సైంటిస్టుగా మారిన మెదక్ జిల్లా రైతు..

సైంటిస్టుగా మారిన మెదక్ జిల్లా రైతు..

Saturday April 02, 2016,

4 min Read


అద్భుతాలెప్పుడూ అంతే! ముందు చెప్తే ఎవరూ నమ్మరు!! చేసి చూపిస్తే అంతా శెభాష్ అని వీపు చరుస్తారు! ఒక సాదాసీదా రైతు అలాంటి అద్భుతమే చేశాడు! స్టోరీ మొత్తం చదివాక అతని బుర్రలో ఇన్ని తెలివితేటలున్నాయా! అని ఆశ్చర్యపోతారు!! ఇలాంటి ఆలోచన చదువుకున్న మనకెందుకు రాలేదా..?! అని అనుకుంటారు!!

మెదక్ జిల్లా పుల్కల్ మండలం తాడ్ దాన్ పల్లి. ఆ ఊరికి వెళ్లి రామచంద్రయ్య ఇల్లు ఎక్కడ అని ఎవరినైనా అడగండి! వాళ్లకు ఎంత పనున్నా సరే.. మిమ్మల్ని దగ్గరుండి మరీ అతని ఇంటిదగ్గర వదిలేసి వస్తారు! అంత ఫేమస్!! కాదు కాదు.. అంత అభిమానం!!  రామచంద్రయ్య ఇంట్లోకి అడుగుపెడుతూనే.. సోల్డరింగ్ రాడ్ కొసన లెడ్ కాలుతున్న వాసన గమ్మత్తుగా ముక్కుపుటాలకు తాకుతుంది! ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ పరికరాలు, వైర్లు, బల్బులు, స్విచ్చులే కనిపిస్తుంటాయి! అలా అని టిపికల్ ఎలక్ట్రీషియన్ అనుకోడానికి వీల్లేదండోయ్!! బేసిగ్గా రామచంద్రయ్య రైతు! అప్పట్లో పదో తరగతి వరకు చదవడమే మహాభాగ్యం! అలా రామచంద్రయ్య టెన్త్ తో పుస్తకాలకు టాటా చెప్పేశాడు..! మెతుకు సీమలో పుట్టిన అదృష్టానికి తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని నమ్ముకుని నాగలి చేత పట్టాడు...!!

image


ఈరోజుల్లో రైతు గురించి చెప్పాలంటే ముందుగా అతని సాధకబాధకాలు వివరించాలి. ఆకలి గురించి చెప్పాలి. అప్పుల గురించి చెప్పాలి. వాన నీళ్ల గురించి చెప్పాలి. వానల కోసం పెట్టిన కన్నీళ్ల గురించి చెప్పాలి. దుక్కి దున్నింది మొదలు, పంట చేతికొచ్చి, దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బులతో అప్పులు కట్టి, మిగిలింది పిల్లల చదువుకు పెట్టి, తాను మాత్రం పస్తులుండే బాధల గురించి చెప్పాలి. వీటన్నిటికీ రామచంద్రయ్య అతీతుడేం కాదు!!

రైతు పంట వేయడంతోనే సరిపోదు. అతివృష్టి, అనావృష్టి, కరెంటు కోత.. ఇలా చాలా సమస్యలను ఎదుర్కోవాలి. అంతా బాగుందనుకుంటే కోతులు, అడవి పందులు పంటను బతకనీయవు. వాటిని తట్టుకోవడం ఎంత కష్టమో, వాటివల్ల పడే బాధలేంటో.. ఒక్క రైతుకు మాత్రమే తెలుసు. 24 గంటలు కాపలా ఉండాలి. లేకుంటే కన్నుమూసి తెరిచేలోపు పంటను పెంటపెంట చేస్తాయి. అయితే అవి జనావాసాల్లోకి, పంటపొలాల్లోకి రావడం మనం చేసుకున్న పాపమే. వాటి స్థావరాన్ని మనం కొల్లగొట్టాం. దాంతో అవి మనపైన దాడికి దిగాయి.. అది వేరే విషయం అనుకోండి. సరే, ఆ సంగతి పక్కన పెడితే, కోతుల్ని తరమాలంటే కొండముచ్చును తేవాలి. అయితే అదంత ఈజీగా అయ్యేపని కాదు. ఇక అడవి పందులంటారా.. వాటిని చంపడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అడవి పందులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. అడవి పందుల దాడిలో మనిషి చనిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు.

అందుకే రామచంద్రయ్య వాటికో ఉపాయం కనిపెట్టాడు. సోలార్ అనే మాట అతడి బుర్రలో పాదరసంలా కదిలింది. పైగా మొదట్నుంచీ సోలార్ తో సమాజానికి పనికొచ్చేది ఏదో చేయాలని తపన పడేవాడు. కానీ ఏం చేయాలన్నదానిపై క్లారిటీ ఉండేది కాదు. సోలార్ అనే మాట విన్నా, ఆ ప్యానెల్ చూసినా రామచంద్రయ్యలో ఉన్న ఒక సైంటిస్టు మేల్కొంటాడు. ఎప్పుడైతే ఈ కోతుల బాధ, అడవి పందుల కష్టం పెరిగిందో.. అప్పుడే మిణుకు మిణుకుమని బుర్రలో వెలిగే ఐడియా కాస్తా ఒక్కసారిగా ఆవిష్కరణగా మారింది.

