దివ్యాంగుల జీవితాల్లో ఆశాజ్యోతి.. వైకల్యాన్ని అధిగమించి సమాజసేవకు అంకితమైన యువతి

దివ్యాంగులు, మహిళా సాధికారత కోసం శ్రమిస్తున్న పూనమ్

6th May 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


చాలామంది చిన్నచిన్న కష్టాలకే భయపడిపోతుంటారు. తమకొచ్చిన కష్టంకన్నా పెద్దది ప్రపంచంలో ఇంకేదీ ఉండదని భ్రమపడుతుంటారు. కానీ నిజానికవి కష్టాలు కాదు. మనిషి ఎదిగేందుకు సోపానాలు అని గ్రహించరు. బాధను మరిచి వివేకంతో ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా ఆలోచించి జీవితంలో ముందుకు సాగేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే భోపాల్ కు చెందిన పూనమ్ శ్రోతి. 

జీవితంలో ఎదురైన కష్టాలను చిరునవ్వుతో ఎదురించడమే కాదు ఎంతో మంది చీకటి జీవితాల్లో వెలుగు దివ్వె అయ్యారు. శారీరక వైకల్యాన్ని జీవితంలో ఎదుగుదలకు అడ్డుగా భావించి లోలోపల కుమిలిపోయే దివ్యాంగులకు ఆశాజ్యోతిగా మారారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి, మహిళా సాధికరతతో పాటు దివ్యాంగులు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు పూనమ్ శ్రోతి.

image


ఆస్టియో జెనిసిస్ ఇంపర్ఫెక్టా. ఎముకలు గుల్లబారే వ్యాధి. చిన్నదెబ్బ తగిలినా శరీరంలో ఎముకలు పటపట విరిగిపోతాయి. 31 ఏళ్ల పూనమ్ కూడా చిన్నప్పుడే ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్ష మందిలో ఏ ఒకరికో ఇద్దరికో వచ్చే ఈ అరుదైన వ్యాధి. దాని కారణంగా ఆమె ఎత్తు 2 అడుగుల 8అంగుళాలకు మించలేదు. ఆమె వయసు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువసార్లు ఎముకలు విరిగాయి. వాటిని అతికించేందుకు ఎన్ని ఆపరేషన్లు చేశారో కూడా ఆమెకు గుర్తులేదు. అయినా కుంగిపోకుండా తను సంతోషంగా బతకడమే కాదు ఇతరులు కూడా ఆనందంగా బతికేందుకు అవసరమైన జీవిత పాఠాలు నేర్పుతోంది. తలరాతను తిట్టుకోకుండా సమాజహితం కోసం పాటుపడుతోంది.

image


వ్యాధి కారణంగా బిడ్డ ఎదుగుదల లోపాన్ని చూపి పూనమ్ తల్లిదండ్రులు మొదట బాధపడ్డారు. అయితే తమ కూతురి టాలెంట్ ను గ్రహించి ప్రోత్సహించారు. భోపాల్ కేంద్రీయ విద్యాలయం నుంచి 12వ తరగతి పూర్తి చేసిన పూనమ్.. ఆ తర్వాత డిగ్రీ, ఫైనాన్స్ లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఎంబీఏ అనంతరం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో HR కూడా పూర్తి చేసింది పూనమ్. 

image


చదువు సాఫీగా సాగినా.. ఉద్యోగం విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది పూనమ్. ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఏదో ఒక సాకుతో ఉద్యోగమిచ్చేందుకు నిరాకరించేవారు. ఇంటర్వూకు వచ్చిన వాళ్లందరి కన్నా ఎక్కువ తెలివితేటలున్నా.. శారీరక వైకల్యం కారణంగా అవకాశం ఇచ్చేవారు కాదు. ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన తర్వాత.. ఎట్టకేలకూ ఓ కంపెనీ ఆమెను ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్ చేసుకుంది. నిజానికది పూనమ్ అర్హతలకు తగ్గ ఉద్యోగం కాదు. అయినా దాన్నో సవాల్ గా తీసుకుంది. మిగతా వారిలాగే తాను కూడా పనిచేయగలనని నిరూపించాలనుకుంది. దాదాపు ఐదేళ్ల పాటు అదే కంపెనీలో పనిచేసిన ఆమె డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి చేరింది. అయితే సమాజం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో జాబ్ కు గుడ్ బై చెప్పింది.

image


ఉద్యగం చేస్తున్న సమయంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొన్న పూనమ్.. తనలాంటి వారెవరూ అలాంటి కష్టాలు పడొద్దని కోరుకునేది. జాబ్ మానేశాక సమాజ సేవకు అంకితమవ్వాలని నిర్ణయించుకుంది. 2014లో ఉద్దీప్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసింది. తనలాంటి దివ్యాంగులు మనసుకు నచ్చిన పని చేసి సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సాయం చేయాలన్నదే ఆమె లక్ష్యం. ప్రస్తుతం పూనమ్ ఉద్దీప్ ద్వారా దివ్యాంగులకు సాయం చేయడంతో పాటు గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికరత కోసం పనిచేస్తోంది. 

