కార్ గ్యారేజ్‌లో మొదలైన ల్యాబ్.. ఇవాళ 2వేల కోట్ల వ్యాపారమైంది!
కార్ గ్యారేజ్ నుంచి మొదలైన ఒక వ్యాపారం.. ఇవాళ్టి రోజున ఖండాంతరాలకు వ్యాపించింది. మూడు దశాబ్దాల క్రితం.. "ఒకే ఒక్కడు" నాటిన బీజం మహావృక్షంలా తయారై వేలమందికి ఆశ్రయం కల్పిస్తోంది. ఒకొక్క కొమ్మను చేర్చుకుంటూ విస్తరిస్తూ పోతోంది. డా.సుశీల్ షా మొదలుపెట్టిన వ్యాపారాన్ని రూ.2వేల కోట్ల సామ్రాజ్యంగా మార్చేశారు ఆయన కూతురు అమీరా షా!
1980లో మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత డా.సుశీల్ షా.. భారతదేశంలో మెడికల్ రంగంలోని లోపాలను, ముఖ్యంగా మెడికల్ టెస్ట్‌లు జరిపే విధానంలోని తప్పులను గమనించారు. మార్కెట్‌లో అత్యున్నతమైన టెక్నాలజీతో తన పేషెంట్లను ట్రీట్ చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. వెంటనే ఫెల్లోషిప్‌పై అమెరికా వెళ్లి విధివిధానాలను నిశితంగా పరిశీలించారు. ఇండియా తిరిగి వచ్చి తన గ్యారేజ్ లోనే డా.సుశీల్ షా లేబొరేటరీ పేరుతో సొంత ఫాథాలజీ లేబొరేటరీ స్ధాపించారు.
“ఇవాళ హైబ్రిడ్ టెస్ట్‌లు, ఫర్టిలిటీ టెస్ట్‌లు, హార్మోన్ టెస్ట్‌ల గురించి మాట్లాడుతున్నాం. 80ల్లో అవేమీ అసలు ఇండియాలోనే లేవు. ఆయనే మొట్టమొదటగా వాటిని ప్రవేశపెట్టారు. ఏమీ తెలియని వాళ్లను పెట్టుకుని వాళ్లకు స్కిల్ నేర్పించారు” అని సుశీల్ కూతురు అమీరా షా గర్వంగా చెప్తున్నారు.
35 ఏళ్ల అమీరా.. ఇవాళ ఒక గ్లోబల్ పాధాలజీ సామ్రాజ్యానికి అధినేత్రిగా ఉన్నారు. గ్యారేజ్ లో మొదలుపెట్టిన చిన్నవ్యాపారాన్ని రూ.2000కోట్ల రూపాయల కంపెనీ స్ధాయికి తీసుకువెళ్లారు. 21 ఏళ్ల వయసులో భవిష్యత్తులో ఏమవ్వాలో అని ఆలోచించిన అదే వ్యక్తి ఇప్పుడు సక్సెస్ రుచిచూస్తున్నారు.
జీవింతో ఏం చేయాలి?
“ న్యూయార్క్‌లో గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌తో పనిచేస్తున్నాను. అది చాలా గౌరవప్రదమైన ఉద్యోగం, నా మిత్రులంతా నా స్ధితిని చూసి అసూయ పడ్డారు. కానీ.. అవేమీ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. న్యూయార్క్‌లో ఉండటం బానే ఉంది కానీ.. ఎందుకో ఒక రకంగా అనిపించేది. ఏ సమయంలో కూడా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉండేది కాదు.” అంటారు అమీరా. అందుకే.. ఆమె తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఐదుగురు ఉద్యోగస్తులతో ఒక స్టార్టప్ మొదలుపెట్టారు.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేవారామె. కానీ.. 21 ఏళ్ల వయసులో తమ అభిప్రాయాలను పంచుకుంటే ఎవరూ వినేవాళ్లు కాదు.. సీరియస్‌గా తీసుకునేవాళ్లు కాదు. అందుకే.. ఆమె తన తండ్రిని సలహా అడిగింది. ఎగ్జిక్యూటివ్ కావాలనుకుందా? ఆంట్రప్రెన్యూర్ కావాలనుందా అని అడిగారాయన. “రెండిటికీ తేడా ఏంటి“ అని ఆమె ఎదురుప్రశ్న వేసింది.
