సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని లెక్కగడ్తున్న 'కర్మ సర్కిల్స్'
"పని చేయండి, ఫలితం గురించి ఆశించకండి."
ఈ మాటలను మన పెద్దలు ఎన్నిసార్లు చెప్పి ఉంటారో ఆలోచించండి. చాలాసార్లే చెప్పి ఉంటారు కదూ. అయితే.. దీన్ని వాస్తవంగా ఆచరణలో పెట్టిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పగలరా ?
ఆలోచించడానికి కూడా ఇష్టపడకుండా.. ఈ టాపిక్‌ని ఇంతటితో నిర్లక్ష్యంగా వదిలేస్తాం. కానీ దీపక్ గోయల్‌కు వ్యక్తిగత ప్రేరణను ఇచ్చిన విషయం ఇది. సాంకేతిక రంగంలో ఒక వినూత్నమైన, విభిన్నమైన సమ్మేళనానికి ఇది నాంది పలికింది.
కర్మ సర్కిల్స్ ద్వారా ఇతర వ్యక్తులకు సహాయం చేయడం, సాయం పొందడం సులభమయింది. అది కూడా ఉచితంగా కావడం విశేషం.
ఫలితం ఆశించకుండా పని చేయడాన్ని నమ్మిన దీపక్‌కి.. దీని ద్వారా చాలా మేలు జరిగిందనే చెప్పాలి. ఏడేళ్లుగా సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ వ్యవస్థను నిర్వహించడంంతో 400లకు పైగా స్టార్టప్‌లను ఏంజెల్ ఇన్వెస్టర్ల దగ్గరకు చేర్చడంలో సక్సెస్ సాధించారు దీపక్.
లింక్డ్‌ఇన్ వెర్షన్ 2.0
లింక్డ్ఇన్‌కు కర్మ సర్కిల్స్ అదనపు లేయర్ లాంటిది అంటారు దీపక్. అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా దృష్టి పెట్టని పలు అంశాలను వెల్లడించేందుకు కర్మ సర్కిల్స్ కృషి చేస్తోందని చెబ్తారాయన.
లింక్డ్ఇన్ ప్లాట్‌ఫాంకు వాల్యూ ఎడిషన్ మాదిరిగా పని చేయడంపై తగిన వివరణ ఇస్తున్నారు దీపక్.
“షేర్డ్ ఎకానమీ చాలా బలమైన వ్యవస్థ. దీన్ని కార్యరూపంలోకి తెచ్చి ప్రొఫెషనల్ సలహాలను ఇచ్చేందుకు కర్మ సర్కిల్స్ ప్రయత్నిస్తోంది. ఇతరుల నుంచి సాయం పొంది, వారి నైపుణ్యాలను ఎండార్స్ చేయడం ద్వారా.. ఆయా వ్యక్తుల సామర్ధ్యాలు ప్రపంచానికి చాటి చెప్పచ్చు. అంతే కాదు.. ఎవరికి ఎవరు సహాయం చేశారనే విషయం బాహాటంగా ఉంటుంది. లింక్డ్‌ఇన్ మాదిరిగా ఒకరి నైపుణ్యాన్ని ఎండార్స్ చేసేందుకు వారితో కనెక్ట్ అయి తీరాలన్న నిబంధన లేదు. దీని ద్వారా ఆయా వ్యక్తుల ఆన్‌లైన్ ప్రతిష్ట గణనీయంగా పెరుగుతోంది. ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే ఎండార్స్‌మెంట్స్ ఉండాలన్న నిబంధనకు ఇది పూర్తి వ్యతిరేకం”అని చెప్పారు దీపక్.
అయితే సహాయం ఇచ్చి పుచ్చుకునే ప్లాట్‌ఫాంను తయారు చేయడం ద్వారా.. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పుచ్చుకోవచ్చని విశ్వసిస్తారు దీపక్. వ్యక్తిగత స్కోర్ పెంచుకోవడం ద్వారా సహాయం చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని చెబ్తున్నారాయన. ఈ ప్లాట్‌ఫాంలో కర్మ స్కోర్స్ చాలా ముఖ్యమైన విషయం.
సహాయం పొందిన వారు యోగ్యతా పత్రాలను రాయడం, నైపుణ్యాలకు ఆమోదం పలకడం, కర్మ పాయింట్స్‌ను అందించగలుగుతారు. దీని ద్వారా సహాయం అందిస్తున్న వారికి ఆన్‌లైన్ రెప్యుటేషన్ పెరుగుతుంది.
ఎలా పని చేస్తుంది ?
కర్మ సర్కిల్స్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవానికి ఓ ఉదాహరణ చెప్పుకుందాం. 'ఏ', 'బీ' అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. ఒకవేళ 'ఏ' కనుక 'బీ' కి సహాయం చేస్తే.. తరువాత తనకు 'ఏ' సాయం కావాలన్నా 'బి'ని అడగగలుగుతాడు. ఈ క్వైరీని 'ఏ' హెల్ప్ చేసిన వ్యక్తులకు మాత్రమే కాకుండా.. 'ఏ' సహాయం చేసిన వారి నుంచి హెల్ప్ పొందిన వారు కూడా రిసీవ్ చేసుకోగలరు. అలాగే 'బీ' కి సాయం చేసినవారు, 'బీ' ద్వారా సహాయం పొందిన వారు కూడా 'ఏ' అడిగే ఎంక్వైరీని చూడగలుగుతారు.
