కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర. మనిషికి ఈ రెండూ చాలంటారు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిద్ర దెబ్బతింది. నిజానికి నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. అందుకే నిద్ర ప్రతి ఒక్కరూ తగినంత నిద్రపోవాలంటారు. తిండి తినకపోతే ఆకలేస్తుంది. కానీ నిద్ర లేకపోతే మనిషికి పిచ్చిపడుతుంది. నిద్రకున్న ప్రాధాన్యమేమిటో రక్షణ రంగానికి తెలిసినంత ఇంకెవరికీ తెలియదేమో. ఎయిర్‌ఫోర్స్‌లో కంటి నిండా నిద్రపోని వారిని ప్లైట్ నడిపేందుకు అనుమతించరు. చాలాసార్లు మనం ఎంత కష్టపడ్డా టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతాం. నిద్రను త్యాగం చేసి పని చేసినా ఫలితం మాత్రం దక్కదు. అందుకు కారణం నిద్రలేమి.
నిద్రలేమితో మనిషిలో చురుకుదనం లోపిస్తుంది. అందుకే మనం సరిపడినంతగా నిద్రపోవాలి. నికోలా టెస్లా లాంటి గొప్ప వ్యక్తులు కొన్ని గంటలకు ఒకసారి కునుకు తీసేవారు. మరి అది వారికెలా సాధ్యమైంది? వారి శరీరధర్మానికి మనకు తేడా ఉందా? ఈ విషయం అర్థంకావాలంటే ముందు నిద్ర గురించి తెలుసుకోవాలి.
నిద్ర దశలు
ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM)
నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (NREM)
మనం ప్రతిరోజూ ఆరేడు గంటలపాటు పడుకుని రాత్రంతా నిద్ర పోయాం అనుకుంటాం. కానీ నిజానికి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి మనకు తెలియకుండానే మేలుకుంటూ ఉంటాం. ఈ స్లీప్ సైకిల్ మనం నిద్రపోతున్నంతసేపూ నడుస్తూనే ఉంటుంది. స్లీప్ సైకిల్‌లో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అనే రెండు దశలు పునరావృతం అవుతుంటాయి. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌ను నాలుగు దశలుగా విభజిస్తారు. అయితే ఈ నాలుగు దశలు ఒకదాని తర్వాత మరొకటి జరగవు. NREM తర్వాత REM స్లీప్‌లోకి వెళ్తాం. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్‌లో శరీరంలోని కండరాలన్నీ అచేతనంగా మారతాయి. ఈ దశలోనే కలలు వస్తాయి. REM స్లీప్‌పై ఇంకా పూర్తిగా అధ్యయనం జరగలేదు. అయితే REM స్లీప్ మనిషిని రీఛార్జ్ చేస్తుందని మాత్రం రుజువైంది.
స్లీపింగ్ ప్యాటర్న్స్ విషయానికొస్తే ఇందులో ఐదు స్లీప్ సైకిల్స్ ఉంటాయి. అయితే మనలో చాలా మంది మోనోఫేజిక్ స్లీప్ సైకిల్‌ను మాత్రమే ఫాలో అవుతాం. మిగతా నాలుగు స్లీప్ సైకిల్స్‌ను పాలీఫేజిక్ స్లీప్ సైకిల్స్ అంటారు. మోనోఫేజిక్ స్లీప్ సైకిల్స్‌లో మనం ఒక దశలోనే నిద్రపోతే.. పాలీఫేజిక్ స్లీప్ సైకిల్స్‌లో నిద్ర వివిధ దశల్లో ఉంటుంది.
పాలీఫేజిక్ స్లీప్ సైకిల్స్ రకాలు
బైఫేజిక్ సైకిల్ - బైఫేజిక్ సైకిల్‌లో రెండు స్లీపింగ్ సైకిల్స్ ఉంటాయి. ఇందులో రాత్రి 4-5 గంటల కోర్ నాప్ (కునుకు), మధ్యాహ్నం 90 నిమిషాల నాప్ (కునుకు) ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది తమకు తెలియకుండానే ఈ సైకిల్‌ను ఫాలో అవుతున్నారు.
ఎవ్రీమేన్ సైకిల్ - బైఫేజిక్ సైకిల్‌తో పోలిస్తే ఎవ్రీ మేన్ సైకిల్ కొంచెం క్లిష్టమైనది. ఇందులో మూడు గంటల కోర్ నాప్ తో పాటు 20 నిమిషాల చొప్పున మూడు నాప్స్ ఉంటాయి. 20నిమిషాల పాటు ఉండే ఈ 3 నాప్స్ మనల్ని నేరుగా REM స్లీప్‌లోకి తీసుకెళ్తాయి.
ఉబర్‌మేన్ సైకిల్ - ఉబర్‌మేన్ సైకిల్ మిగతా వాటితో పోలిస్తే అత్యంత క్లిషమైంది. ఇందులో కోర్ స్లీపింగ్ టైం ఉండదు. ఉబర్‌మేన్ సైకిల్‌లో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి 20-30 నిమిషాల చొప్పున ఆరుసార్లు కనుకు తీయాల్సి ఉంటుంది. ఈ దశలోకి వెళ్లడం చాలా కష్టమే కాదు మనిషి అలిసిపోతాడు కూడా. స్టీవ్ పావ్‌లినా అనే ఓ బ్లాగర్ తన ఫ్యామిలీ మెంబర్స్ లాగే మోనోఫేజిక్ స్లీప్‌లోకి వెళ్లే ముందు కొన్ని నెలలపాటు ఉబర్‌మేన్ సైకిల్‌ను ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
డైమాక్సియన్ సైకిల్ – ఇది కూడా ఉబర్‌మేన్ సైకిల్ ను పోలి ఉంటుంది. కానీ ఇందులో నాప్స్ సంఖ్య ఆరింటికి బదులు నాలుగే ఉంటాయి. ఇందులో వ్యక్తి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి 30 నిమిషాల పాటు కునుకు తీయాలి. నాలుగు నాప్స్ కలిపి 2గంటల పాటు నిద్రపోతారు. బక్‌మిన్‌స్టర్ ఫుల్లర్ ఈ సైకిల్‌ను కనుగొన్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన దీన్ని కొనసాగించారు. వరల్డ్ వార్ 2లో విజయం సాధించేందుకు ఈ స్లీప్ సైకిల్‌ను ఫాలో కావాలని ఆయన అమెరికాకు సూచించారు.
స్లీపింగ్ షెడ్యూల్‌ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఫుల్ డైమాక్సియన్‌లోకి వెళ్లడమనేది అత్యంత అరుదు. ఏదేమైనా నిద్రను నిర్లక్ష్యం చేస్తే అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. పని ఎప్పుడూ ఉంటుంది. అలాగని నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. పనికి అనుగుణంగా స్లీపింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటే మార్పు దానంతట అదే కనిపిస్తుంది.