ఎగ్జిక్యూటివా? ఆంట్రప్రెన్యూరా?
“ మొదట మంచి కెరీర్ ఉండాలి. ప్రెస్టీజ్‌తో పాటు మంచి జీతం రావాలి. అదే కావాలని అనుకుంటే అమెరికాలో ఉండిపోవాలి. అలా కాకుండా.. ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటే.. ఒక కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా నడపగలవనే నమ్మకం ఉంటే మాత్రం ఇండియాకు తిరిగి రావాలి“ అని సుశీల్ తన కూతురికి సలహా ఇచ్చారు.ఈ మాటతో 2001లో అమీరా ఇండియా తిరిగి వచ్చేశారు.
“నేను తీసుకున్న నిర్ణయం చాలామందికి నచ్చలేదు. ఆంట్రప్రెన్యూర్‌షిప్ ఇప్పటిలా లేదు. నేనూ ఇండియాలో పనిచేయలేదు. నాన్నగారి ల్యాబ్ కేవలం ఆయన మీద ఆధారపడే నడుస్తోంది. అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకునేవారు. కంప్యూటర్లు లేవు, ఈ మెయిల్స్ లేవు, సిస్టమ్‌లు.. ఇలా ఏదీ ఉండేది కాదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ల్యాండ్ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవారు"అని గుర్తుచేసుకుంటున్నారు అమీరా
25 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే డా.సుశీల్ కుమార్ లేబొరేటరీ దక్షిణముంబైలో 1500 చదరపు అడుగుల్లో మొదలైంది. మంచి క్లయింట్స్‌ను, మంచి పేరునూ సంపాదించుకుంది. కానీ.. ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు. "దక్షిణ ముంబై దాటి ఎవరికీ మా ల్యాబ్ గురించి తెలియదు. కానీ.. ఎప్పటికైనా ఇండియాలో లేబోరేటరీల చైన్ పెట్టాలన్నది నాన్నగారి ఆశయం” అంటారు అమీనా.
సంస్కరణ మొదలైంది..!
తండ్రి ఇచ్చిన మనోధైర్యంతో అమీనా రంగంలోకి దిగారు. ప్రతీదీ నాన్నగారే చూసుకునే స్ధాయి నుంచి దాన్ని ఒక కంపెనీ స్ధాయికి తీసుకువెళ్లాలన్నది గోల్. కొత్త వాళ్లను తీసుకున్నారు. కొత్త డిపార్ట్‌మెంట్స్ తయారుచేశారు. కమ్యూనికేషన్ వ్యవస్ధను పూర్తిగా మార్చేశారు. అంతా కొత్త అయిన్పటికీ అమీనా సొంతగా క్యాష్ స్టేట్‌మెంట్లు ఎలా చేయాలి దగ్గర్నుంచి ప్రతీదీ నేర్చేసుకున్నారు.పెద్దపెద్ద జీతాలివ్వలేకపోయినా.. పనిచేసేవాళ్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగారు. పేషెంట్లు ఎక్కువ సమస్యాత్మకంగా భావించే కస్టమర్ కేర్ దగ్గర్నుంచి ప్రక్షాళన మొదలయింది. అలా ఒకొక్క సమస్యనూ పరిష్కరిస్తూ కంపెనీని ఒక ఫామ్‌లోకి తీసుకురావడానికి కొన్నేళ్లు పట్టింది.
విస్తరణ
రెండేళ్ల తర్వాత కంపెనీ అభివృద్ధిపై అమీనా దృష్టిపెట్టారు. దక్షిణ ముంబైలో అప్పటికే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కంపెనీ పేరును మెట్రోపోలిస్‌గా మార్చారు. ఆ సమయానికి మల్టీనేషనల్ కంపెనీల పోటీ మొదలయింది. దీంతో.. చిన్న చిన్న లేబోరేటరీలను మెట్రోపోలిస్ బ్రాండ్ కిందకు తీసుకువచ్చారు. 2004లో చెన్నయ్‌లోని పాథాలజిస్ట్ డా.శ్రీనివాసన్‌తో మోట్రోపోలిస్ మొట్టమొదటి పార్ట్‌నర్‌షిప్ డీల్‌పై సంతకం చేసింది ఇప్పటికి అలా 25 ల్యాబ్‌లు మెట్రోపోలిస్ కింద పనిచేస్తున్నాయి.
