు సంబంధించి ప్రతి ఏటా 3వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉన్న అవకాశాల పరంగా తమ వెబ్ సైట్‌కు మంచి భవిష్యత్తు ఉందని నితిశ్, ధీరజ్, అభిషేక్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమ వెబ్ సైట్ విజయవంతంగా నడుస్తున్నా...... ప్రారంభంలో వీరూ కొన్ని సమస్యలను ఎదుర్కొన్న వారే.
సాంకేతికంగా, ఆర్ధికంగా వీరికి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. మొదట్లో ఈ సమస్య విషయంలో ఆందోళన ఏర్పడ్డా అలీ బాబా డాట్ కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు నితిన్, ధీరజ్, అభిషేక్ లు. కేవలం ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తూ.....కంప్యూటర్, వెబ్సైట్ టెక్నాలజీ మీద ఏమాత్రం అవగాహన లేని జాక్ మా చైనాలో అత్యంత ధనవంతుడిగా అవతరించిన క్రమం తమ వ్యాపారానికి స్ఫూర్తిదాయకం అంటారు వీరు. టెక్నాలజీ సమస్యల విషయంలో తమ బంధువుల్లో ఆ రంగంలో పని చేస్తున్న వారి సలహాలు స్వీకరించారు. వాటితోనే వెబ్ సైట్ నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమిస్తున్నామని చెబుతారు. కొత్తగా స్టార్టప్‌లు, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అమెజాన్ డాట్ కామ్ విజయం ఓ స్ఫూర్తి మంత్రం అని... సవాళ్లు ఎదురైనా జంకకుండా..... ధైర్యంగా నిలబడితే ఏ వ్యాపార సంస్థదైనా ఓ విజయ యాత్రే అంటారు ఈ యవత్రయం.