“సాధారణంగా నిజ జీవితంలో మనం అనుసరించే విధానం ఇలాగే ఉంటుంది. దీన్ని మేం ఆన్‌లైన్‌లోకి తెచ్చాం. ఏదైనా సమస్యలో ఉంటే మన నుంచి సహాయం పొందిన వారి నుంచి హెల్ప్ తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. వారు కూడా తాము ఎవరికైతే సహాయం చేశారో.. వారి నుంచి ఏదైనా తిరిగి తీసుకోవాలని ఆలోచిస్తారు” అంటున్నారు దీపక్.
ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికి అయినా ఎటువంటి అపాయింట్మెంట్, కనెక్షన్ లేకపోయినా మెసేజ్ చేయగల అవకాశాన్ని కర్మ సర్కిల్స్ ప్లాట్‌ఫాం అందిస్తుంది.
వేదాంతం కాదు సిద్ధాంతం ఇది
వ్యక్తిగతంగా దీపక్ నమ్మకాలను వ్యాపారంలోనూ అనుసరించడం విశేషం. స్వధర్మ సిద్ధాంతాల ఆధారంగా కర్మ సర్కిల్స్ నడుచుకుంటోంది. మనిషికి మనిషి సాయం చేసుకోవడంలో ఎలాంటి స్వలాభం చూసుకోకూడదని, ఇది నిరంతరాయంగా సాగాల్సిన ప్రక్రియ అంటుంది కర్మ సర్కిల్స్. ఆయా వ్యక్తులకే ప్రత్యేకమైన సలహాలు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తోంది.
వర్తమానం, భవిష్యత్తు
ప్రస్తుతం ఆరుగురు వ్యక్తుల టీం ఉన్న కర్మ సర్కిల్స్‌కు.. ఎటువంటి నిలకడైన ఆదాయ మార్గం లేదు. ప్రస్తుతానికి దీన్నో సామాజిక సంస్థగా వారు చెప్తున్నారు. 2017వరకూ ఈ ప్లాట్‌ఫాంలో మార్పులు చేసే ఉద్దేశ్యం నిర్వాహకులకు లేదు. పూర్తిగా సొంత నిధులతో నిర్వహిస్తున్న కర్మ సర్కిల్స్.. స్టార్టప్ వ్యవస్థలో పేరొందిన 18మంది వ్యక్తుల నెట్వర్క్‌ను కలిగి ఉంది. సలహాలు ఇవ్వగల, సహాయం చేయగల స్థాయి ఉన్న వ్యక్తులను మరింతమందిని తమ ప్లాట్‌ఫాంకి చేరువ చేసేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న నెట్వర్క్‌ని పరిశీలిస్తే.. 90 శాతం సాయం చేసేవాళ్లు కాగా.. కేవలం 10శాతం మంది మాత్రమే హెల్ప్ ఆశించే వారు కావడం విశేషం. ప్రస్తుతం ఈసైట్‌కు నెలకు 3వేల మంది విజిటర్స్ ఉండగా.. 2016 ప్రారంభానికి ఈ సంఖ్యను 8వేలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రారంభించి నాలుగు నెలలు అవుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదని దీపక్ అంగీకరిస్తున్నారు. కస్టమర్లను అర్ధం చేసుకోవడానికి మరింతగా కృషి చేస్తామని చెప్పారాయన. మరో నెలరోజుల్లో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై యాప్‌ను లాంఛ్ చేయనుండడంతో.. ఈ వెంచర్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. యూజర్ ఇంటర్‌ఫేజ్‌ను పూర్తిగా మార్చిన ఐఓఎస్ ప్లాట్‌ఫాం యాప్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. సమాచార వ్యవస్థను మరింత పకడ్బందీగా ఉపయోగించుకోవాలన్నది వీరి ఆలోచన.
కర్మ ఫీడ్ అనే డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీపక్. దీనిలో కార్పొరేట్లను సలహాదారులు, మార్గదర్శకులుగా చేయాలన్నది ఆయన ఆలోచన. మీటింగ్ షెడ్యూల్స్, ఛాటింగ్ వంటి సౌకర్యాలను అందించడం ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు మరింత వీలు కల్పించబోతున్నారు కూడా.
యాప్ లాంఛ్ తర్వాత యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు దీపక్.
“కర్మ సర్కిల్స్‌కి నా జీవితానికి దగ్గరి సంబంధం ఉంది. ఇతరులకు సహాయం చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఎవరికైనా ఉపయోగపడితే.. నాకు ఆనందం కలుగుతుంది. నా ప్లాట్‌ఫాం ద్వారా నేను సాధించాలని అనుకుంటున్నది ఇదే” అంటూ తన వెంచర్ గురించిన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటూ దీపక్ సెలవు తీసుకున్నారు.