ఐసీఐసీఐ వెంచర్స్ ద్వారా 2006లో మెట్రోపోలిస్ మొట్టమొదటిసారిగా ఫండింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత 2010లో వార్ బర్గ్ పిన్‌కస్ అనే అమెరికన్ గ్లోబల్ ఈక్విటీ సంస్థ.. ఇదే కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసింది.2002లో 40 నుంచి 50మంది ఉద్యోగులతో ఏడు కోట్ల రెవెన్యూ ఉన్న అదే కంపెనీ.. 13 ఏళ్లకు 7 దేశాల్లో 800 సెంటర్లలో 125 ల్యాబొరేటరీలతో రూ.2000 కోట్ల కంపెనీగా ఎదిగింది. ప్రతీ ఏడాది కనీసం రూ.500కోట్ల రెవెన్యూ సాధిస్తోంది.
అంతర్జాతీయంగా ఎదగడం..
”భారతదేశం దాటి కంపెనీ ఏర్పాటు చేయడమనేది పూర్తిగా అవకాశవాదమనే చెప్పాలి. అప్పటికి ఇండియాలో కాదు.. కనీసం ముంబై, చెన్నయ్, కేరళ దాటి బ్రాంచీలు పెట్టలేదు. శ్రీలంకలో విస్తరించడానికి ఒక అవకాశం వచ్చింది. ఇండియాలో మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. 2005లో అక్కడ ఏర్పాటుచేశాం. ఎలా వెళ్లినా కూడా ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అయింది. 2006లో మధ్య ప్రాచ్యంలో.. 2007లో ఆఫ్రికాలో కూడా ఇలానే అవకాశాలు వచ్చాయి.” అంటారు అమీన్.
మెట్రోపోలిస్‌లో వివిధ రకాల సంస్కృతి సంప్రదాయాల మనుషులతో పనిచేయడం అంటే అమీనాకు ఎంతో ఇష్టం. ప్రతీ మార్కెట్ దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది. శ్రీలంక ప్రశాంతంగా ఉంటుంది. మధ్యప్రాచ్యం ఇంకో రకం. ఆఫ్రికాలో ఒకొక్క దేశం ఒక్కొ రకంగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో అన్నీ ప్రొఫెషనల్‌గా జరుగుతాయి అంటారామె.
ఫెయిల్యూర్స్.
వ్యాపారపరంగా దూసుకెళుతున్న మెట్రోపోలిస్‌కు కొన్ని అవాంతరాలూ ఎదురయ్యాయి.“ కొన్ని పార్ట్‌నర్‌షిప్‌లు వర్కవుట్ అయితే కొన్ని అవ్వలేదు. అసలు అవి వర్కవుట్ అవుతాయో లేదో జడ్జ్ చేయడంలో తప్పులు దొర్లాయి.” అంటారు అమీనా. కానీ.. అలా జరగడం వల్లనే కొత్త విషయాలు నేర్చుకున్నానని, కంపెనీ ఈ స్ధాయిలో ఉంది అంటారామె.
భవిష్యత్తు
ఇన్నేళ్లూ ఉద్యోగులు, డిస్ట్రిబ్యూషన్, నెట్‌వర్క్, సేల్స్‌పై దృష్టిపెట్టిన మెట్రోపోలిస్.. ఇప్పుడు తమ పనికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురుచూస్తోంది.
“ మా కస్టమర్ల ప్రవర్తనలో మార్పు వస్తోంది. వాళ్ల ఆలోచనావిధానం మారుతోంది. అందుకు తగ్గట్టుగా మమ్మల్ని మేం మార్చుకుంటాం. మిగతా దేశాల్లోనూ మెట్రోపొలిస్ బ్రాండ్ ఉండాలన్నదే నా ఆశయం” అంటారు అమీరా