image


దివ్యాంగుల సాధికారిత కోసం పూనమ్ గత రెండేళ్లుగా“కెన్ డూ” పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది. దివ్యాంగులు ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు సాగేలా ప్రోత్సహించడమే కెన్ డూ ప్రధాన ఉద్దేశం. తాము సాధారణ వ్యక్తులతో సమానమేనన్న భావన దివ్యాంగుల్లో కలిగించేందుకు శిక్షణ, అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తోంది. వీటితో పాటు భోపాల్ చుట్టుపక్కల గ్రామాల మహిళల సాధికారిత కోసం కృషి చేస్తోంది. వారికి చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తోంది. స్వచ్ఛ్ భారత్ లో భాగంగా పలు గ్రామాల్లో జరిగే పరిశుభ్రతా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ తనవంతు సాయం చేస్తోంది.

పూనమ్ కృషి ఫలితంగా భోపాల్ సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన మహిళలు 15మంది చొప్పున సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడ్డారు. వారంతా పేపర్ బ్యాగ్, ఇతర వస్తువుల తయారీ నేర్చుకుని ఎంతో కొంత ఆదాయాన్ని గడిస్తున్నారు. వీరికి అవసరమైన ముడి సరుకును పూనమ్ అందిస్తోంది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా వివిధ కారణాల వల్ల చదువుకు దూరమైన మహిళలు మళ్లీ పుస్తకం పట్టేలా ప్రోత్సహించింది పూనమ్. అంతేకాక గ్రామీణ ప్రాంత పిల్లలందరూ చదువుకునేలా కృషి చేస్తోంది. వారికి చదువుపై ఆసక్తి కలిగించేందుకు కంప్యూటర్ పాఠాలు నేర్పుతోంది.

image


ఉద్దీప్ సంస్థ ప్రారంభించినప్పుడు పూనమ్ దివ్యాంగులకు ఉద్యోగాలిప్పించమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వారిని కలిసి మాట్లాడాక నిర్ణయం మార్చుకుంది. దివ్యాంగులు చదువులో మెరికల్లాంటి వారైనా వారిలో ఆత్మవిశ్వాసం తక్కువన్న విషయం గ్రహించింది. అందుకే మొదట శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసింది. చాలా వరకు విజయం సాధించింది.

image


ఉద్దీప్ శిక్షణా తరగతులకు వచ్చిన పిల్లల్లో కొందరు ఇప్పుడు బీటెక్, బీసీఏ కోర్సులు చేస్తున్నారు. వారికి చదువులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంస్థ వాలెంటీర్లు సాయం చేస్తారు.

చదువు పూర్తయ్యాక వారికి కంపెనీల్లో ప్లేస్ మెంట్ ఇప్పించే బాధ్యతను కూడా పూనమ్ తన భుజానే వేసుకుంది. దివ్యాంగులకు ఉద్యోగమిచ్చేందుకు ఓ కంపెనీ ఉద్దీప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దివ్యాంగుల కోసం ఎంతో చేయాలని ఉన్నా నిధుల కొరత వేధిస్తోంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్న సొమ్ముతోనే ఇప్పటి వరకు సంస్థను నడిపిస్తోంది. వాలెంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటం కూడా పూనమ్ ఆశయ సాధనలో మరో అవరోధంగా మారింది.

దివ్యాంగులకు సేవ చేయాలన్న సంకల్పంతో కొంత మంది మనస్ఫూర్తిగా కలిసి పనిచేసేందుకు ముందుకొస్తారు. మరికొందరు మాత్రం మంచి జీతం వస్తుందనుకున్నప్పుడు మాత్రమే ఈ పని చేసేందుకు ఇష్టపడతారు.

సమాజంలో మంచి, చెడు ఉన్నట్లే ఈ రెండు రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల్ని చూశానంటారు పూనమ్. ఎవరైనా తనపట్ల వివక్ష చూపినా కుంగిపోకుండా దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం నేర్చుకున్నానంటారు.

image


పూనమ్ టీంలోని వాలెంటీర్లలో చాలా మంది ఆమె స్నేహితులే. ప్రస్తుతం 11మంది ఉద్దీప్ కోసం పనిచేస్తున్నారు. వారిలో ఐదారుగులు యాక్టివ్ మెంబర్లున్నారు. పూనమ్ చేస్తున్న సేవలకు ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోంది. దేశంలో సమాజ సేవ చేస్తున్న 100 మంది ప్రముఖ మహిళల్లో ఒకరిగా నిలిచిన పూనమ్.. ఈ మధ్యే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఉద్దీప్ సంస్థ సేవల్ని మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో ఉంది. సమస్యలకు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించాలనే పూనమ్ ఆలోచన నిజంగా ప్రశంసనీయం. దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగాలని యువర్ స్టోరీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

“ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అన్నప్పుడు ఆ పని కచ్చితంగా పూర్తి చేసి చూపిస్తాను. ఈ ఆలోచనా విధానమే నాలో పాజిటివ్ ఎనర్జీని నింపిది“ - పూనమ్


  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India