ఇంతకూ సోలార్ తో ఏం చేశాడు..? అక్కడికే వస్తున్నాం..!! ఒక పోల్ తీసుకుని, దానికి చిన్నపాటి సోలార్ ప్యానెల్ అమర్చాడు. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తయారు చేశాడు. దానికి అనుసంధానంగా పైన ఒక బ్లింకింగ్ లైట్ ఏర్పాటు చేశాడు. దానికి ఇరుపక్కలా చిన్న లౌడ్ స్పీకర్లు పెట్టాడు. అందులో మూడు రకాల శబ్దాలు వస్తాయి. ఒకటి కుక్కలు అరిచినట్లు, రెండోది జనాలు ఉస్కో ఉస్కో అని తరిమినట్లు, మూడోది పోలీస్ సైరన్ మోగినట్టు. ఇలా మైకులోంచి మూడు రకాల సౌండ్లు వస్తుంటే.. ఆ శబ్దాలకు అనుగుణంగా లైట్ బ్లింక్ అవుతుంది. కాకపోతే పగలు పెద్దగా కనిపించదు. రాత్రిపూట మాత్రం దాని వెలుతురు వన్యప్రాణుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అరుపులు పెడబొబ్బలతో లైట్ గిరగిర తిరుగుతుంటే ఏం జంతువు మాత్రం పంటవైపు వస్తుంది చెప్పండి. ఈవెన్ ఎలుకలు కూడా ఎక్కడికో పారిపోతాయి.

image


పగలంతా ఈ పరికరం సోలార్ పవర్ తో చార్జ్ అవుతుంది. ఇందులో అమర్చిన టైమర్ సాయంతో సాయంత్రం ఆరు లేదంటే ఏడు గంటల నుంచి పని చేయడం మొదలుపెడుతుంది. తెల్లారి ఏడింటికి ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. సెట్ చేసిన టైం ప్రకారం ప్రతి పది నిమిషాలకోసారి పెద్దపెట్టున శబ్దం చేస్తుంది. ఆ సౌండుకి అడవి పందుల గుండె ఆగినంత పనవుతుంది. వరుసగా మూడు రకాల అరుపులు రావడంతో పందులు, కోతులు, కనీసం ఎలుకలు కూడా పంటవైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు సంతోషంతో చెప్తున్నారు. ఇప్పటికే కొందరు వీటిని పొలంలో అమర్చుకున్నారు. 

వాస్తవానికి పంట రక్షణ కోసం సోలార్ పెన్సింగ్ ఉంది కానీ.. ఎంతైనా దీనంత బెటర్ కాదనేది అక్కడి రైతుల అభిప్రాయం. నాలుగు సంవత్సరాలు అవుతున్నా, పెద్దగా రిపేర్ రాలేదని ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు. ఒక్కో సైరన్ పోల్ ఖరీదు 15వేల రూపాయలు. విలువైన పంటను కాపాడుకోడానికి, దీర్ఘకాలిక పరిష్కారం చూపుతున్న పరికరాన్ని.. ఆ మాత్రం పెట్టి కొనలేమా అంటున్నారు అక్కడి రైతులు. అంతేకదా మరి..

ఇక రామచంద్రయ్య మరో ఆవిష్కరణ- సోలార్ కారు. పాత మారుతీ 800 కారు పై భాగంలో సోలార్ ప్యానెల్ ను బిగించాడు. దాని నుంచి జనరేట్ అయ్యే కరెంటును ఇంజన్ కు అనుసంధానం చేశాడు. ఇంకేముంది కారు పరుగులు పెట్టింది. మైలేజ్ సుమారుగా 30-35 కిలోమీటర్లు ఇస్తుంది. రాత్రి వేళలో యదావిధిగా ఫుయెల్ తో నడుస్తుంది. మరికొన్ని ప్రయోగాలు చేస్తే ఇంచుమించు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని రామచంద్రయ్య చెబుతున్నాడు. సోలార్ ప్యానల్ అమర్చడానికి 40 వేల రూపాయలు ఖర్చుయిందని అంటున్నాడు. ప్రయోగ దశలో ఎక్కువ ఖర్చు అవుతున్నప్పటికీ, రానురాను వ్యయం తగ్గుతోందని అంటున్నాడు.

image


వీటితో పాటు చెప్పుకోదగింది సోలార్ లైటు గురించి. ఇది పంటలను నాశనం చేసే దోమలు, క్రిమికీటకాల పనిపడుతుంది. పురుగు మందుల అవసరం లేకుండా చేసిన మరో ప్రయోగమిది. ఈ లైటు వెలగగానే కీటకాలను ఆకర్షిస్తుంది. అవి వచ్చీరాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వలయానికి చిక్కుకొని చనిపోతాయి. ఇంకో విశేషమేంటంటే ప్రతీసారి లైట్ స్విచ్ వేయనవసరం లేదు. దీంట్లో అమర్చిన సెన్సార్ మూలంగా లైటు వద్దకు కీటకాలు వెళ్లీవెళ్లగానే ఆటోమెటిగ్గా వెలుగుతుంది. పురుగులు వలయంలో పడి గిలగిలాకొట్టుకుని చనిపోతాయి.

రామచంద్రయ్య ఇల్లొక ప్రయోగశాల. ఎటు చూసినా ఎలక్ట్రికల్ పరికరాలతో ఒక గ్యారేజ్ ను తలపిస్తుంది. ఇతని మేథాశక్తి గురించి తెలుసుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ స్వయంగా రామచంద్రయ్య ఇంటికి వచ్చి పరిశీలించి.. అభినందించారు. అంతేకాదు కలెక్టర్ గా తనవంతు సాయం చేస్తానని కూడా ప్రకటించారు. ప్రభుత్వం తరుపున ఎంతోకొంత ఆర్ధికంగా చేయూతనిస్తే రైతుకోసం మరెన్నో ప్రయోగాలు చేస్తానని రామచంద్రయ్య నమ్మకంగా చెబుతున్నారు.